ఫ్యామిలీ వర్సెస్ అధిష్టానం – అదో శిరోభారం

By KTV Telugu On 23 August, 2023
image

KTV TELUGU ;-

నేతల కోర్కెలకు అంతే లేకుండా పోతోందా ? టికెట్ల కోసం అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ? ఒకటి కాదు.. కనీసం రెండు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారా ? ఇదీ ఒక పార్టీ సీన్ మాత్రమేనా…అన్ని పార్టీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందా… తెలంగాణలో అసలేం జరుగుతోంది….
పిల్లి అవకాశం ఇస్తే ఎలుక తోక ఎత్తి చూపిస్తుందని ఒక సామెత ఉండనే ఉంది. రాజకీయాల్లో కూడా అంతే. అధిష్టానం కొంచెం లూజ్ ఇస్తే నాయకులు రెచ్చిపోతారు.అన్ని పనులు వాళ్లే చేసుకుని హైకమాండ్ తో మమ అనిపిచ్చేస్తారు. మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మేము,మాకు, మావారికి అన్న మూడు మాటలు మినహా వేరే చర్చే లేకుండా పోతుంది . అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా సరే ..నేతల తీరు ఒకేలా ఉంది.

రాజకీయాల్లో పాతుకుపోయిన నేతలు తమ వారసులను కూడా రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవకాశం వస్తే చాలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్నట్లుగా టికెట్లు అడుగుతున్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆయనతో పాటు కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత పదవుల్లో ఉన్నట్లుగానే తమకు కావాలని కోరుతున్న వారూ ఉన్నారు. బీఆర్ఎస్లోనే కనీసం పది మంది నేతలు తమ కుటుంబ సభ్యులకు టికెట్లు అడిగారు. గుత్తా వారు, కల్వకుంట్ల వారు, మైనంపల్లి వారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఒక్కరిద్దరియితే మాకు ఇవ్వకపోయినా ఫర్వాలేదు మా పిల్లలకు ఇవ్వండి అని అడగడం మొదలు పెట్టారు. అయితే అలాంటి అర్జీలన్నీ పక్కన పెట్టి మరీ కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల జాబితాను సిద్దం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో కూడా వారసుల గేమ్ నడుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అందులో నెంబర్ వన్ గా ఉన్నారు. తాను హుజుర్ నగర్ నుంచి తన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీ చేస్తామని అయనే ప్రకటించేసుకున్నారు. అదీ అధిష్టానవర్గం ఆమోదం లేకుండా చేసిన ప్రకటన అని కూడా మరిచిపోకూడదు. కాంగ్రెస్ లో కనీసం 15 మంది నేతలు తమతో పాటు తమ వారసులకు కూడా టికెట్లివ్వాలని కోరుతున్నారు. ఇక్కడ కుదరకపోతే ఢిల్లీ వెళ్లి మేనేజ్ చేసుకుంటామని కూడా బెదిరిస్తున్నట్లు సమాచారం. బీజేపీలో కనీసం నలుగురైదుగురు నేతలు వారసుల కోసం తంటాలు పడుతున్నారు. టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన భార్య కావ్యా కిషన్ రెడ్డికి అంబర్ పేట టికెట్ అడుగుతున్నారు. తాను లోక్ సభకు పోటీ చేయకుండా రాజ్యసభకు వెళ్లిపోతానని కిషన్ చెబుతున్నారట. బండి సంజయ్ కూడా తన భార్యను ఎన్నికల రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సారి మహిళలను ఎక్కువ మందిని రంగంలోకి దించాలని రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్టానానికి నూరిపోస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఇంటికి ఇద్దరు పోటీ చేసే వీలుంటుందని లెక్క గడుతున్నారు.

రాజకీయంగా తమ పరిస్థితిని సుస్థిరం చేసుకోవాలి. తరతరాలకు సరిపడా ఆర్థిక పరిపుష్టితో పాటు రాజకీయ పలుకుబడిని పెంచుకోవాలి. ఇద్దరు ముగ్గురికి పదవులు ఉంటే పనులు చేయించుకోవడం కూడా సులువు అవుతుంది. తమకు కావాల్సిన విధంగా పార్టీని శాసించే వీలుంటుంది. ఇలాంటి ఆలోచనలతోనే కుటుంబ సభ్యులను ప్రోత్సహించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ తరహాలో కాంగ్రెస్, బీజేపీ కూడా వాటి ఆటకట్టిస్తాయో లేదో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి