ఏదైనా ఆటలో గెలుపోటముల్ని నిర్ధారించేది అంపైర్ నిష్పక్షపాతమే. రెండు, మూడు నిర్ణయాలు తప్పుడువి తీసుకుంటే ఫలితం తారుమారవుతుంది. క్రికెట్ , ఫుట్ బాల్ వంటి ఆటల్లో మాత్రమే కాదు.. ఎన్నికల్లోనూ ఈ అంపైర్లు కీలకమే. ఎన్నికల్లో అంపైర్లు అంటే… ఎన్నికల కమిషనే. ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా నిర్వహిస్తే.. ప్రజల్లో ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరుగుతుంది. అలాంటి నమ్మకం పెంచాల్సిన బాధ్యత ఈసీది. కానీ ఏకపక్షంగా ఓ వైపు వ్యవహరిస్తే ఏమవుతుంది ?. ఎన్నికలపై నమ్మకం తగ్గుతుంది. ఇటీవల అలాంటి ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని తామే చేపట్టుకుంటామని.. కేంద్రం చట్టం చేసుకునేందుకు పార్లమెంట్లో బిల్లు పెట్టింది. దీంతో ఇక ఎలక్షన్లు ఎందుకు.. శాశ్వత ప్రభుత్వం అనే చట్టం కూడా చేసుకోవచ్చు కదా అన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు ఎన్నికల కమిషనర్లను నియమించాల్సినది ఎవరు ? తమకు ఇష్టం వచ్చిన వారినే నియమించుకోవాలని కేంద్రం ఎందుకు చట్టం చేస్తోంది ?
ప్రధాన ఎన్నికల కమిషనర్ సహా ఈసీల నియామకానికి సంబంధించి ఎంపిక ప్రక్రియ ఎలా ఉండాలన్న దానిపై కేంద్రం పార్లమెంట్లో ఓ బిల్లు పెట్టింది. కొత్త బిల్లు ఎన్నికల కమిషన్ నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర లేకుండా చేసింది. ఇప్పటి వరకూ సీఈసీ ఎంపిక ప్రక్రియలో భారత ప్రధాన న్యాయమూర్తికి చోటు ఉండేది. బిల్లు పాసయితే .. సీజేఐకి సంబంధం ఉండదు. జనరల్ ఎలక్షన్ ను నిర్వహించే ఎన్నికల సంఘం నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర కూడా ఉండాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కాదని చట్టం చేసేస్తోంది కేంద్రం.
భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘం అత్యంత కీలకం. ఎన్నికలు నిర్వహించేటప్పుడు వ్యవస్థలన్నీ ఎన్నికల సంఘం అధీనంలో ఉంటాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి అధికారాలు ఉంటాయి. నియంత్రణ మొత్తం ఈసీ చేతుల్లో ఉంటుంది. ఎన్నికలను నిష్ఫక్షిపాతంగా ఈసీ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల కమిషన్‌లో చీప్ కమిషనర్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు ఉంటారు. ఇప్పటి వరకూ వీరి నియామక కమిటీలో ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ ఉంటారు. అయితే ఈ పద్దతికి రాజ్యాంగబద్దత లేదు.
ఆర్టికల్ 342 ప్రకారం, ప్రధాని నేతృత్వంలోని మంత్రి మండలి సిఫారసుపై …రాష్ట్రపతి ఎలక్షన్ కమిషన్ లో ని సీఈసీని, ఇతర ఎలక్షన్ కమిషనర్లను నియమిస్తారు. ప్రజాస్వామ్య సౌధానికి మూలమైన ఈ ఎలక్షన్ కమిషన్ అప్పటికి అధికారంలో ఉన్న ప్రభుత్వ సిఫారసుతో ఏర్పాటవుతోంది. దాదాపు 70ఏళ్లుగా ఇదే నడుస్తోంది. ఈ ప్రక్రియను తప్పు పడుతూ.. దేశంలోని ప్రజాస్వామ్య వాదులు 2015నుంచి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. వీటిపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. ఎలక్షన్ కమిషన్ నియామకంలో న్యాయ వ్యవస్థ పాత్ర కూడా ఉండాలని పేర్కొంది. కీలకమైన ఎన్నికల ప్రక్రియలో న్యాయ వ్యవస్థ భాగస్వామ్యం తప్పని సరి అని చెబుతూ… ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను భాగస్వామ్యం చేయాలని విస్పష్టంగా చెప్పింది. త్వరగా దీనిపై చట్టాన్ని చేయాలని ఆ లోగా సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లో ఉంటాయని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముక్తకంఠంతో చెప్పింది. అప్పట్నుంచి పద్దతి మారిపోయింది.
అయితే ఈ పద్దతికీ చట్టబద్దత కల్పించాల్సి ఉంది కాబట్టి.. చట్టం చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. చట్టం చేసే క్రమంలో.. పాత విధానానికే చట్టబద్ధత కల్పిస్తున్నారు. కానీ సీజేఐకి స్థానం ఉండాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఈసీలతో కూడిన కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేలా ఈ బిల్లును రూపొందించారు. దీని ప్రకారం సీఈసీ, ఇతర ఎలక్షన్ కమిషనర్లను ముగ్గురు సభ్యుల ప్యానల్ ఎంపిక చేస్తుంది. ఇందులో ప్రధానమంత్రి, లోక్ సభ లో ప్రతిపక్షనేత, ప్రధాని నామినేట్ చేసిన ఓ కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ఒక వేళ ప్రతిపక్ష నేత హోదా ఎవరూ పొందకపోతే.. ప్రతిపక్షంలోని అతిపెద్ద పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ సభ్యుడిగా ఉంటారు. నిజానికి ఏకపక్ష నియామక వ్యవస్థను సమర్థించేలా కొత్త చట్టం ఉండొద్దన్నది సుప్రీంకోర్టు ఆదేశం. కానీ దానిని కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం CEC నియామకాన్ని ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి సిఫారసు చేస్తోంది. అంటే ప్రధానిదే నిర్ణయం అనుకోవచ్చు. ఇప్పుడు పెట్టిన బిల్లులో ప్రధానితో పాటు.. ప్రతిపక్షనేత, మరో కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉంటారు. ప్రధాని నియమించిన కేబినెట్ మంత్రి అంటే కచ్చితంగా ఆయన ప్రధాని చెప్పినట్లు వినాల్సిందే. ముగ్గురు సభ్యుల కమిటీలో ఇద్దరు ఓ వ్యక్తిని సమర్థిస్తే. అతనే సీఈసీ అవుతాడు. అంటే.. ప్రధాని చాయిసే చీఫ్ ఎలక్షన్ కమిషనర్.. కమిషనర్లు కూడా. ఇక ఈ చట్టంలో పారదర్శకత ఎలా ఉంటుంది ?
నిజాయితీగా ఉండటమే నిజాయితీగా ఉన్నట్లుగా కనిపించాలి కూడా. ఎన్నికల సంఘం ఎంత సీరియస్‌గా పని చేసినా.. నిజాయితీగా వ్యవహరించినా.. అలా ఉన్నట్లుగా కనిపించడం కూడా కీలకమే. లేకపోతే పక్షపాత ముద్ర పడిపోతుంది. అది దేశ ప్రజాస్వామ్యానికి నష్టం చేస్తుంది.
మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ భవితవ్యమే ఎన్నికల కమిషన్ చేతిలో ఉంది. రాజ్యాంగ వ్యవస్థలో అలాంటి కీలకమైన విభాగం ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే సుప్రీంకోర్టు ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం కూడా ఉండాలని కోరుకుంది. ECI నియామకం పారదర్శకంగా ఉండాలంటే.. ఇది తప్పనిసరి అని చెప్పింది. రాజకీయ పక్షపాతం లేకుండా ఉండాలన్నా కూడా న్యాయ వ్యవస్థ జోక్యం ఉండాలని సుప్రీంకోర్టు భావించింది. కానీ మోదీ ప్రభుత్వం దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. సుప్రీం చెప్పినట్లుగా చేస్తే… ఒకవేళ ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒకే అభిప్రాయం కలిగి ఉంటే ఇబ్బంది ఉండదు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని శాసించగలిగేటువంటి.. ఎలక్షన్ కమిషన్ నియామకంలో అధికార పార్టీ మాట చెల్లుబాటు కావాలని ్మోదీ కారుకుంటున్నారు.
ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీకాలం వచ్చే ఎన్నికల తర్వాతనే పూర్తవుతుంది. అయితే ఎన్నికల కమిషనర్లలో ఒకరైన అనూప్ చంద్ర పాండే పదవీకాలం ఎన్నికలకు ముందు ఫిభ్రవరిలో పూర్తవుతుంది. అప్పుడు కొత్త ఎలక్షన్ కమిషనర్ ను ఎన్నుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం చట్టం ప్రకాకం కమిషనర్లను నియమిస్తే.. వారు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఉంటారు. ECI కీలుబొమ్మగా మార్చే పన్నాగమని రాజకీయ పార్టీలు ఇందుకే ఆరోపిస్తున్నాయి. మిగతా రాజకీయ పక్షాలు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నాయి. మొత్తంగా ఎన్నికలు నిర్వహించే వ్యవస్థపైనే నీలినీడలు కమ్ముకునేలా కొత్త చట్టాన్ని సిద్ధం చేశారు. అందుకే..ఎన్నికల నిర్వహణ .. వివాదాస్పదం అయితే.. దానికి బాధ్యత బీజేపీదే అవుతుందని.. అంటున్నారు.
ఎన్నికల్లో ఈవీఎంలపై ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. అసాధారణ ఫలితాలు వస్తూండటంతో రాజకీయ పార్టీలు నమ్మకాన్ని కోల్పోతున్నాయి. గెలిచిన పార్టీలు… తమ గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేయలేవు. ఓడిన పార్టీలు.. వ్యక్తం చేస్తాయి. అందుకే ఎప్పుడూ ఈ విషయంపై ఏకాభిప్రాయం రాదు. ఎన్నికల సంఘం నియామకంలోనూ అంతే. కానీ.. ఆలోచించాల్సింది ప్రజాస్వామ్య మనుగడ గురించి..!
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…