షర్మిల – ఉవ్వెత్తున ఎగిసిపడి.. ఏమిటీ ఎండ్ కార్డ్ !
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలీ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టేనా.. అసలు ఆమె తెలంగాణలోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చినట్లు అంత భారీ డైలాగులు ఎందుకు వదిలినట్లు. ఇప్పుడు గత్యంతరం లేనట్లుగా కాంగ్రెస్ లో విలీనం ఎందుకు చేస్తున్నట్లు.. ఆమె కూడా చిరంజీవి టైపులో తయారవుతున్నారా.. ఆ విషయంలో చిరంజీవే బెటరా..
సర్లే ! ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏమిటి.. అనేదీ బాలకృష్ణ సినిమా డైలాగ్. ఇప్పుడు షర్మిలకు ఆ డైలాగ్ అతికినట్లే సరిపోతుంది.తెలంగాణకు కాబోయే సీఎం అన్నంత రేంజ్ లో బిల్డప్ ఇచ్చి, చివరకు ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసేందుకు రెడీ అవుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. వాపు కూడా లేని చోట బలుపు అనుకుని షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి దిగడమే పెద్ద మైనస్ పాయింట్. బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి వచ్చింది కదా నాకు మాత్రం ఎందుకు రాదన్న ఆశతో హస్తం పార్టీ జెండా పట్టుకోవడం కూడా పొరబాటే అవుతుంది. గతంలో చిరంజీవి తన పార్టీ పీఆర్పీని కాంగ్రెస్ లో కలిపేసి ఇచ్చిన పదవిని తీసుకుని ఇప్పుడు సైలెంట్ అయిపోయినట్లుగా షర్మిల రాజకీయ జీవితం కూడా తయారవుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి….
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలా రెడ్డి రాజకీయ జీవితం ఇంత తొందరగా ఇలాంటి టర్న్ తీసుకుంటుందని ఎవరూ అనుకుని ఉండరు. భాష,యాస, ప్రవర్తన అంతా ఆంధ్ర రూట్లో ఉండే షర్మిల..అసలు తెలంగాణలోకి ఎంట్రీ ఎందుకు ఇచ్చారన్న అనుమానాలు చాలానే కలిగాయి. అన్న జగన్ రెడ్డి మీద అలిగి తెలంగాణలో పార్టీ పెట్టారని కొన్ని పత్రికల్లో పెద్ద అక్షరాలతో ఆమె రాయించుకున్నా ఆ మాటలను ఎవరూ విశ్వసించలేదు.తెలంగాణ భాషలో చెప్పాలంటే జరూర్ దాల్ మే కుఛ్ కాలా హై అన్న వాదన వినిపించింది. తొలుత తెలంగాణలో చక్రం తిప్పేసి, తాను స్థాపించిన వైఎస్సార్టీపీని డెవలప్ చేసి తర్వాత ఏపీలోకి కూడా ఎంట్రీ ఇస్తారని ఆమె కొన్ని పత్రికల్లో రాయించుకున్నారు.ఆ మాట వినడానికి విడ్డూరంగానే అనిపించింది. ఎందుకంటే తెలంగాణలో ఆమె పార్టీ పెట్టిన తర్వాత రెండు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో పోటీ చేసే ధైర్యంగా లేక ఆమె దూరంగానే ఉండిపోయారు. ఎన్నికలు సజావుగా సాగడం లేదు కాబట్టే బరిలోకి దిగడం లేదని షర్మిల ప్రకటించారు. ఒక అసెంబ్లీకే పోటీ చేయలేని వాళ్లు 119 స్థానాల్లో ఒకే సారి పోటీ చేసే సత్తా ఎక్కడ నుంచి తెచ్చుకుంటారని ఆమె చెప్పలేకపోయారు. కట్ చేసి చూస్తే ఏకంగా పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి ఏదోక పోస్ట్ ఇచ్చేసి పరువు కాపాడండయ్యా అని వేడుకుంటున్నారు.
వైఎస్సార్టీపీ పెట్టిందే తడవుగా షర్మిల పాదయాత్ర ప్రారంభించి 3,800 కిలోమీటర్లు నడిచారు.పాదయాత్రల సీజన్ లో అనుకుని ఇతర పార్టీల వాళ్లు ఊరుకున్నారు. ప్రజా నాయకుడు వైఎస్సార్ కూతురు అనేసరికి చూడటానికి పెద్ద సంఖ్యలోనే జనం వచ్చారు.కాకపోతే వాళ్లంతా ఓటేస్తారని షర్మిలకు ధైర్యం రాలేదు. పైగా పాలేరు నుంచి తానే పోటీ చేస్తానని అక్కడ ఇల్లు కట్టుకుంటున్నా.. బీఆర్ఎస్ తరపున తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తే పరిస్థితేమిటన్న ఆందోళన ఆమెలో కలిగింది. ఆమె కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా వెళ్లిపోయి కాంగ్రెస్ లో చేరడంతో షర్మిలకు తత్వం బోధపడినట్లుంది. వైఎస్సార్టీపీని విస్తరించడం అంత సులభం కాదని షర్మిలకు అర్థమైంది. రోజు వారీ సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధించినా కూడా ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. అసలు షర్మిల అనే ఒక నాయకురాలు తెలంగాణలో ఉన్నారని గుర్తించేందుకు ఇతర పార్టీలు ఇష్టపడలేదు. వైఎస్ పేరు పదే పదే చెప్పుకున్నా కేడర్ డెవలప్ అయ్యే అవకాశం రాలేదు. బహుశా చేతిలో ఉన్న డబ్బులు అయిపోయి ఉండొచ్చు. పార్టీ నడిపించేందుకు చిల్లిగవ్వ లేకుండా పోయి ఉండొచ్చు. దానితో ఇక లాభం లేదనుకుని.. షర్మిల కాంగ్రెస్ వైపుకు వెళ్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ లో చేరే విషయంలోనూ షర్మిల పొరపాటు చేస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ శాఖను ఆమె సంప్రదించారా లేదా అన్న డౌట్సు వస్తున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను రెండు పర్యాయాలు కలిశారే తప్ప… తెలంగాణ శాఖ నేతలతో ఆమె టచ్ లోకి వెళ్లలేదు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆమెకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చేశారు. ఆమె ఎక్కడ పోటీ చేయాలి, ఆమెకు కాంగ్రెస్ లో ఎలాంటి పదవి ఇస్తారనే అంశాలపై క్లారిటీ వచ్చిన తర్వాత ఆమె చేరిక ఉంటుందని కొన్ని పత్రికల ద్వారా లీకులు ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు షర్మిలకు పెద్ద పదవి ఇస్తారా అన్నదీ అనుమానమే. మహా అయితే టీపీసీసీ కార్యవర్గంలో ఓ పదవి పడేయొచ్చు. అప్పుడు లోకల్ లీడర్స్ తోనే ఆమె కలిసి పనిచేయాలి.తనను తాను ప్రత్యేకమైన నాయకురాలిగా భావించే షర్మిలతో కలిసి పని చేసేందుకు టీపీసీసీ నేతలు ఇష్టపడతారని చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే అక్కడ పది గ్రూపులున్నాయి. ఒకప్పుడు చిరంజీవి కాంగ్రెస్ లో చేరి కేంద్ర మంత్రి పదవి పొందారంటే అదీ వేరే విషయం. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదేనా నామినేటెడ్ పదవి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆమెకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేవనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాట చెబుతారు. ఎంత పెద్ద లీడర్ నైనా చేర్చుకుని పక్కన పెట్టేస్తారట. అవసరాన్ని బట్టి వాడుకోవడం మినహా వారికి ప్రత్యేకమైన హోదా ఏమీ కల్పించే అవకాశాలు ఉండవట. మరి షర్మిలకు ఆ సంగతి అర్థమైందో లేదో.. సికింద్రాబాద్ నుంచి పోటీ చేయమని చెబితే ఆమె గెలుస్తారని ధైర్యంగా చెప్పలేం. పైగా బీజేపీ నుంచి కూడా సహజనటి జయసుధ అక్కడ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ లో చేరడం మాత్రం షర్మిల రాజకీయ జీవితానికి అంత ప్రయోజనకరం కాదనిపిస్తోంది. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినందుకు సార్థకత చేకూరదనే అనిపిస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…