హంగ్ అసెంబ్లీపై పవన్ ఆశలు

By KTV Telugu On 16 August, 2023
image

KTV Telugu ;-

పవన్ ఆవేశానికి, దూకుడుకు ఓ కారణం ఉందా. తాను శక్తిమంతమైన నాయకుడినని నిరూపించే ప్రయత్నం అందులో దాగొందా. ఇకపై పవన్ జనంలోనే ఉంటారా. జనం మనిషినని చెప్పుకునేందుకు వచ్చే ప్రతీ అవకాశాన్ని పవన్ వదులుకోదలచుకోలేదా. నాసామి రంగా ఒక్క చాన్సిచ్చి చూడు, హంగ్ అసెంబ్లీ రానిచ్చి చూడు.. చక్రం ఎలా తిప్పుతానో అని పవన్ లెక్కలేసుకుంటున్నారా… ఇదంతా ఒక గేమ్ ప్లానేనా…

అనుకున్నదీ సాధించాలన్న ఆరాటం ప్రతీ రాజకీయ నాయకుడిలో ఉంటుంది. జనసేనాధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు కూడా ఆ ఆరాటం ఎక్కువే.ఇంతవరకు సక్సెస్ రాకపోయినా… ఈ సారి మాత్రం పక్కా అన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. ఎక్కువ సీట్లు గెలివగలిగితేనే తాను అనుకున్నది సాధించగలనన్న విశ్వాసం పవన్ కల్యాణ్ లో కలుగుతోంది. అందుకు తగ్గట్లుగా పావులు కదువుతూనే సమయం వచ్చినప్పుడు సీట్ల పంచాయితీలో అంతా తేల్చుకోవాలని అనుకుంటున్నారు.

వారాహి యాత్ర మొదలైన తర్వాత జనసైనికుల్లో జోష్ పెరిగింది. నాయకుడు పవన్ కల్యాణ్ లో నూతనోత్సాహం వచ్చింది. తనదైన శైలిలో భారీ డైలాగులు కొడుతున్నారు. 2019 కంటే ఇపుడు జనాల్లో ఎక్కువగా తిరుగుతున్నారు. దానికి రెండు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఒకటి జగన్ సీఎం గా ఉండరాదని పవన్ కి ఉన్న పట్టుదల అయితే రెండవది తెలుగుదేశం తో దోస్తీ కట్టి ఎలాగైనా ఏపీలో మూడవ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలన్న తాపత్రయం. ఈ నేపధ్యంలో కొన్నిసార్లు అగ్రెసివ్ మోడ్ లో పవన్ వెళ్తున్నారు. ఆయన అనుచరులకు అభిమానులకు కావాల్సింది కూడా అదే కదా.. ప్రతీ నిమిషం సీఎం జగన్ ను ఉతికి ఆరేస్తున్న పవన్ దాని ద్వారా ఏదో కొంతైనా మైలేజీ వస్తుందని ఎదురు చూస్తున్నారు.

చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు జనంలో తిరుగుతున్నారు. మీడియా కవరేజీ కూడా వారికే ఎక్కువగా ఉంది. అలాగని కొన్ని రోజులు ఆగుదామంటే సమయం మించిపోతోంది. లోకేష్ తక్కువలో తక్కువ మరో 150 రోజులు పాదయాత్ర చేస్తారు. చంద్రబాబు ఏదోక పనిపెట్టుకుని రోజు జనంలోకి వస్తారు. తాను మౌనంగా కూర్చుంటే జనం మరిచిపోతారన్న భయం పవన్ లో కలుగుతోంది. అందుకే తాను కూడా తిరుగుతూ అగ్రెసివ్ గా తిడుతూ జనంలో ఉండాలని తీర్మానించారు. . అందుకోసం జనసేన సోషల్ సైన్యానికి పని చెప్పారు. తన ప్రతీ కదలికను మారు మూల ప్రాంతాలకు చేరే విధంగా సోషల్ మీడియా ప్రచారం ఉండాలని పవన్ కోరుకుంటున్నారు. అవకాశం వస్తే చంద్రబాబు, జగన్ కంటే పవనే బెటరని జనం మాట్లాడుకునే విధంగా స్కెచ్ వేశారాయన.

నిజానికి పవన్ వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ కోసం ఎదురు చూస్తున్నారు. అలా జరగాలంటే ఈ పొత్తులలో కొత్త ఎత్తులతో టీడీపీ నుంచి గణనీయమైన నంబర్ లో సీట్లను సాధించాలన్నది మరొక ఆలోచనగా చెబుతున్నారు. యాభై సీట్లకు తగ్గకుండా డిమాండ్ చేయాలని, అలా ఇస్తేనే పొత్తుకు ఒప్పుకోవాలని జనసేన భావిస్తోంది. పైగా ఆ యాభై సీట్లలో కూడా టీడీపీ కంచుకోటలను అడిగితే విజయం ఖాయమన్న లెక్క చెబుతున్నారు. పవన్ తో పొత్తు అంటే బీజేపీతో కూడా టీడీపీ పొత్తు ఖాయమవుతుంది. అప్పుడు కమలం పార్టీకి పది నుంచి 15 స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది. అంటే రాష్ట్రంలో ఉన్న 175 స్థానాల్లో టీడీపీకి మిగిలేది 110 మాత్రమే.ఎన్నికల్లో అలా జరిగిన పక్షంలో టీడీపీకి ఫుల్ మెజార్టీ రాకపోవచ్చు. అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి రావచ్చు. పవన్ కు కావాల్సినది కూడా అదేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబుకు సంకీర్ణాలు ఇష్టం లేదు. ఆయనకు ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కావాలి. కాకపోతే అనివార్య పరిస్థితుల్లో పవన్ తో అధికారాన్ని పంచుకోవాల్సి రావడమంటే జనసేనానికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడమే అవుతుంది. అదే జరిగితే చంద్రబాబును మరింత ఇరకాటంలో పెట్టొచ్చని పవన్ భావిస్తున్నారు. ఎందుకంటే టీడీపీ వైపు నుంచి లోకేష్ దూకుడును అడ్డుకున్న నాయకుడిగా కూడా తనకు పేరు వస్తుందని, అప్పుడు తదుపరి సీఎం తానేనని ప్రచారం చేసుకోవచ్చని పవన్ లెక్కగడుతున్నారు. మరి ఆయన ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి