విదేశీ చదువుల్లో ప్రభుత్వ వైఫల్యమెంత ?

By KTV Telugu On 14 August, 2023
image

KTV Telugu ;-

విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే వారి సంఖ్య త్వరలోనే పది లక్షలు కానుందా. ఉన్నదంతా ఊడ్చేసి విదేశీ చదువులకు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇండస్ట్రీ, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ మూడింటిలో నెంబర్ వన్ గా ఉన్నామని చెప్పుకునే తెలంగాణ మంత్రి కేటీఆర్…. విద్యార్థులు ఫ్లైట్ ఎక్కకుండా ఎందుకు ఆపలేకపోతున్నారు..

అమెరికా చదువులకు వెళ్లేవారిలో హైదరాబాదీలు టాప్ ప్లేస్ లో ఉన్నారని తాజా లెక్కలు చెబుతున్నాయి. ముంబై, న్యూఢిల్లీ నుంచి వెళ్లే వారి కంటే తెలుగువారే ఎక్కువగా ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ 2022లో విడుదల చేసిన ఓ ప్రకటన చెబుతోంది. 30 శాతం మంది అంటే అమెరికా వెళ్లే వారిలో 75 వేల మంది తెలంగాణ రాజధాని నుంచి వెళ్తున్నవారే కావడం విశేషం. అందులోనూ ఎక్కువ మంది కాలిఫోర్నియా, న్యూయార్క్, చికాగో, ఫ్లోరిడాలో చదువుతారు. ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్, మెషీన్ లర్నింగ్, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్ లాంటి అత్యధిక వేతనం అందించే కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నారు..

ఆగస్టు వచ్చిందంటే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం బిజీ అయిపోతుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు, వారిని సాగనంపే కుటుంబ సభ్యులతో కళకళలాడుతూ ఉంటుంది. డిసెంబరు, జనవరిలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. సంవత్సరానికి రెండు సార్లు అంటే స్ప్రింగ్, ఫాల్ అనే పద్ధతిలో మన విద్యార్థులు అమెరికా వెళ్తుంటారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి అత్యధికంగా 92 వేల మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లారని అందులో ఎక్కువగా హైదరాబాద్ నుంచే ఫ్లైట్ ఎక్కారని కేంద్రప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత కెనడాకు 80 వేల మంది వెళితే ఆ తర్వాతి స్తానాల్లో యూకే, ఆస్ట్రేలియా, ఉన్నాయి.ఈ ఏడాది ఇప్పటి వరకు మూడున్నర లక్షల మంది వెళ్లారు. ఇకమీదట మరో ఐదు లక్షల మంది వరకు వెళ్తారని అంచనా వేస్తున్నారు. 2022లో విదేశీ చదువులకు వెళ్లిన వారి సంఖ్య ఏడున్నర లక్షలు ఉంది. 2021లో నాలుగు లక్షల 40 వేల మంది వెళ్లగా..మరుసటి సంవత్సరమే ఆ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. వచ్చే ఏడాది నాటికి ఆ సంఖ్య పది లక్షలకు చేరినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. అప్పుడు హైదరాబాద్ నుంచి వెళ్లే వారు నాలుగు లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు..

విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో స్థిరపడే అవకాశం వస్తుందన్న విశ్వాసంతోనే విదేశీ చదువులకు వెళ్తున్నారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. మంచి చదువులకు అవకాశం, విదేశాలు తిరిగే సదవకాశం, సామాజికాభివృద్ధి, ఆర్థిక పరిపుష్టి, రిటైరయ్యే నాటికి చేతి నిండా డబ్బు, స్థిరమైన జీవితం ఉంటుందన్న నమ్మకం యువతను విదేశాల వైపుకు లాగుతోంది. అమెరికాలో విలాస వంతమైన జీవితం, కెనడాలో త్వరగా సెటిలయ్యే అవకాశం, ఇంగ్లండ్ లో పార్ట్ టైమ్ జాబ్ చేసుకునే వీలు, యూరప్ లో ఎక్కడైనా సెటిల్ అయ్యే ఛాన్స్, ఆస్ట్రేలియాలో మంచి ప్రైవేట్ లైఫ్ జనాన్ని రా రమ్మని పిలుస్తున్నాయి.డిగ్రీల వరకు బాగా చదువుకుని మంచి స్కోర్ ఉన్న వారికి విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం దొరకడం, వీసా మంజూరు కావడం కూడా కష్టమేమీ కాదు. పైగా రెండున్నర మూడేళ్ల కోర్సుకు ఐదేళ్ల వీసా మంజూరు కావడంతో చదువు తర్వాత ఉద్యోగాలు వెదుక్కుని, సెటిల్ కావడం కూడా సాధ్యపడుతుంది.

విమానాలు ఎక్కేస్తాం, విదేశాల్లో చదివేస్తాం అని చెప్పినంత ఈజీగా చదువు సాధ్యమా అంటే కాదనే చెప్పాలి. పైగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతున్న ఇండియా నుంచి అదీ హైటెక్ హంగులు, సాఫ్ట్ వేర్ పొంగులను చూపించే హైదరాబాద్ నుంచి ఎందుకు వెళ్లాలి అనేది కూడా పెద్ద ప్రశ్నే. నిజానికి మంచి ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్, దాని సంబంధిత డిగ్రీ కోర్సులు పూర్తి చేసే నాటికే పిల్లల తల్లిదండ్రులకు 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చవుతుంది. అమెరికాలో ఏ యూనివర్సిటీలో ఎంఎస్ చేసినా ఏడాదికి యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చవుతుంది. పైగా చాలా యూనివర్శిటీల్లో మొదటి సంవత్సరం పార్ట్ టైమ్ ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి ఉండదు. కెనడాలో కూడా దాదాపుగా అంతే. యూకేలో కాస్త ఖర్చు తక్కువ అనిపించినా.. ఇండియాతో పోల్చుకుంటే చాలా ఎక్కువేనని చెప్పాలి..
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అమెరికా వెళ్లడం కష్టమేగానీ, అక్కడ చదువు పూర్తి చేయడం కష్టమేమీ కాదు. ఇక్కడ ఇంజనీరింగ్ చేసిన వారికి అక్కడ పీజీ పూర్తి చేయడం చాలా సులభమని చెబుతున్నారు. అందుకే పార్ట్ టైమ్ ఉద్యోగం చేసినా కూడా చదువుకు పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే చదువు పూర్తయి ఉద్యోగం చేస్తున్నప్పుడు కోట్లు సంపాదించే మాట ఎలా ఉన్నా… చదువు టైమ్ లో తల్లిదండ్రులకు కోటి నుంచి కోటిన్నర ఖర్చవుతుందని మాత్రం మరిచిపోకూడదు. ఈ ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే ఇండియాలోనే విదేశీ స్టాండర్డ్ యూనివర్సిటీలు రావాలి. ఐటీ మంత్రి కేటీఆర్ లాంటి వాళ్లు చొరవ చూపాలి.

తెలంగాణలో ఒక ఐఐటీ, కొన్ని ట్రిపుల్ ఐటీలు, బిట్స్ పిలానీ సహా 250కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వాటిల్లో అధికపక్షం డిగ్రీ కాలేజీలే, కొన్నింటిలో మాత్రమే పీజీ ఉంది. ఇక్కడ చదివి విదేశాలకు వెళితే ఉద్యోగాలు రావడం కష్టమైనందున కష్టమో నష్టమో ఫారిన్ వెళ్లి చదువుకుందామనుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. పైగా చాలా కాలేజీల్లో చదివిన వాళ్లకు విదేశాల్లో ఉద్యోగాలు ఇవ్వరన్న భయం ఒకటి ఏర్పడిపోయింది. మనదేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఉద్యోగావకాశాలు బాగా తగ్గిపోవడం, ప్రాంగణ నియామకాలు ఆశాజనకంగా లేకపోవడంతో విదేశాల వైపు చూస్తున్నారు. అక్కడే చదువుకుంటే ఉద్యోగం కూడా అక్కడే పొందడం సులభమని ఒక అవగాహనకు వస్తున్నారని చెప్పాలి..

ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు పరుగులు తీసుకుంటూ అమెరికా వెళ్లిపోవడానికి ఇక్కడి ప్రభుత్వాల ఉదాసీనత కూడా కారణమనే చెప్పాలి. నెలకో సాఫ్ట్ వేర్ కంపెనీని ఆహ్వానిస్తున్న తెలంగాణ సర్కారు.. మేలైన ఉద్యోగాల కల్పన, విద్యావకాశాలను మెరుగు పరచడటంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వెయ్యి మందిలో ఒక్కరిద్దరికి మాత్రమే ఇక్కడ 30 నుంచి నలభై లక్షల ప్యాకేజీలు వస్తుండగా, మిగతా వారికి నామమాత్ర వేతన అవకాశాలు కలుగుతున్నాయి. పది లక్షల రూపాయల ప్యాకేజీ పొందేందుకు రెండు మూడు సంవత్సరాలైనా ఉద్యోగం చేయాల్సి వస్తోంది. చదువుల విషయంలోనూ అదే సమస్య ఎదురవుతోంది. నాణ్యమైన, ఎక్కువ వేతనం లభించే పీజీ కోర్సులకు డిజైన్ చేయలేకపోతున్నారని వాదన వినిపిస్తోంది. విదేశీ విశ్వవిద్యాలయాల ఆఫ్ షోర్ క్యాంపస్ లు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చాలా రోజులుగా ఉన్నప్పటికీ అది ఇంకా వేగం పుంజుకోలేదు. పైగా విదేశీ విద్యా సంస్థలు ఇటు వైపు రావడానికి వెనుకాడే పరిస్థితి కూడా ఉందని చెబుతున్నారు.ఎందుకoటే ఫీజులు, కోర్సు కరిక్యూలమ్, కోర్సు మేనేజ్ మెంట్ విషయంలో తమకు పూర్తి అటానమీ లభించదన్న అనుమానమూ వారికి ఉంది. పైగా ప్రభుత్వం విదేశీ విద్యాసంస్థలకు ఆఫ్ లైన్ కోర్టులు తప్ప ఆన్ లైన్, దూర విద్యను అనుమతించే అవకాశం ఇవ్వబోనని ప్రకటిస్తోంది..

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా సర్కారులో అన్నీ తానై చూసుకునే కేటీఆర్ విద్యారంగానికి చేయాల్సిందీ చాలా ఉంది. విదేశీ విద్యా సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కూదుర్చుకుని చదువులో నాణ్యతను పెంచాలి. హైదరాబాద్ విద్యా సంస్థలకు, విదేశీ యూనివర్సిటీలకు టైఅప్స్ పెరిగితే కనీసం చదువుకునే టైమ్ లోనైనా విద్యార్థులు ఇండియాలో ఉంటారు. హైదరాబాద్ ను వైద్య కేంద్రంగా మార్చినట్లే విద్యాకేంద్రంగా కూడా తీర్చిదిద్దాలి. కాలేజీల సంఖ్య కంటే విద్యా నాణ్యత ముఖ్యమని గుర్తించాలి. ఈ లోపే ఇక్కడే మెరుగైన వేతనంతో ఉపాధి అవకాశాలు కల్పించగలిగితే దేశం విడిచి వెళ్లిపోయే వారి సంఖ్యను తగ్గించే వీలుంది. విదేశీ సంస్తల్లో పనిచేసే వారికి వచ్చే వార్షిక వేతనంలో సగం కూడా భారతీయ కంపెనీల్లో పనిచేసే వారికి అందడం లేదు. మరి బ్రెయిన్ డ్రెయిన్ జరగకుండా ఉండాలంటే ఇలాంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి