– పెళ్లయి నాలుగునెలలే..అప్పుడే కవల పిల్లలు!
– నయనతారకు ఈ వయసులో అది సాధ్యమేనా?
పెళ్లయ్యాక కడుపుపండాలంటే తొమ్మిదినెలలైనా ఆగాలి. కానీ పెళ్లయినా నాలుగునెలలకే పిల్లలు పుట్టేస్తే, అది కూడా పండంటి కవలలైతే ఎలా ఉంటుంది. అసాధ్యమేం కాదు ఈ కలికాలంలో ఏదైనా సాధ్యమే. పెళ్లయ్యాక శోభనం అనేది కొందరికి పాతమాట. ఇప్పుడంతా సహజీవనంతో అన్ని ముచ్చట్లూ అయిపోయాకేగా ఆ కొందరికి పెళ్లవుతోంది.
నవమాసాలు మోయాల్సిన అవసరం రాలేదు. పురిటినొప్పులు లేవు. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చినట్లు రెడీమేడ్ కవలలతో ఆనందడోలికల్లో తేలిపోతోందా సెలబ్రిటీ జంట. నయనతార-విఘ్నేశ్ ఓ ఇంటివాళ్లయిన నాలుగునెలల్లోనే పండంటి కవలలకు తల్లీదండ్రులయ్యారు. తాము తల్లిదండ్రులం అయ్యామంటూ ఈ జంట ప్రకటించేసరికి అంతా తెల్లబోయారు. అదెలా సాధ్యమని ఆరాతీసి అదా సంగతీ అంటూ నిట్టూరుస్తున్నారు. సరోగసితో అంటే అద్దె గర్భంతో కవలలకు కన్నవారయ్యారు నయన-విఘ్నేశ్ శివన్.
పసికందుల పాదాలతో సెలబ్రిటీ జంట మురిసిపోతూ ఫొటోలు దిగినంతసేపు నిలవలేదు వారి ఆనందం. గర్భందాల్చకుండా పిల్లలు పుట్టే అవకాశమే లేకపోవటంతో, నయనతారలో అలాంటి ఛాయలేం లేకపోవటంతో సెంట్పర్సెంట్ ఇది సరోగసీనేనని అంతా నమ్ముతున్నారు.
నయనతార, విఘ్నేశ్ ఇద్దరూ సరోగసిమీద ప్రకటన చేయలేదు. కానీ మ్యాటర్ అందరికీ తెలిసిపోయింది. ఈ ఏడాది జనవరిలోనే దేశంలో సరోగసిని బ్యాన్ చేశారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలోనే సరోగసి ద్వారా బిడ్డలు కనేందుకు అనుమతులు ఇస్తూ ప్రత్యేక చట్టాన్ని తెచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో సరోగసి ద్వారా బిడ్డలను కనేందుకు 37 ఏళ్ల నయనతారకున్న అర్హతలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
లీగలా, ఇల్లీగలా అన్న చర్చ మొదలుకావటంతో తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి దీనిపై స్పందించక తప్పలేదు. సరోగసి ప్రక్రియ చట్టబద్ధంగా జరిగిందా లేదా అనేదానిపై ఆరాతీస్తున్నట్లు చెప్పారు. నయనతార కూడా సరోగసిపై ప్రభుత్వానికి అన్ని వివరాలు తెలియజేయాలన్నారు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యన్. 21 నుంచి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు. దీంతో నయనతార దంపతులు కొత్త చిక్కుల్లో పడ్డారు.