కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఫాం లోకి వచ్చారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ లోక్ సభ సాక్షిగా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కొంత గ్యాప్ తర్వాత వచ్చిన రాహుల్ గాంధీ నయా జోష్ తో మాట్లాడారు. ప్రభుత్వాన్ని కంగారు పెట్టారు. మణిపూర్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. రాహుల్ మాట్లాడుతున్నంత సేపూ అడుగడుగునా విపక్ష సభ్యులు చప్పట్లతో మద్దతు తెలిపారు.ఇది పాలక పక్షాన్ని కాస్త అసహనానికి గురి చేసింది. అందుకే పదే పదే వారు రాహుల్ ప్రసంగానికి అడ్డు తగిలారు. ఆటంకాలు సృష్టించారు.అనర్హత వేటు తొలగిన తర్వాత మొదటి సారి లోక సభలో చేసిన ప్రసంగమే అదరగొట్టడంతో కాంగ్రెస్ శ్రేణులతో పాటు విపక్షాల్లోనూ జోష్ పెరిగిందనే చెప్పాలి.
మణిపూర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో వివరణ ఇవ్వాలన్న డిమాండ్ తో విపక్ష కూటమి అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై జరుగుతోన్న చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. మణిపూర్ ను రెండు ముక్కలు చేసి వినోదం చూస్తున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ. మణిపూర్ లో ప్రభుత్వ నిర్వాకంతో భారతమాతను హత్యచేశారని రాహుల్ ధ్వజమెత్తారు. మీరు దేశ భక్తులు కారు దేశ ద్రోహులు అని దుయ్యబట్టారు. మణిపూర్ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచారని విమర్శించారు. భారత మాతను హతమార్చారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండి పడ్డారు.
ప్రసంగం ఆరంభించేముందు తాను రాజకీయ ప్రసంగం చేయబోవడం లేదన్నారు రాహుల్ గాంధీ. కంగారు పడకండి నేను ఆదానీ గురించి మాట్లాడబోవడం లేదు. గతంలో ఆదానీ అవినీతి గురించి మాట్లాడితే కొందరు పెద్దలకు కోపం వచ్చింది అంటూ సెటైర్ వేశారు. ఒకటి రెండు తూటాలు పేలితే పేలతాయి అంతకు మించి ఏం కాదు కంగారు పడకండి అంటూ వ్యంగ్యోక్తి విసిరారు. రాజకీయ ప్రసంగం చేయడానికి రాలేదు. మణిపూర్ గురించి మాట్లాడ్డానికే వచ్చా. మణిపూర్ లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో స్వయంగా వెళ్లి చూశాను. తమ కళ్లెదుటే తమ బిడ్డను కాల్చి చంపిన దుర్మార్గ దృశ్యాలను తలచుకుని కలత చెందే తల్లుల బాధను తెలుసుకున్నాను. వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీయడానికే నేను వచ్చాను అంటూ భావోద్వేగంతో ప్రసంగించారు రాహుల్ గాంధీ.
రెండున్నర నెలలుగా మణిపూర్ భగ్గుమంటోందన్న రాహుల్ తాను స్వయంగా అక్కడికెళ్లి బాధితులను పరామర్శించి పరిస్థితులను పరిశీలించి వచ్చానన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ ఇంత వరకు ఈ పని ఎందుకు చేయలేకపోయారో చెప్పాలని రాహుల్ గాంధీ నిలదీశారు. ప్రధానిగా అది మోదీ బాధ్యత కాదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని రావణుడితో పోల్చారు రాహుల్ గాంధీ. రావణుడు మేఘనాథుడు, కుంభకర్ణుడు మాటలు మాత్రమే విన్నాడు. అలాగే నరేంద్ర మోదీ..అమిత్ షా, ఆదానీలు చెప్పింది మాత్రమే చెవికెక్కించుకుంటున్నారు అంటూ చురకంటించారు.
భారత్ జోడో యాత్ర గురించి కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేశాను. చాలా రాష్ట్రాల మీదుగా యాత్ర చేశాను. లక్షమందికి పైగా ప్రజలతో మమేకం అవ్వగలిగాను .వారి జీవితాలు అర్దం చేసుకున్నాను. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాను. యాత్ర లో చాలా నేర్చుకున్నాను. యాత్రకు ముందు నాలో చాలా అహంకారం ఉండేది. యాత్రలో అది కాస్తా పటాపంచలైపోయింది.అని రాహుల్ గాంధీ తన యాత్ర అనుభవాలను సభ్యులకు వివరించారు.
రాహుల్ ప్రసంగంలో ప్రభుత్వంపైనా ప్రధానిపైనా తీవ్రమైన వ్యాఖ్యలు ఉండడంతో పాలక పక్ష సభ్యులు ఆద్యంతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విపక్షాలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ సమయంలోనే రాహుల్ గాంధీ సభ నుండి వెళ్లిపోయారు. హరియాణాలో ఆదివాసీల ర్యాలీలో పాల్గొనాల్సి ఉండడంతో రాహుల్ గాంధీ వెళ్లిపోయారు. కాకపోతే రాహుల్ ప్రసంగం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…