లోకేష్ , పవన్ మధ్యలో గోదావరి

By KTV Telugu On 23 August, 2023
image

KTV TELUGU ;-

టీడీపీ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోందా. గుంటూరు, కృష్ణ వేరు గోదావరి వేరు అని యువనేత నారా లోకేష్ డిసైడయ్యారా. ఉభయ గోదావరిలో టీడీపీకి ఊపు కోసం చంద్రబాబు పెద్ద స్కెచ్చే వేశారా. దాన్ని అమలు చేసేందుకు లోకేష్ కాలికి బలపం కట్టుకుని తిరగబోతున్నారా.. ఈ పరిణామాలు కొందరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది..

గోదావరి అంటే కాపు నాడు. కాపులకు కంచుకోట. అక్కడ కాపులను తమ వైపుకు తిప్పుకుంటే రాష్ట్రంలో అధికారం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. అలాంటి కాపు కోటలోకి లోకేష్ ఎంటరవుతున్న వేళ టెన్షన్ తప్పదని భావిస్తున్నారు. ఐనా సరే ఎక్కువ సమయం ఉభయ గోదావరి జిల్లాల్లో పాదయత్ర చేయాలని లోకేష్ డిసైడయ్యారు. అదే ఆయన గేమ్ ప్లాన్ కూడా కావచ్చు…

జనసైన్యాధ్యక్షుడు పవన్ కల్యాణ్ వారాహి యాత్రను గోదావరి తీరం నుంచి మొదలు పెట్టారు.భారీ సక్సెస్ సాధించారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. పవన్ సొంత సామాజికవర్గమైన కాపులు అక్కడ చాలా ఎక్కువ. పైగా పవర్ స్టార్ అభిమానులు కూడా అక్కడ ఎక్కువగానే ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ ఓడిపోయినప్పటికీ ఈ సారి ఆయన్ను గెలిపించుకుంటామని కాపులు ధీమాగా ఉన్నారు. వారందరికీ చేగొండి హరిరామ జోగయ్య దిశానిర్దేశం చేస్తున్నారు.కట్ చేసి చూస్తే నారా లోకేష్ యువగళం పాదయాత్ర వచ్చే వారం గోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని టీడీపీ శ్రేణులు లోకేష్ కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేవలం మూడు రోజులు గడిపే లోకేష్ ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం దాదాపు రెండు నెలలు పాదయాత్ర చేస్తారు. అక్కడ ప్రతీ ఒక్క ఊరిలో ప్రతీ ఒక్క ఓటరును పలుకరించే విధంగా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ గ్రామాలు తిరగాలని కూడా ప్లాన్ ఉందట. ఇందుకోసం స్థానిక నేతలు గ్రామాలను ఎంపిక చేస్తున్నారు.

టీడీపీకి ఈ సారి కాపులే టార్గెట్ అని చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 30కి పైగా అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం వీచినా ఇప్పుడు పరిస్థితి అధికారపార్టీకి ప్రతికూలంగా తయారైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాపు జనాభా 25 శాతం ఉంటే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వారి జనాభా 23 శాతం ఉంది. దాదాపుగా 20కి పైగా నియోజకవర్గాల్లో వారిదే నిర్ణయాత్మక పాత్ర అవుతుంది.కొన్ని నియోజకవర్గాల్లో ఎస్సీల ఓట్లు కీలకమవుతాయి. ఈ సంగతిని అర్థం చేసుకున్న టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో తమకు ఉన్న సంప్రదాయ కాపు ఓటు బ్యాంకును పోగొట్టుకూడదని, వీలైతే పక్క పార్టీల ఓటు బ్యాంకులను కూడా కొల్లగొట్టాలని భావిస్తోంది. కాపు ఓట్లను చూసుకుని పవన్ కల్యాణ్ డిమాండ్లు పెంచే అవకాశం ఉన్నందున తమకు కూడా కాపుల బలం ఉందని నిరూపించుకోవాల్సిన అనివార్యత టీడీపీపై ఉంది.అందుకే ఇప్పుడు కాపులు బలంగా ఉన్న చోట్ల లోకేష్ ఎక్కువగా తిరిగితే జనం బాగా వచ్చేందుకు అవకాశాలుంటాయని ఎదురుచూస్తున్నారు. కాపులున్న చోట్ల లోకేష్ కు జనాన్ని చూపించగలిగితే.. తమకు కూడా కాపు బలం ఉందని నిరూపించినట్లవుతుందన్నది టీడీపీ ఆలోచనా విధానం. లేని పక్షంలో పవన్ పైచేయి అయిపోతారని, ఖచితంగా గెలిచే స్థానాలకు ఆయన పార్టీకి ఇవ్వాల్సి వస్తుందని టీడీపీ ఆలోచిస్తోంది.

చంద్రబాబు చాణక్యం ఎక్కడైనా ఏ విధంగానైనా పనిచేసే వీలుంది. యువగళం పేరుతో లోకేష్ ను ఊరూరా తిప్పడం కూడా ఆయన్ను భవిష్యత్తు నేతగా తీర్చిదిద్దేదుకేనని మరిచిపోకాడదు. పవన్ కంటే లోకేష్ మంచి నాయకుడని చెప్పేందుకు కూడా చంద్రబాబు తపన పడుతున్నారు.అ దిశగానే గోదావరి తీరంలో లోకేష్ టూర్ ను సక్సెస్ చేయాలనుకుంటున్నారు. ఎన్ని రోజులు ఎక్కువ ఉంటే అంత మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా వైసీపీ కూడా అక్కడ బలంగా ఉన్నందున లోకేష్ ను అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేసే వీలుంటుంది. టీడీపీకి కావాల్సింది కూడా అదే. ఎక్కువ గొడవ చేస్తే లోకేష్ పాపులారిటీ పెరుగుతుంది. అప్పుడు పవన్ కల్యాణ్ ను వత్తిడితో ఉంచొచ్చు. సీట్ల బేరంలో అఫెన్స్ గేమ్ ఆడొచ్చు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి