వ్యూహం హిట్ అవుతుందా? ఫ‌ట్ మంటుందా?

By KTV Telugu On 24 August, 2023
image

KTV TELUGU ;-

తెలంగాణాలో పాల‌క ప‌క్ష‌మైన భార‌త రాష్ట్ర స‌మితి మూడు నెల‌ల ముందుగానే  98శాతానికి పైగా అభ్య‌ర్ధుల జాబితాను ఒకే ఒక్క ద‌ఫాలో విడుద‌ల చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌క‌పంన‌లు సృష్టిస్తోంది. ఇది కేసీయార్ వ్యూహ‌మా  లేక ఘోర‌మైన త‌ప్పిద‌మా? అన్న‌ది అర్ధం కాక రాజ‌కీయ పండితులు సైతం త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. చాలా ముందుగా అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేయ‌డం అంటే విజ‌యంపై  బోలెడు విశ్వాసం ఉంటేనే సాధ్య‌మ‌వుతుందంటున్నారు విశ్లేష‌కులు.ఈ వ్యూహం బి.ఆర్.ఎస్. కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మేలు చేస్తుందా? అన్న అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలంగాణాలో ఇంకా ఎన్నిక‌ల న‌గారా మోగ‌లేదు. డిసెంబ‌రు 7 త‌ర్వాత ఏ క్ష‌ణంలో అయినా ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశాలున్నాయి. అంటే న‌వంబ‌రు లో  ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అవుతుంది. సాధార‌ణంగా ఎన్నిక‌ల  న‌గారా మోగిన త‌ర్వాత‌నే మెజారిటీ అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేస్తూ ఉంటాయి రాజ‌కీయ పార్టీలు.ఒక్కో సంద‌ర్భంలో  నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసే లోపు ఆ ప‌ని చేస్తూ ఉంటారు. కానీ కేసీయార్ మాత్రం చాలా ముందుగా అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించారు. ఇప్పుడే కాదు 2018 ఎన్నిక‌ల్లోనూ కేసీయార్ ఇలానే అంద‌రిక‌న్నా ముందుగా అభ్య‌ర్ధుల జాబితా విడుద‌ల చేశారు. కేసీయార్ కు న‌మ్మ‌కాలు ఎక్కువ‌. అప్పుడు కూడా వేద పండితుల సూచ‌న‌ల మేర‌కు శ్రావ‌ణ మాసంలోనే జాబితా విడుద‌ల చేశారు. ఇప్పుడూ అంతే.

బి.ఆర్.ఎస్. జాబితా అంతా బ‌ట్ట‌బ‌య‌లు అయిపోవ‌డంతో ఇది ఒక విధంగా  ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీకి క‌లిసొచ్చే అంశం. ఎందుకంటే 115 నియోజ‌క వ‌ర్గాల్లో త‌మ ప్ర‌త్య‌ర్ధులు ఎవ‌రో కాంగ్రెస్ నాయ‌క‌త్వానికి ముందుగానే తెలిసిపోయింది కాబ‌ట్టి  ఆ అభ్య‌ర్ధుల‌కు దీటుగా బ‌ల‌మైన అభ్య‌ర్ధుల‌ను ఎంపిక చేసుకునేందుకు బోలెడు స‌మ‌యం ఉంది. ర‌క ర‌కాల ఆప్ష‌న్లు, సామాజిక వ‌ర్గాల ఎంపిక‌ల‌కు స్వేచ్ఛ ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి క‌చ్చితంగా అడ్వాంటేజే అంటున్నారు రాజ‌కీయ పండితులు. అయితే బి.ఆర్.ఎస్. వ్యూహ‌క‌ర్త‌లు మాత్రం ముంద‌స్తుగా జాబితాను విడుద‌ల చేయ‌డం వ‌ల్ల త‌మ‌కే లాభ‌మ‌ని అంటున్నారు. త‌మ అభ్య‌ర్ధుల‌కు ఎన్నిక‌ల ప్ర‌చారం చేసుకోడానికి  ఎక్కువ స‌మ‌యం ఉంటుంది కాబ‌ట్టి ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకోవ‌చ్చున‌ని వారంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్-బి.ఆర్.ఎస్. ల మ‌ధ్య‌నే ఉంటుంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. బిజెపి మూడో స్థానంలో మాత్ర‌మే ఉంటుంది. బి.ఆర్.ఎస్. నాయ‌క‌త్వం పైకి గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తోన్నా ఒకేసారి జుంబో లిస్ట్ విడుద‌ల చేయ‌డానికి ఓ కార‌ణం ఉందంటున్నారు రాజ‌కీయ పండితులు. అంద‌రూసిటింగ్ ఎమ్మెల్యేల‌కూ టికెట్లు ఇవ్వడం వ‌ల్ల   పార్టీలో అసంతృప్త జ్వాల‌లు ర‌గిలే అవ‌కాశాలు ఉండ‌వ‌ని బి.ఆర్.ఎస్. భావిస్తోంది. అయితే  బి.ఆర్.ఎస్. విడుద‌ల చేసిన జాబితాలో స‌గానికి పైగా అభ్య‌ర్ధులు ఓడిపోయేవారే అని బిజెపి అంటోంది. ఓట‌మి భ‌యంతోనే కేసీయార్ ఇలా ఒకేసారి జాబితా విడుద‌ల చేసి ప్ర‌తిప‌క్షాల‌ను క‌న్ఫ్యూజ్ చేస్తున్నార‌ని వారంటున్నారు.

బి.ఆర్.ఎస్. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి కాబ‌ట్టే కేసీయార్ ధైర్యే సాహ‌సే ల‌క్ష్మే అన్న‌ట్లు ఒకేసారి మెజారిటీ స‌భ్యుల జాబితాను విడుద‌ల చేశార‌ని కాంగ్రెస్ నాయ‌క‌త్వం భావిస్తోంది. కొద్ది వారాల క్రితం కేసీయార్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన పార్టీ నేత‌ల స‌మావేశంలోనే కొంద‌రు ఎమ్మెల్యేలు ద‌ళిత బంధు ప‌థ‌కం పేరు చెప్పి ల‌బ్ధిదారుల నుండి  మూడు ల‌క్ష‌ల చొప్పున వ‌సూలు చేస్తున్న‌ట్లు త‌న‌కు స‌మాచారం ఉంద‌ని కేసీయారే అన్నారు. అటువంటి వారు  ప‌ద్ధ‌తి మార్చుకోక‌పోతే టికెట్లు ఉండ‌వ‌ని హెచ్చ‌రించారు. అటువంటిది ఇపుడు  తొమ్మిది మందికి మిన‌హా అంద‌రు సిటింగుల‌కూ టికెట్లు ఇవ్వ‌డం విడ్డూర‌మే అంటున్నారు. ఎక్కువ మందిని త‌ప్పిస్తే అది అసంతృప్తికి దారి తీసే ప్ర‌మాదం ఉంద‌న్న ఉద్దేశంతోనే గెలిచినా గెల‌వ‌క‌పోయినా సిటింగుల‌కు సీట్లు ఖాయం చేసి ఉంటార‌న్న‌ది కాంగ్రెస్ లాజిక్.

ఎక్కువ మందికి టికెట్ రాక‌పోతే వారు ఇత‌ర పార్టీల‌కు వ‌ల‌స‌లు పోయే అవ‌కాశాలు కూడా ఉండేవి. వాటికి చెక్ చెప్ప‌డం కూడా కేసీయార్ వ్యూహంలో భాగం కావ‌చ్చునంటున్నారు. పార్టీలో మిగ‌తా వారికి న‌చ్చ‌చెప‌ప‌డానికి కూడా ఇది ప‌నికొస్తుంద‌న్న‌ది ఉద్దేశం కావ‌చ్చునంటున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేల‌కు ఇవ్వ‌డం ద్వారా వారి విజ‌యంపై పార్టీకి ధీమా ఉంద‌ని జ‌నంలోకి వెళ్లాల‌న్న‌ది కూడా ఒక యోచ‌న కావ‌చ్చునంటున్నారు. మొత్తానికి కేసీయార్ వేసిన ఎత్తుగ‌డ‌పై రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి