నిన్న కోకాపేట … నేడు బుద్వేలు.. రేపు షాబాద్.. ఆ తర్వాత మరో చోట వేలంపాటలు సాగుతూనే ఉంటాయి. తెలంగాణ ప్రజల ఆస్తిని పప్పు బెల్లాల్లా అమ్ముతూనే ఉంటారు. ఖజానాకు వచ్చే ఆదాయాన్ని ఎన్నికల ఖర్చులకు వాడుకుంటూనే ఉంటారు. సంపద సృష్టించి ప్రజలకు పంచుతామని కేసీఆర్ చెప్పే మాటలకు అర్థం ఇదేనా ?. తమ వారసుల భవిష్యత్ కోసం.. తెలంగాణ భవిష్యత్‌ను కేసీఆర్ తెగనమ్ముతున్నారని వస్తున్న విమర్శల్లో నిజంలేదా ? తెలంగాణ ప్రయోజనాల కోసం దేనకైనా తెగిస్తామని చెప్పే కేసీఆర్ ఇప్పుడు సొంత ప్రయోజనాల కోసం తెలంగాణను తెగనమ్మడానికి సిద్ధమపడుతున్నారా ?
దేశంలోనే కాదు.. ప్రపంచంలో మరే దేశంలో జరగనంత అభివృద్ధి తెలంగాణలో జరిగిందని కేసీఆర్ అసెంబ్లీలో నిర్మోహమాటంగా ప్రకటించారు. ఇంత అభివృద్ది జరిగిన రాష్ట్రం ఎక్కడైనా ఆస్తులను అమ్ముకుంటుందా అనేది అందరికీ వచ్చే సందేహం. అది నిజమే. కేసీఆర్ ఎందుకు భూములు ఎకరాలకు ఎకరాలు అమ్మకానికి పెడుతున్నరు ?. ఇలా భూములు అమ్మాల్సిన అవసరం ఏముంది ?. తెలంగాణకు ఆదాయం కొదవ లేదు. ధనిక రాష్ట్రామని కేసీఆర్ గొప్పలు చెబుతున్నారు. మరి ఎందుకు ఇలా అప్పులు.. భూములు అమ్మకాలు చేస్తున్నారంటే … ఒకటే కారణం. అదే ఎన్నికల్లో గెలవడం. వచ్చే ఎన్నికల్లో మూడో సారి ఎన్నికల్లో గెలవడం ద్వారా ఆయన తెలంగాణలో తన స్థానాన్ని .. తన కుటుంబ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటున్నారని ఎవరికైనా అనిపిస్తే అందులో తప్పేం లేదు.
తెలంగాణకు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట నిజం. జీతాలు హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో ఒకటో తేదీ ఇవ్వడం లేదు. ఈ సమస్యలు ఎందుకు వచ్చాయంటే.. ఆదాయం లేకపోవడం కాదు. కేవలం దుబారా వల్లనే వచ్చాయి. హైదరాబాద్ లాంటి నగరం ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు అనేవి ఉండకూడదు. కానీ.. ఎంత ఆదాయం వచ్చినా ఆదాయానికి మించి ఖర్చు పెడితే మాత్రం ఆర్థిక సమస్యలు తప్పవు. ఈ ఆర్థిక సూత్రాన్ని మర్చిపోయారు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అలవి మాలిన హామీలు ఇచ్చారు. వాటిని అరకొరగా అయినా అమలు చేయడానికి నిధులు కావాలి. ఇప్పటికే చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి.. ఉద్యోగుల జీత భత్యాలు ఇవ్వడానికి ఆదాయం సరిపోవడం లేదు. మరి ఎన్నికల హామీలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఒకే ఒక్క ఆప్షన్ .. ఆస్తులను అమ్మేయడం. వ్యసనాలకు బానిసైన కుటుంబ పెద్ద .. కన్నుమిన్నూ ఆస్తులను తెగనమ్మి ఖర్చు చేస్తాడు. అంతా తెలుసుకునేసరికి మొత్తం సర్వనాశనం అయి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ కుటుంబ పెద్దగా కేసీఆర్ కూడా.. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న ఓ వ్యసనానికి గురయ్యారు. అందుకే ఆయన ముందూ వెనుకా చూడకుండా నిధుల కోసం.. ఆస్తుల్ని అమ్మేస్తున్నారు. ఎకరాల కొద్దీ వేలం వేస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు వేలం జరగని రోజంటూ లేదంటే అతిశయోక్తి కాదు.
తెలంగాణ ప్రభుత్వానికి ఇంత డబ్బుల అవసరం ఎందుకు వచ్చిందంటే.. ఒకటే కారణం… భరించలేన్ని స్కీముల్ని ప్రకటించడం. బడ్జెట్లో కేటాయింపులు చేయడం. దళిత బంధు పథకానికి ఈ ఏడాది 17700 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ ఎక్కడ నుంచి తెచ్చి రిలీజ్ చేస్తారు ?. ఈ పథకం ఇలా ఉండగానే.. గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించారు. ఇళ్లు లేని పదలకు మూడు లక్షలు ఇచ్చే పథకం ఇది. ఈ పథకం కోసం 7350 కోట్లు అవసరం. ఇక జీత భత్యాలు, పెన్షన్లు, ఉచిత విద్యుత్ వంటి సబ్సిడీలకు చెల్లించాల్సింది చాలానే ఉంది. కానీ ఆదాయం మాత్రం ఊహించనంతగా .. బడ్జెట్లో అంచనాలు వేసినoతగా రావడంలేదు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో తెలంగాణ రెవిన్యూ రిసీప్ట్స్ 35024 కోట్లు. ఇది పూర్తిగా ఆదాయం కాదు..ఇందులో అప్పులు కూడా ఉన్నాయి. మూడు నెలల్లో తెచ్చిన అప్పులు 15,876 కోట్లు కలిపి వచ్చిన రెవిన్యూ రీసిప్ట్స్ అవి. బడ్జెట్ అంచనాల్లో ఇది పదహారు శాతమే. లెక్క ప్రకారం అయితే పాతిక శాతం రావాల్సి ఉంది.
అప్పులు లెక్కలకు మిక్కిలిగా చేస్తూండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులపై పరిమితి విధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ రుణాలు 42, 225 కోట్లు తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. గత ప్రభుత్వం అధికారంగా తీసుకున్న 15 వేల కోట్ల రుణాలను మినహాయించిన తర్వాత ఈ మొత్తం అనుమతి ఇచ్చింది. దీంతో ఇతర మార్గాల నుంచి అప్పులు తెచ్చేకునేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోంది. ఇందులో కొన్ని ప్రయత్నాల్లో వేల కోట్లు అప్పులు తెస్తోంది. కార్పొరేషన్ల పేరుతో రుణాలను అంతకంతకూ పెంచుకుంటోంది.
ఓ వైపు అప్పులు చేస్తున్నారు.. మరో వైపు ఆస్తులు అమ్మేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు ? ప్రజలకు డబ్బులు పంచకపోతే ఓట్లేయరా ? తెలంగాణ ఆస్తులు అమ్మేసి.. విజయం సాధించేది కుటుంబ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసమేనా ? ఇందు కోసంతెలంగాణ భవిష్యత్‌ను అంధకారం చేస్తున్నారా ?
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అధికార వ్యతిరేకత ఎలా ఉంటుందో తెలుసు. పదేళ్లుగా అధికారంలో ఉన్న ఆయనకు తెలంగాణలో ఉన్న పరిస్థితులపై అవగాహన ఉంది. అందుకే..ఎన్నికల్లో గెలవడానికి ఆయన అన్ని రకాల టాస్కులు అమలు చేస్తున్నారు. ప్రధానంగా ఆయన నమ్ముకుంటున్నది.. ప్రజల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం. వేయి.. రెండు ఇవ్వడం కాదు.. లక్షల్లో ఇవ్వడం.. లక్షల్లో ఇస్తామని ఆశ కల్పించడం ద్వారా ఆయన ఓట్లు పొందాలనుకుంటున్నారు. నిజానికి దళిత బందు అమలు చేయాలంటే.. పదేళ్ల తెలంగాణ బడ్జెట్ కూడా సరిపోదు. కేవలం ఒక్క ఏడాది పదిహేడు వేల మందికి ఇవ్వడానికి కూడా తంటాలు పడుతున్నారు. ఇవ్వలేపోయారు. అలాంటి లక్షలు పంపిణీ చేసే పథకాలు మైనార్టీ బంధు, బీసీ బంధు.. గృహలక్ష్మి వంటివి ప్రారంభిస్తారు. వీటికి నిధులను తెలంగాణ సంపదను అమ్ముతున్నారు. మూడో సారి గెలవాలంటే ప్రతీ ఇంటికి లక్షలు పంచాల్సిందేనని కేసీఆర్ డిసైడయ్యారు. అయితే కేసీఆర్ అమ్ముతున్నది భూములు కాదు..తెలంగాణ భవిష్యత్‌ను.
కేసీఆర్ మూడో సారి గెలవకపోతే.. బీఆర్ఎస్ ఉనికికి కాపాడుకోవడం కష్టమని అంచనాలో ఉన్నారు. రెండు జాతీయ పార్టీల మధ్య ఉనికి కాపాడుకోవడం అంత తేలిక కాదు. కేసీఆర్ రాజకీయం తెలంగాణ సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంది. ఇతర పార్టీలకు ఉన్నట్లుగా సామాజిక వర్గాల మద్దతు లేదు. తెలంగాణనే బీఆర్ఎస్ సామాజికవర్గం. కానీ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసిన తర్వాత ఆ శక్తిని వదులుకునేందుకు సిద్ధపడినట్లయింది. ఇప్పుడు గెలవకపోతే.. ఇంకెప్పుడూ మఖ్యంగా తన వారసులు రాజకీయాల్లో నిలబడలేనరి కేసీఆర్ ఆందోళనగా ఉన్నారు. అందుకే.. ఎంత చేసి అయినా సరే గెలవాలనుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తన కుమారుడు కేటీఆర్.. ఆ తర్వాత ప్రాణంగా చూసుకునే మనవడు హిమాంశు రాజకీయ భవిష్యత్ అద్భుతంగా ఉండాలని.. బీఆర్ఎస్ వారసత్వమే వెలుగులీనాలని ఆయన కోరుకుంటున్నారు. అందులో సందేహం లేదు. అందు కోసమే..ఇప్పుడు తెలంగాణ భవిష్యత్‌ను అమ్మేసి.. రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
కేసీఆర్ ఇలా భూముల్ని అమ్మేది తెలంగాణ కోసమే.. అయితే ఇంతగా అభ్యంతర పెట్టాల్సిన పని ఉండేది కాదు. కానీ కేసీఆర్ పూర్తిగా వ్యక్తిగత స్వార్థం కోసమే.. చేస్తున్నారు. వారసుల కోసం తెలంగాణ ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నారు. దీనికి మరో ఉదాహరణ ఆర్టీసీ విలీనం. అసలు ఓ కార్పొరేషన్ కింద ఉన్న ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేదే తుగ్లక్ నిర్ణయం. గతంలో ఏపీలో ఇలా చేసినందుకు కేసీఆర్ అదే మాట అన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ ఎందుకు చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యోగుల్ని ప్రభుత్వంలో భాగం చేసి..కార్పొరేషన్ ను అలాగే కొనసాగించడం అంటే.. ప్రజాధనం జీతాలుగా ఇచ్చి.. వేరే సంస్థ కోసం వారిని పని చేయించడం లాంటిది. ఇలాంటివి పరిపాలననలో బ్యాడ్ ప్రాక్టిసెస్ కిందకు వస్తాయి. అయినా కేసీఆర్ అడుగు ముందుకే వేస్తున్నారు. ఇదంతా తెలంగాణ సమాజానికి ప్రజలకు ద్రోహం చేయడానికే.
తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు ఎంతకైనా సిద్ధమని కేసీఆర్ గతంలో ప్రకటించేవారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కు.. తెలంగాణ అంటే కుటుంబం అన్నట్లుగా మారిపోయింది. కుటుంబ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రయోజనాలతో ఆటలాడుకుంటున్నారు. తెలంగాణ సమాజం దీనిని గుర్తిస్తే..ఆయనకు గుణపాఠం చెప్పేందుకు కూడా వెనుకాడరనేది ఎక్కువ మంది అభిప్రాయం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…