అగ్రెసివ్ అచ్చెన్నాయుడు ఏమయ్యారు. మీడియా స్పేస్ మొత్తం తండ్రీ కొడుకులకే ఎందుకు దక్కుతోంది. పార్టీని చంద్రబాబు, లోకేష్ మాత్రమే నడిపిస్తారా. ఇతర నాయకులు తోలుబొమ్మలు, కీలుబొమ్మలేనా. వారు అవకాశాలు తీసుకోవడం లేదా. వారికి అవకాశాలు రావడం లేదా. టూ మేన్ షో నిర్వహిస్తే విజయం సాధిస్తారా. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని ఇతరులకు అవకాశం ఇస్తారా…
అధినాయకుడు అన్నీ తానై ముందుకు సాగడంలో తప్పు లేదు. ఎవరికీ అవకాశం రాకుండా దూరిపోవడంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు అదే జరుగుతుందనిపిస్తోంది. ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మాత్రమే కనిపించే పరిస్థితి ఏర్పడింది. ఇతర నేతలు పార్టీ కార్యాలయంలో కూర్చుని ఎవరూ చూడని మీడియా మీట్స్ మాట్లాడటం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అసలు క్రియాశీలంగా ఉన్నారా లేదా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.అదీ ఒక గేమ్ ప్లాన్ లేక అచ్చెన్నను పక్కన పెట్టారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.
నేను ఆడా ఉంటా.. ఈడా ఉంటా అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల్లోనూ చక్రం తిప్పుతోంది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రచారం ఒక వంతయితే పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు, తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాజకీయం మరో వంతు. తెలంగాణలో పార్టీ మనుగడ ఆశాజనకంగా లేదు. ఏపీలో అధికారానికి చేరువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఏపీలోనే టీడీపీకి పట్టు ఎక్కువగా ఉంది. ఆశలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఏపీలో చంద్రబాబు, లోకేష్ గట్టిగానే తిరుగుతున్నారు. యువగళం పేరిట లోకేష్ తిరుగుతున్నారు. ఏదోక పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని చుట్టి వస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్రపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. వీరిద్దరి చర్యల కారణంగా ఇతరులకు అవకాశం రావడం లేదన్న చర్చ జరుగుతోంది.
ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఏమి చేయాలన్నది చర్చగానే ఉంది.పేరుకే ఏపీ ప్రెసిడెంట్ గా అచ్చెన్నాయుడు ఉన్నారా అన్న మాట కూడా ఉంది. ఏపీలో బీజేపీకి పురంధేశ్వరి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆమె ఏపీ అంతా చురుగ్గా తిరుగుతున్నారు. అలాగే వామపక్షాలకు ఏపీ వరకూ కార్యదర్శులు ఉన్నారు. వారు కూడా పార్టీని మొత్తం చూసుకుంటారు. అచ్చెన్న మాత్రం శ్రీకాకుళంలోనే ఉంటున్నారు. లేకపోతే చంద్రబాబు వెంట కనిపిస్తారు. బీసీ నేతగా ఉన్న అచ్చెన్నాయుడు చేత పాదయాత్ర చేయిస్తే టీడీపీకి బీసీ పార్టీగా మైలేజ్ వచ్చేను అన్న మాట కూడా ఉంది. కానీ అచ్చెన్నాయుడుని మాత్రం జిల్లా ప్రెసిడెంట్ కి ఎక్కువ ఏపీ ప్రెసిడెంట్ కి తక్కువ అన్నట్లుగా చేశారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. చినబాబుకు మాత్రమే పేరు వచ్చేట్టుగా వ్యూహం పన్ని అచ్చెన్నాయుడుని పక్కన పెట్టారన్న చర్చ పార్టీ వర్గాల్లో కూడా జరుగుతోంది.
ఉత్తరాంధ్రలో బీసీలు ఎక్కువ అందుకే అచ్చెన్నాయుడికి రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఈ క్రమంలో బీసీ ఓట్లు దండుకునే అవకాశం కూడా ఉంటుందన్న చర్చ జరిగింది.కాకపోతే రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి అచ్చెన్నాయుడు పరిస్థితి బాగోలేదనిపించింది. కేంద్ర కార్యాలయంలో ఆయనకు కుర్చీ వేయడానికే చాలా రోజులు పట్టిందని చెబుతారు. తర్వాత కూడా ప్రాధాన్యం లేకుండా చేశారని, చంద్రబాబు చెప్పింది తప్ప వేరే పని చేసే అలవాటు లేకుండా చేశారని చెబుతారు. మరి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అని టెక్నికల్ గా చూపించి ఉత్తరాంధ్రాలో బీసీల ఓట్లు దండుకోవడం మినహా వేరు అవకాశం ఇవ్వకూడదన్న ఆలోచన ఉందని చెబుతున్నారు. ఎందుకంటే చిన్న అవకాశం ఇస్తే దూకుడుగా వ్యవహరించి లోకేష్ ను మింగేస్తారన్న అనుమానం అచ్చెన్న మీదున్నది. ప్రస్తుతానికి అచ్చెన్న త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడాల్సిందే.. చేయగిలిగిందేమీ లేదు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…