టీడీపీలో కేశినేని పోస్టుల కలకలం
పార్టీ వ్యవహారాలపై బహిరంగ విమర్శలు
నాని తీరుపై అధిష్టానం సీరియస్
షోకాజ్ నోటీసులంటూ సోషల్ మీడియాలో..
వైరల్ అవుతోన్న ఓ ప్రెస్ నోట్
టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని అధినాయకత్వానికి తలనొప్పిగా మారారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా సొంత పార్టీ నేతలపై విమర్శలు ఎక్కుపెడుతూ.. అధిష్టానానికి చిరాకు తెప్పిస్తున్నారు. పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా కేశినేనితో మంతనాలు జరిపినా ఆయన తన వైఖరి మార్చుకోలేదు. తరచూ పార్టీ పెద్దలు, నేతలపై తనదైన సెటైర్లతో విరుచుకుపడుతూనే ఉన్నారు. మరోసారి తన నోటికి పనిజెప్పారు. కేశినేని నాని తాజాగా చేసిన ఓ పోస్టు టీడీపీలో కలకలం రేపుతోంది. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే వారిపై చర్యలుంటాయంటూ నెట్టెం రఘురాం చేసిన కామెంట్స్ పై…కేశినేని ఘాటుగా స్పందించారు. ఛ నిజంగా..క్రమశిక్షణ ఉల్లంఘించిన వారి లిస్టు పంపిస్తాం.. రుజువులతో సహా చర్యలు తీసుకుంటారా మరి ..అంటూ కేశినేని ఫేస్ బుక్ లో ప్రశ్నించారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ తిరుగుతుండగా …కేశినేనికి షోకాజ్ నోటీసులంటూ మరో ప్రెస్ నోట్ వైరల్ అవుతోంది.
కేశినేని నాని వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ అయ్యిందని.. కేశినేని నానికి షోకాజ్ నోటీస్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఏదైనా అంతర్గత విషయాలుంటే ..అధినేత తో కానీ, పార్టీ క్రమశిక్షణ సంఘంతో కానీ మాట్లాడకుందాం….అంతేగానీ ఇలా బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం బాధాకరం. పార్టీ సందిగ్ధ దశలో ఉన్నపుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదని ప్రెస్ నోట్ లో ఉంది. చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం కేశినేని నానికి షోకాజ్ నోటీసు జారీ చేయడం జరిగిందని…వారం రోజుల్లోగా నాని పార్టీకి వివరణ ఇవ్వాలని కోరుతున్నామంటూ ప్రెస్ నోట్ లో ప్రస్తావించారు. దీనిపై నాని ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆ ప్రెస్‌నోట్ ఫేక్ అని తమ్ముళ్లు అంటున్నారు.
విజయవాడ నుంచి వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు కేశినేని. రెండో పర్యాయం గెలిపొందాక పార్టీతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లా టీడీపీ నేతలతో కేశినేనికి పొసగడం లేదట. పార్టీలో తనకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని..స్థానిక టీడీపీ నేతల తీరుపై మండిపోతున్న నాని…..సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. సొంత పార్టీ వ్యవహారాలపై పోస్టులు పెడుతూ బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వచ్చిన సమయంలోనూ బోకేను పక్కకు నెడుతూ అసహనం ప్రదర్శించారు. అంతకుముందు కూడా అధినేతపై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఇక, కృష్ణా జిల్లా సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా.. కొందరు నేతలు తొడ గొట్టి కొడాలి నానిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామంటూ సవాల్ చేసారు. దీని పైనా కేశినేని నాని స్పందించారు. తొడలు కొట్టి..మీడియా లో మాట్లాడితే హీరోలు కాలేరని.. ప్రజల మధ్య రాజకీయం చేయాలని వ్యాఖ్యానించారు. ఇలా..వరుసగా పార్టీలో పరిణామాల పైన నాని స్పందిస్తున్న తీరు..పలు చర్చలకు కారణమవుతోంది.