టికెట్ల కోసం వారసుల వేట

By KTV Telugu On 19 August, 2023
image

ktv telugu ;-

హ్యాట్రిక్ విజయం కోసం తహ తహ లాడుతోన్న బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారు. అయితే పార్టీలో చాలా మంది సీనియర్లు తమకు కాకుండా తమ వారుసులకు టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తులు చేసుకుంటున్నారు. అయితే గెలిచే అవకాశాలు లేకపోతే వారసులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదని కేసీయార్ నిర్మొహమాటంగా క్లారిటీ ఇస్తున్నారట. అయితే సీనియర్లు మాత్రం ఎన్నికలంటేనే విరక్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో ఎన్నికల వేడి కాస్త కాస్తగా పెరుగుతోంది. విజయమే లక్ష్యంగా ప్రతి పార్టీ కూడా వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కేంద్రంగా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. వారసులొస్తున్నారు ఎపిసోడ్‌ ఈ ఎన్నికల సంగ్రామంలో ఉంటుందా ? లేదా ? అన్నది చర్చనీయాంశంగా మారింది. హ్యాట్రిక్‌ కొట్టాలన్న పట్టుదలతో కేసీఆర్‌ ఉన్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో పావులు కదిపే స్థాయికి పార్టీని తీసుకెళ్లే క్రమంలో సరికొత్త ఎత్తులు వేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల బరిలో తేడా కొడితే…ఢిల్లీ పాలిటిక్స్‌ మీద ఫోకస్‌ పెట్టడం సాధ్యం కాదు. అందుకే…రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ హోదాలో బరిలోకి దిగడమే లక్ష్యంగా కేసీఆర్‌ వ్యూహరచన చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో సాధించిన అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ సీట్లు గెల్చుకోవడం మీద ఫోకస్‌ పెట్టారు. ప్రతి అసెంబ్లీ స్థానం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో సీనియర్‌ నేతలు…తమ వారసులను తెరపైకి తెస్తున్నారు. కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత…తెలంగాణ పొలిటికల్‌ స్క్రీన్‌ మీద పిక్చర్‌ మారిపోయింది. బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ ఎపిసోడ్‌ కాస్తా…హఠాత్తుగా బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌ వార్ గా మారిపోయింది.

ఒకపక్క కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ మధ్య బీఆర్‌ఎస్‌ని ఢీ కొడుతోంది. మారుతోన్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న కేసీఆర్‌…గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అని ఇప్పటికే తేల్చి చెప్పేశారు. మరోవైపు సీనియర్లు మాత్రం ఈ ఎన్నికల్లో తమ వారసులను బరిలోకి దింపాలన్న ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. బీఆర్‌ఎస్‌లో దాదాపు 30 మంది వారసులు పోటీకి సై అంటే సై అంటు న్నారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అంటోన్న కేసీఆర్‌…ఎవరికి సై అంటారు ? ఎవరికి నో అంటారు ? అన్నది సస్పెన్స్‌గా మారడంతో సీనియర్లలో టెన్షన్‌ పెరుగుతోంది.

అభ్యర్థుల ఎంపిక విషయంలో అనేక అంశాలను పరిశీలిస్తున్న కేసీఆర్‌…వీలైనంత త్వరగా జాబితాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అభ్యర్థుల జాబితాలో తమ వారసుల పేర్లు చూసుకోవాలనుకుంటున్న సీనియర్లకు…అధినేత అంతరంగం అంతుపట్టడం లేదట. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తలసాని సాయికిరణ్‌. ఈసారి తన కుమారుణ్ని సనత్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలని తలసాని శ్రీనివాస్‌ భావిస్తున్నారట. మరోవైపు…సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో కిషన్‌ రెడ్డిని ఓడించాలంటే… బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్‌ బరిలోకి దిగాలని, సాయికిరణ్‌ని అసెంబ్లీ ఎన్నికలకు పంపడమే సరైనదన్న చర్చ కూడా పార్టీలో నడుస్తుందట.

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు రోహిత్‌కి మెదక్‌ ఎమ్మెల్యే టిక్కెట్‌ అడుగుతున్నారు. అందుకు కేసీఆర్‌ అంగీకరించకపోతే సార్వత్రిక ఎన్నికల వేళ మెదక్‌ ఎంపీ టిక్కెట్‌ అడగాలన్నది మైనంపల్లి వ్యూహంగా పార్టీలో చర్చ సాగుతోంది. అటు సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌ రెడ్డి రాజేంద్ర నగర్‌ నుంచి పోటీ చేయాలని సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌… ఈసారీ సీటు నాదే. గెలుపు నాదే అని తేల్చి చెబుతున్నాడు. ఇప్పటికే రాజేంద్రనగర్‌ కేంద్రంగా కార్తీక్‌ రెడ్డి వర్సెస్‌ ప్రకాష్‌ గౌడ్‌ ఎపిసోడ్‌ జోరుగా సాగుతోంది. ఇలా ఈ జాబితా చాలానే ఉంది. వారసులకు టికెట్ ఇవ్వడానికి కేసీయార్ వ్యతిరేకం కాదు..గెలిచే పరిస్థితి ఉంటేనే ఇస్తామని ఆయన అంటున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి