మూడు రోజులే ఎందుకు ?

By KTV Telugu On 19 August, 2023
image

KTV Telugu ;-

టీడీపీ యువనేత నారా లోకేష్ ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటన మూడు రోజులకే ఎందుకు పరిమితం చేస్తున్నారు. ఆయన రిస్క్ వద్దనుకుంటున్నారా. భయపడుతున్నారా ?ఎన్నికల షెడ్యుల్ వచ్చిన తర్వాత అసలు గేమ్ మొదలు పెట్టాలనుకుంటున్నారా… ఇతర ప్రాంతాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలనుకుంటున్నారా?

కొడాలి నాని, పేర్ని నాని బతికి పోయినట్లే. జన ప్రభంజనంగా సాగుతున్న యువగళం వారి నియోజకవర్గాల వైపుకు వెళ్లడం లేదు.వీధుల్లో టెన్షన్ లేని యాత్రనే లోకేష్ కొనసాగించాలనుకుంటున్నారు. రాజకీయ చైతన్యం ఉండి నిన్నటి దాకా టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాను సైలెంట్ గా దాటిపోవాలని డిసైడయ్యారు. అదీ ఒక వ్యూహం కావచ్చు…

యువగళం ద్విశత దినోత్సవం వేపుకు పరుగులు తీస్తోంది. యువనేత నారా లోకేష్ లో జోష్ పెరుగుతోంది. కాకపోతే యాత్రలో కొంత తేడా కనిపిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి యాత్రను ప్రారంభించిన నారావారబ్బాయి.. అక్కడ నెలకు పైగా తిరిగారు. నాలుగు రాయలసీమ ఉమ్మడి జిల్లాల్లో అదే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కోస్తాలోకి ఎంటరైన తర్వాత మాత్రం ఎందుకో కొన్ని జిల్లాల్లో వేగంగా దాటిపోవాలన్న కోరిక పెరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో ఆయన అటు ఇటుగా పది రోజులే ఉంటున్నారు. ఇక కృష్ణా జిల్లాలో మరీ ఘోరం. మూడు రోజుల్లోనే ఆయన పెద్ద జిల్లాను దాటి పోతున్నారు.

ఈనెల 19న మధ్యాహ్నం ఒంటిగంటకు ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లాలో పాదయాత్ర షెడ్యూల్ వివరాలను టీడీపీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మీడియాకు తెలియజేశారు. 19, 20, 21 తేదీలలో మూడు రోజులు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పాదయాత్ర కొనసాగనుంది. 19న విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్‌లో, 20న విజయవాడ తూర్పు, పెనమలూరులో, 21న గన్నవరం పర్యటించనున్నారు. లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. లోకేష్ తల్లి భువనేశ్వరి పట్ల అభ్యంతరకర డైలాగ్స్ లో భాగమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తూ లోకేష్ ప్రసంగం రెడీ చేస్తున్నారని చెబుతున్నారు.

లోకేష్ కృష్ణా జిల్లా షెడ్యూల్ల్ కొంత విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. బూతుల మంత్రిగా టీడీపీ వాళ్లు పిలిచే కొడాలి నాని నియోజకవర్గం గుడివాడకు ఆయన వెళ్లడం లేదు. టీడీపీపై రోజువారీగా అంతెత్తున ఎగిరిపడే మాజీ మంత్రి పేర్ని నాని నియోజకవర్గం మచిలీపట్నానికి ఆయన వెళ్లడం లేదు. ఒకప్పుడు మాజీ మంత్రి దేవినేని ఉమ నియోజకవర్గమైన మైలవరానికి ఆయన వెళ్లడం లేదు. ప్రస్తుత మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, కమ్మ సామాజికవర్గం నేత వసంత కృష్ణ ప్రసాద్ .. టీడీపీ వైపుకు వస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ లోకేష్ అక్కడకు వెళ్లడం లేదు. నిజానికి 2019 ఎన్నికల ముందు నుంచే టీడీపీ పట్ల, చంద్రబాబు పట్ల కొడాలి నాని అగ్రెసివ్ గా ఉన్నారు. బై బై బాబు అని పాట రాయించి ఊరూరా డ్యాన్సులు వేయించారు. అది గుర్తొచ్చినప్పుడల్లా చంద్రబాబు ఆయన్ను బూతుల మంత్రి అని పిలుస్తారు. నందిగామ, పెడన లాంటి వైసీపీ నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ పట్ల విపరీతమైన వ్యతిరేకత పెరిగింది. అక్కడకు వెళితే లోకేష్ కు మంచి రెస్పాన్స్ వస్తోందని అందరూ ఎదురు చూశారు. కాకపోతే వైసీపీ గొడవలు సృష్టించే అవకాశం ఉందని వార్తలు రావడంతో ఈ కీలక సమయంలో శాంతి భద్రతల సమస్య వద్దనకుని లోకేష్ కృష్ణా జిల్లాను త్వరగా చాప చుట్టేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీయార్ సొంత జిల్లా అది. టీడీపీకి బాగా కావాల్సిన జిల్లా, రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా, పార్టీ కోసం ప్రాణాలైనా ఇచ్చే జనమున్న జిల్లా అది. సీన్ కట్ చేస్తే వైసీపీ ప్రభంజనంలో కృష్ణా కంచుకోట బద్దలైందని టీడీపీ గుర్తించింది. ఇప్పుడా లోటును భర్తీ చేసుకోవాలంటే లోకేష్ లాంటి యువనేతలు జనంలో తిరగాలి. కార్యకర్తలను ఉత్తేజ పరచాలి.ప్రతీ ఒక్కరినీ పలుకరించి ధైర్యం చెప్పాలి. వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పగలగాలి. ఒక్క సారి గెలిచే అవకాశం ఇస్తే పూర్వ వైభవం వస్తుందని హామీ ఇవ్వగలగాలి. టీడీపీ మాత్రం అలా చేయలేకపోతోంది. ఎవరి లెక్కలు వారివి. దానికి మనం ఏమీ చేయలేం కదా…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి