రాజకీయాల్లో ఒకరి తొందరపాటు మరొకరికి మేలు కలిగేలా చేస్తుంది. అలాగే ఆలస్యం .. మరో పార్టీకి మేలు చేస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం రాజకీయ పార్టీలకు మేలు చేస్తుంది. ఈగోలకు పోయి లేదా.. ప్రత్యర్థి పార్టీపై పైచేయి సాధించడానికి అయితే మాత్రం.. కావాలని నష్టం చేసుకున్నట్లే. ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటూంటే.. మేము కూడా అందుకే ఎదురు చూస్తున్నామని బీజేపీ అంటోంది. అది బెదిరింపేమీ కాదు.. అది ఆ పార్టీకి అవసరం కూాడా. బీఆర్ఎస్ లిస్ట్ ఏదో ముందే రిలీజ్ అయిపోతే.. బీజేపీ తనకు కావాల్సిన నాయకులకు కండువా కప్పేస్తుంది . అందుకే.. బీఆర్ఎస్ అభ్యర్థుల కన్నా ఎక్కువగా బీఆర్ఎస్ జాబితా కోసం బీజేపీ ఎదురు చూస్తోంది.
భారతీయ జనతా పార్టీ కి నాయకుల కొరత ఉంది. నియోజక వర్గ స్థాయిలో ఆర్థిక, అంగబలంతో పోటీ న్పడే నాయకుల కోసం ఎదురు చూస్తోంది. ఓ దశలో కీలకమైన నేతలంతా వస్తారని అనుకున్నారు. కానీ ఫామ్ హౌస్ లో స్కెచ్ ఫెయిల్ కావడంతో మొత్తంగా తేడా వచ్చేసింది. తర్వాత కర్ణాటక ఎన్నికల్లో ఫలితం తేడా వచ్చింది. ఆ తర్వాత బండి సంజయ్ ను మార్చడంతో ఇక ఎవరూ ఆ పార్టీ వైపు చూడటం లేదు. కానీ ఇప్పుడు బీజేపీకి.. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఒక్కటే ఆశాదీపంగా కనిపిస్తోంది. కమాన్.. అభ్యర్థుల్ని ప్రకటించండి అని బీఆర్ఎస్‌ను డిమాండ్ చేస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాపై పది రోజులుగా విస్తృత చర్చ జరుగుతోంది. ఇదిగో జాబితా, అదిగో జాబితా అంటున్నారు కానీ.. అసలు జాబితా రిలీజ్ కావడం లేదు. కానీ ఇదే జాబితా అంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. అందులో తప్పనిసరిగా టిక్కెట్లు వారికే అనే నేతల పేర్లతో పాటు కాస్త డైలమాలో ఉన్న నేతల పేర్లు కూడా ఉన్నాయి. కానీ అసలు కేసీఆర్ మనసులో ఏముందో.. ఆయన ఫైనల్ చేసుకున్న లిస్టులో ఎవరి పేర్లున్నాయో ఎవరికీ తెలియదు. ఇక్కడ ట్విస్టేమిటంటే బీఆర్ఎస్ తొలి జాబితా కోసం.. బీఆర్ఎస్ ఆశావహులే కాదు.. బీజేపీ కూడా ఎదురు చూస్తోంది. బీఆర్ఎస్ టిక్కెట్లు ఈ సారి గతంలో మాదిరిగా సిట్టింగ్‌లు అందరికీ దక్కే అవకాశం లేదు. కనీసం పాతిక, ముఫ్పై మందికి టిక్కెట్లు నిరాకరించబోతున్నారని అంటున్నారు. లిస్ట్ పెద్దదే… ఒక్కొక్కరిగా ఎవరెరవికి టిక్కెట్ నిరాకరించబోతున్నారో మాత్రం సంకేతాలు ఇస్తున్నారు. కొంత మందిని పిలిచి మాట్లాడుతున్నారు. మరికొంత మందికి .. ఇప్పుడు కాకపోతే తర్వాత అనే సందేశం పంపుతున్నారు. అయితే కొంత మంది టిక్కెట్లు లేవు అనే సంకేతాలు అందుకున్న నేతలు తమ బలప్రదర్శన చేయడానికి వెనుకాడటం లేదు. టిక్కెట్ ఖాయమని ఎలాంటి సిగ్నల్స్ రాని వారు.. పార్టీ దూరం పెడుతున్న సంకేతాలు రావడం.. టిక్కెట్ దక్కుతుందని భావిస్తున్న వారి హడావుడి పెరగడంతో అలజడి ప్రారంభమవుతోంది. ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. వీరందరూ ప్రత్యామ్నాయంగా మరో పార్టీని చూసుకోవడం ఖాయమని అనుకోవచ్చు. రాజయ్య, ముత్తిరెడ్డి వంటి వారు అదే చేస్తున్నారు.
కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరని.. టిక్కెట్ ఇవ్వకపోతే తమ దారి తాము చూసుకోవడం మంచిదని ఎక్కువగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనుకుంటన్నారు. అందుకే ఇతర పార్టీలకు చెందిన వారితో గుంభనంగా చర్చలు జరుపుతున్నారు. బీఆర్‌ఎస్ జాబితా కోసం బీజేపీ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తోంది. చాలా కాలంగా బీజేపీ చేరికల కోసం ప్రయత్నిస్తోంది. ఈ నెల 27వ తేదిన అమిత్ షా పర్యటనకు రాబోతున్నారు. ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈటల రాజేందర్ ఊహించని చేరికలు ఉంటాయని చెబుతున్నారు. ఏకంగా ఇరవై రెండు మంది నేతలు చేరబోతున్నారని స్పష్టం చేశారు. ఈటల చెప్పిన ఉద్దేశంలో ఈ ఇరవై రెండు మంది ఎవరో కాదు.. బీఆర్ఎస్ టిక్కెట్లు నిరాకరించబోయే ఎమ్మెల్యేలు. ఇప్పటికిప్పుడు జాబితాను ప్రకటిస్తే అడ్వాంటేజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈటల సంకేతాలు పంపుతున్నారు. ఇది బెదిరించడం కాదు.. ఉన్న మాటే అనుకోవచ్చు. నిజంగానే బీజేపీ చేరికల కోసం ఎదురు చూస్తోంది.
ఆపరేషన్ ఆకర్ష్ లు చేపట్టడంలో బీజేపీకి ప్రత్యేకమైన కేటగరి. జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి పెడితే ఏంజరుగుతుందో చాలా రాష్ట్రాల్లో చూపించారు. వారికి కావాల్సింది ఓ చిన్న అవకాశం. బీఆర్ఎస్ లిస్ట్ రిలీజ్‌తో అది తమకు వస్తుందని అనుకుంటున్నారు.
బీఆర్ఎస్‌లో నేతలు ఓవర్ లోడ్ అయ్యారు. అదే సమయంలో పోటీ చేయడానికి రెండు పార్టీలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ హైకమాండ్ ..అసంతృప్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. టిక్కెట్లు నిరాకరించే నేతల్ని ప్రగతి భవన్ కు పిలిపించి ఇప్పటికే మాట్లాడుతున్నారు. కానీ.. అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నది మాత్రం అంచనావేయడం కష్టం. అనవసర ఫిరాయింపులతో ఇప్పటికే చిక్కులు వచ్చి పడుతున్నాయి. బలమైన నేతలకూ టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. పట్నం మహేందర్ రెడ్డి వంటి నేతలు.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారంటే ఊహించడం కష్టమే. ఇప్పటికి సైలెంట్ గా ఉండవచ్చు కానీ.. ఎందుకు ప్రత్యామ్నాయం కనిపిస్తున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారని ఎవరూ అనుకోలేరు. ఇలాంటి మాస్ లీడర్లకు పలు చోట్ల బీఆర్ఎస్ టిక్కెట్లు కేటాయించడం కష్టంగా మారుతోంది. వారంతా ఉంటారా పార్టీ మారుతారా అన్నది సస్పెన్స్ గానే ఉంది. రాజకీయాల్లో విధేయతకు చోటు లేదు. ఏదైనా తమకు ఉపయోగపడుతుందనే వరకే.. నేతలు విధేయత చూపిస్తారు. లేకపోతే ధిక్కరిస్తారు. అందుకే.. ఇప్పుడు విధేయత చూపించేవారంతా టిక్కెట్ ఇవ్వరని తెలిసిన తర్వాత కామ్ గా ఉంటారని కేసీఆర్ కూడా అనుకుంటారని భావించడం లేదు.
అందుకే జాబితాలను లీకులుగానే ఉంచితే మంచిదన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ హైకమాండ్ కు నేతలు సలహాలిస్తున్నారు. 2018లో అసెంబ్లీని రద్దు చేసినప్పుడు కేసీఆర్ అదే రోజు జాబితా ప్రకటించారు. అప్పట్లో ముగ్గురికి తప్ప సిట్టింగ్‌లు అందరికీ సీట్లివ్వాలని నిర్ణయించారు. చివరికి ముగ్గురిలో ఇద్దరు బీజేపీలో చేరిపోయారు. ఒకరు రెబల్ తర్వాత సర్దుకున్నారు. పార్టీ మారీ మళ్లీ బీఆర్ఎస్‌కే వచ్చారు. కానీ..ఈ ఎక్కువ మందికి టిక్కెట్లు నిరాకరిస్తున్నందున ముందుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సిన అవసరం లేదన్న వాదన బీఆర్ఎస్ వ్యూహకర్తల్లో ఉంది. షెడ్యూల్ రిలీజైన రోజున ప్రకటిస్తే చాలనే వారు కూడా ఉన్నారు. షెడ్యూల్ రాకుండానే అభ్యర్థుల జాబితా ప్రకటించడం తొందరపాటు అవుతుందని భావిస్తున్నారు. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. అందుకే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ విషయంలో తొందరపడతారని బీర్ఎస్ నేతలు కూడా అనుకోవడంలేదు.
రాజకీయ పార్టీలు.. ప్రత్యర్థులు నిలబెట్టే అభ్యర్థుల్ని చూసి.. వారిని తట్టుకునే నేతల్ని ఖరారు చేయడానికి ప్రయత్నిస్తాయి. అంటే రాజకీయ పార్టీల జాబితాలన్నీ ఇంటర్ లింక్డ్ అన్నమాట. తొందరపడికేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే మాత్రం రాజకీయం వేరుగా ఉంటుంది
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…