హిమాచల్ ప్రదేశ్‌పై పగబట్టిన ప్రకృతి

By KTV Telugu On 23 August, 2023
image

KTV TELUGU :-

హిమాచల్ ప్రదేశ్ అంటే అందరికీ భూతలస్వర్గమే గుర్తుకు వ్తుంది. కొండ వాలులో ఉండే పట్టణాలు.. మంచు శిఖరాలు.. ప్రశాంతమైన వాతావరణం …కులుమనాలి, రోహ్‌తంగ్ పాస్ ఇవన్నీ పర్యాటకులకు స్వర్గధామం. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రం ఎలా ఉంది..? ఎప్పుడో ఓ సారి వచ్చే వరదలు కాదు.. ప్రతీ ఏడాది ప్రళయం ముందుకు వస్తోంది. లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. పర్వతాలు కోతకు గురవుతున్నాయి. రోడ్లు నాశనం అయిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే.. ప్రకృతి విపత్తులు ఇలాగే వస్తే హిమాచల్ ప్రదేశ్ మనుషులు నివసించలేని రాష్ట్రంగా మారిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనంతటికి కారణం ఎవరు ? ఇలాంటి ప్రకృతి బీభత్సాలు ఎందుకు తరచుగా చోటు చేసుకుంటున్నాయి ?

ఎటు చూసినా విరిగిపడిన కొండ చరియలు .. వెల్లువలా నదుల ప్రవాహాలు లక్షల మంది హాహాకారాలు.. ఇదీ హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి. ఈ ఒక్క సారి కాదు.. గత నెలలలోనూ ఇదే తరహా ఉత్పాతం వచ్చింది. నెల రోజుల్లోనే మరోసారి అదే ప్రళయం వచ్చింది. గత ఏడాది వచ్చింది.. అంతకు ముందు ఏడాది కూడా వచ్చింది. ఇలా వరదలు బీభత్సం సృష్టిస్తున్నప్పుడు వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వేలు, లక్షల ఇళ్లు నేలమట్టమవుతున్నాయి. అత్యంత క్లిష్టమైన రహదారులు నాశనం అవుతున్నాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ ఉనికి నిలబెట్టుకుంటుందా అని భయపడే పరిస్థితి వస్తోంది.

హిమాచల్ ప్రదేశ్‌పై ప్రకృతి పగబట్టినట్లుగా వరదలు వస్తున్నాయి. ఊహించనంత ఆస్తి, ప్రాణ నష్టాల ను కలిగిస్తున్నాయి. విరామం లేకుండా పడిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. పర్వత సానువుల్లో కట్టిన ఇళ్ళు పేకమేడల్లా కూలిపోయాయి. వర్షాలు, వరదలు వరుసగా రెండుసార్లు సంభవించడం వల్ల ఆస్తి, ప్రాణనష్టం ఎంతో లెక్కించే అవకాశం కూడా లేకుండా పోతోంది. కొండ చరియలు విరిగి పడిన చోట కూలిన ఇళ్ళల్లో ఎందరు మరణిం చారో లెక్కలు తేలడం లేదు. ఎక్కడికక్కడ వారు సజీవ సమాధి అయ్యారు. ప్రభుత్వం ఇచ్చే లెక్కలకు అక్కడ వాస్తవంగా సంభవిస్తున్న మరణాలకూ పొంతన లేదు. అలా లెక్కలు తేల్చడం ఎవరికీ సాధ్యం కాదు. సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలో శివాలయం కుప్పకూలడంతో అనేక మంది భక్తులు సజీవ సమాధి అయ్యారు. ఆలయంపై కొండచరియలు విరిగిపడుతుంటే ప్రభుత్వ యంత్రాంగ మంతా నిమిత్తమత్రంగా చూస్తూ ఉండిపోవడo తప్ప ఏ కొంచెం రక్షణ చర్యలు చేపట్టలేకపోయారు. భారీ వర్షాలకు కళ్ళముందే వందలాది ఇళ్ళు వరదలో కొట్టుకుని పోయాయి. చెట్లు, కరెంట్‌ స్తంభాల సంగతి సరేసరి. రెండు నెలల వ్యవధిలో పది వేల కోట్ల రూపాయిలకుపైగా విలువైన ఆస్తులు నేలమట్టం అయ్యాయి. కానీ అది ప్రభుత్వ లెక్కే. అంతకు మించిన నష్టం ఉంటుందని.. నిపుణులు అంచనా వేస్తున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌పై ప్రకృతి ఇలా పగబట్టడానికి మనషుల దురాశే కారణం. అక్కడ కొండలపై ఎక్కడ చూసినా విద్యుత్ ప్రాజెక్టులు కనిపిస్తాయి. రాజకీయ పలుకుబడితో.. పర్యావరణ నిబంధనలు పట్టించుకోండా విచ్చలవిడిగా నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టులు కనిపిస్తూంటాయి. విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం కొండలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. వీటివల్లే కొండ చరియలు అధిక సంఖ్యలో విరిగి పడుతున్నాయ ని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ తదితర హిమాలయ రాష్ట్రాల్లో జలవి ద్యుత్‌ ప్రాజెక్టులకు నిరభ్యంతరంగా అనుమతులు ఇచ్చారు. ఈ విద్యుత్‌ ప్రాజెక్టులన్నింటికీ జాతీయ బ్యాంకులు పెద్దఎత్తు న రుణాలు ఇచ్చాయి. హిమాలయ ప్రాంతాల్లో నిర్మించే మెగా ప్రాజెక్టులు ఆ రాష్ట్ర పునానాదులను పెకిలించేస్తున్నాయి. ఇప్పుడు అక్కడి ప్రజలు నిత్యం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రెండు నెలల స్వల్ప వ్యవధిలో 170 సార్లు కుంభవృష్టి కురవడం అంటే ఎంత విషాదకరమో స్పష్టం అవుతోంది

హిమాచల్ ప్రదేశ్‌ భూములు కొనడానికి ఇతరులకు అవకాశం లేదు. కానీ అక్కడ రియల్ ఎస్టేట్ సహా అనేక మైదాన ప్రాంత వ్యాపారాలు చొచ్చుకు వచ్చాయి. అవి పర్యావరణ విధ్వంసానికి దారి తీస్తున్నాయి. ఫలితంగా.. ఆ రాష్ట్రం ఉనికి ప్రమాదంలో పడుతోంది.

కొండ ప్రాంత రాష్ట్రాలు అత్యంత సున్నితమైనవ. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లాంటి హిమాలయ రాష్ట్రాలను ఇంకా సున్నితంగా చూసుకోవాల్సి ఉoది. కానీ ఆ రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసానికి కారణమయ్యే వ్యాపారాలను ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు కొదవ ఉండటం లేదు. అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా పేరున్న సివ్లూ, కశౌలీ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా ర సంస్థలకు వందల ఎకరాలను ప్రభుత్వాలు కేటాయించాయి. ఆదాయ మార్గం కోసం ఇలాంటి ప్రదేశాల్లో రిసార్టులను నిర్మిస్తున్నారు. వీటివల్ల కాలుష్యం పెరుగుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాజకీయం పూర్తిగా ఖర్చుతో కూడుకున్నట్లుగా మారిపోవడం.. అవినీతి కోసం లైసెన్సులు, ఎన్‌ఓసీలు సులువుగా జారీ చేయడం కామన్ అయిపోయింది. వేసవి విడిదులుగా పేరొందిన కులు, మనాలీ వంటి ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అధునాతన హర్మ్యాలను నిర్మిస్తు న్నారు. సినిమా షూటింగ్‌లకు వచ్చే వారికి ఇక్కడ విశ్రాంతి గృహాలను నిర్మిస్తున్నారు. భారీ వర్షాలకు నాలుగు వరుసల మనాలీ జాతీయ రహదారి 40 శాతం రెండు రోజుల వ్యవధిలోనే కొట్టుకునిపోయింది. అనేక భారీ వాహనాలు, ట్రక్కులు నీట మునిగి నిలిచిపోయాయి.

ఎప్పుడో వందేళ్లకు ఓ సారి వచ్చే విపత్తులు అని సర్ది చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే.. ఒకే ఏడాదిలో ఒకదానిని మించిన ఒకటి విపత్తులు వస్తున్నాయి. ఇలాంటి విపత్తులు వరుసుగా పదేళ్ల పాటు వస్తే.. హిమాచల్ ప్రదేశ్ నివాసయోగ్యం కానీ రాష్ట్రంగా మారిపోతుందన్న అంచనా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో కొండ వాలు రోడ్లు నిర్మించడం చాలా కష్టం. కానీ విపత్తులు వస్తే అవి వెంటనే ధ్వంసం అవుతున్నాయి. వాటిని పునర్ నిర్మించడం తలకు మించిన భారం అవుతుంది. ఇక ఇళ్లు కోల్పోయేవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. హిమాచల్ ప్రదేశ్ మైదాన ప్రాంతమే ఉండదు. అంతా కొండవాలుల్లోనే ఉంటుంది అందుకే.. ఆ రాష్ట్ర భవిష్యత్ పై అందరూ బెంగ పెట్టుకుంటున్నారు.

హిమాచల్ ప్రదేశ్‌పై ఆధునిక వ్యాపార సామ్రాజ్యం.. పడగ నీడ పడటంతోనే అసలు సమస్య ప్రారంభమయింది. వేల కోట్ల ధనార్జనే లక్ష్యంగా నయా బిజినెస్ మెన్లు .. రాజకీయ నేతలకు లంచాలు ఆశ చూపి.. ప్రకృతి స్వర్గంలో విద్యుత్ ప్రాజెక్టులు, రిసార్టులు, రియల్ ఎస్టేట్ పేరుతో ప్రకృతి విధ్వంసం చేస్తున్నారు. ఫలితం ఇప్పుడు హిమాచల్ రిస్క్‌లో పడిపోయింది. దీన్ని కాపాడుకోవాలంటే.. ఓ మహాయజ్ఞాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది.

అభివృద్ధి అవసరమే కానీ.. అది మనల్ని నాశనం చేసేది అయి ఉండకూడదు. అలాంటిది అసలు అభివృద్ధే కాదు. ఇప్పుడు హిమాచల్ ను చూసి తెలుసుకోవాల్సింది అదే.