ఇక కాంగ్రెస్, బీజేపీలదే టాస్క్ !

By KTV Telugu On 25 August, 2023
image

KTV TELUGU ;-

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ బాణం వేసేశారు. ఎన్నికలకు ఇంకా మూడున్నర నెలలు ఉన్నప్పటికీ.. ఆయన తన సైన్యం జాబితాను రిలీజ్ చేసేశారు. ఇలా చేయడంలో ఆయన తొందర పడ్డారని లేకపోతే మాస్టర్ ప్లాన్ వేశారని ఎవరి విశ్లేషణలు వారు చేయవచ్చు. కానీ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ముందు అసలు టార్గెట్ పెట్టేశారు. ఎన్నికల పరుగు పందెంలో పోల్ పొజిషన్ నుంచి కేసీఆర్ పరుగు ప్రారంభించారు. ఇప్పుడు అసలు పరీక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలకే ఉంది. బీఆర్ఎస్ పార్టీని ఎలా బలహీనం చేయాలి.. ఎలా తమ పార్టీని బలోపేతం చేసుకోవాలన్నది ఆ రెండు పార్టీల చేతుల్లోనే ఉంది. కేసీఆర్ ఆ చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఏం చేస్తాయన్నది తెలంగాణ రాజకీయాల్ని మార్చే అంశం.

దమ్ముంటే సిట్టింగ్‌లతోనే బరిలోకి దిగు అని రేవంత్ రెడ్డి కేసీఆర్‌కు చాలా సార్లు చాలెంజ్ చేశారు. అంతే కాదు గజ్వేల్ నుంచి పారిపోవద్దని అక్కడే పోటీ చేయాలని కూడా సవాల్ చేశారు. అదే సమయంలో తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా ప్రకటించారు. తరచూ అక్కడ పర్యటిస్తున్నరు. బీజేపీ వ్యూహం ఏమిటో తెలియదు కానీ.. ఈటల రాజేందర్ అక్కడ పోటీ చేస్తే మాత్రం కేసీఆర్ తన నియోజకవర్గానికి కొంత సమయం కేటాయించక తప్పదు. ఇప్పుడు అందరి సవాళ్లను స్వీకరించినట్లుగా.. సిట్టింగ్‌లనే అభ్యర్థులుగా ప్రకటించారు. గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. నేరుగా చెప్పకపోయినా కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేసిన సవాళ్లను అంగీకరించారు. మరి ఇప్పుడు కేసీఆర్, బీజేపీ.. తాము చేసిన భీకర సవాళ్లకు తగ్గట్లుగా స్పందిస్తాయా ? కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు రంగంలోకి దిగుతాయా ?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణ భవన్ లో అభ్యర్థుల ప్రకటన చేయగానే రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. అది స్పందించక తప్పని పరిస్థితి. ఎందుకంటే సిట్టింగ్‌లకే సీట్లివ్వాలని ఆయన చేసిన చాలెంజ్‌లు కళ్ల ముందే ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చారు కాబట్టి.. రేవంత్ స్పందించాల్సి వచ్చింది. రేవంత్ కూడా ఏ మాత్రం కంగారు పడకుండా.. మీడియా ముందుకు వచ్చి.. సవాల్ ను స్వీకరించామని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేశాక, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందనే సంపూర్ణ విశ్వాసం తమలో కలిగిందని రేవంత్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంత మంది ఎమ్మెల్యేలను గెలిపించే నాయకుడు రెండు చోట్ల గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేయడం ఏంటని ప్రశ్నించారు. అంటే పరోక్షంగా కేసీఆర్ తన ఓటమిని ఒప్పుకుంటున్నారని అన్నారు. గతంలో ఎన్టీఆర్‌ను కల్వకుర్తిలో ఓడించారని, ఇప్పుడు కేసీఆర్‌ను గజ్వేల్‌లో, కామారెడ్డిలో ఓడిస్తారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడంపై బీజేపీ నేతలు కూడా స్పందించారు. బిజెపి అభ్య‌ర్ధిగా గ‌జ్వేల్ లో ఈట‌ల రాజేంద‌ర్ పోటీ చేయ‌నున్న‌ట్లు తాము ప్ర‌క‌టించ‌డంతోనే కెసిఆర్ లో ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని బిజెపి ఎంపి ధ‌ర్మ‌పురి అర‌వింద్ విమర్శించారు. కామారెడ్డికి కెసిఆర్ వెళ్ల‌డం గజ్వేల్ ప్రజలను అవమానించినట్లేన‌ని చెప్పుకొచ్చారు. ఇలాంటి విమర్శలు చేయవచ్చు కానీ.. ఇప్పుడు బీజేపీ తన మాటలకు తగ్గట్లుగా చేయాల్సింది.. గజ్వేల్ లో కేసీఆర్‌కు పోటీగా ఈటలను నిలబెట్టడం.

ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్‌లకు కేసీఆర్ ఓ భిన్నమైన సవాల్ విసిరారు. దమ్ముంటే తనను..తన పార్టీని టచ్ చేసి చూడాలన్న సవాల్ అందులో ఉంది. ఒక్క సారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టిక్కెట్లు ప్రకటిస్తే..ఆ పార్టీలో టిక్కె్ట్లు పొందిన వాళ్లు తప్ప అందరూ బయటకు వచ్చేస్తారని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారు. ఇరవై ఏడో తేదీన ఖమ్మంలో అమిత్ షా బహిరంగసభ ఉంది. ఆ సభలో పాతిక మంది బీఆర్ఎస్ ప్రముఖులకు కండువా కప్పుతామని చాలెంజ్ చేస్తున్నారు. తమ్ముల నాగేశ్వరరావు వంటి వారితో మాట్లాడామని కూడా చెబుతున్నారు. తుమ్మల వైపు నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు కానీ.. ప్రస్తుత రాజకీయాల్లో దేన్నీ కొట్టి పారేయలేం. కానీ చేయగలిగింది చేయండి అని కేసీఆర్.. అభ్యర్థుల్ని ప్రకటించడం ద్వారా ఓ సవాల్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అయినా.. బీజేపీ అయినా.. బీఆర్ఎస్ ను ఓడించడానికి ముందుగా ఆ పార్టీని బలహీన పరిచే ప్రయత్నం చేయాలి. అంటే.. అసంతృప్త వాదుల్ని విపరీతంగా ఆకర్షించాలి. బీఆర్ఎస్ జాబితా ప్రకటించిన తర్వాత కూాడా నేతల్ని ఆకర్షించలేకపోతే.. కేసీఆర్ విసిరిన సవాల్ ముందు ఆ రెండు పార్టీలు బొక్క బోర్లా పడినట్లే.

సిట్టింగ్‌లకే సీట్లు ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించుకున్న తర్వాత చాలా కసరత్తు చేశారు. ఎవరూ పార్టీ వీడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగానే మహేందర్ రెడ్డికి మంత్రి పదవి కూడా ఇస్తున్నారు. ఈ వ్యూహాలను బీజేపీ, కాంగ్రెస్ ఎలా చేధిస్తాయన్నది ఇక్కడ కీలకం.

బీఆర్ఎస్ పార్టీలో ఆశావహులకు లెక్కే లేదు. జనంలో మంచి పలుకుబడి ఉన్న నేతలు ఉన్నారు. వారిలో చాలా మందికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కడం లేదు. తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి ఇలాంటి నేతలు ఎన్నికలకు దూరంగా ఉంటారని ఎవరూ ఊహించలేరు. కానీ ఉంటున్నారు. వీరందర్నీ ట్యూన్ చేసేందుకు కేసీఆర్ ముందుకానే ప్లాన్ చేసుకున్నారు. టిక్కెట్ ఇస్తే సరే లేకపోతే తాను.. తన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి తమ దారి తాము చూసుకుంటామని తేల్చి చెప్పిన మహేందర్ రెడ్డిని.. తనకు టిక్కెట్ లేని విషయాన్ని ప్రకటించే.. కార్యక్రమానికి హాజరయ్యేలా చేశారు. ఎలా అంటే… ఉన్న పళంగా ఆయనను మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. బుధవారం మహేందర్ రెడ్డి ప్రమాణం చేస్తారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసే వారి పదవి కాలం చాలా స్వల్పమే. ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకూ మాత్రమే పదవిలో ఉంటారు. ఒక వేళ బీఆర్ఎస్ గెలిచినా వారికి మళ్లీ చాన్సిస్తేనే మంత్రులు అవుతారు. లేకపోతే పదవి కోల్పోతారు. నిజానికి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినా వారు చేయగలిగిందేమీ ఉండదు. ఎందుకంటే.. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన తరవాత మంత్రులుగా కూడా చేయడానికి ఏమీ ఉండదు. ఏ నిర్ణయాలూ తీసుకోలేరు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోంది. అయితే మంత్రులుగా మాత్రమే ఉంటారు. పార్టీ మారకుండా కేసీఆర్ ఈ ఆఫర్ ఇచ్చారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మంత్రి పదవులు ఉన్నందున వారు ఇతర పార్టీల్లో చేరి పోటీ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో లేకపోతే.. ఎమ్మెల్సీగానో అవకాశం ఇస్తానని కేసీఆర్ బుజ్జగించి ఉంటారని చెబుతున్నరు. పట్నం మహేందర్ రెడ్డి కీలక నేత. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోతే.. ఆయన సోదరుడు కొడంగల్ అభ్యర్థి కూడా వెళ్లిపోతారు. వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగులుతుంది. అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు.. కేకే స్థానంలో రాజ్యసభ సీటు ఇచ్చి.. పార్లమెంటరీ పార్టీ నేతను చేస్తామన్న ఆఫర్ కూడా ఇచ్చారని అంటున్నారు. మిగిలి నేతలకూ ఏదో ఓ తాయిలం ప్రకటించే ఉంటారు. అందుకే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన తీగల కృష్ణారెడ్డి కూడా ఆగిపోయారు. మజ్లిస్ కోసం డమ్మీగా పోటీ చేయాల్సిన నియోజకవర్గం మలక్ పేటలో తీగల కుటుంబానికో సీటు సర్దుబాటు చేశారు. అంటే.. కేసీఆర్ ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకునే సిట్టింగ్‌లకు సీట్లిచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్లాన్ ను కాంగ్రెస్, బీజేపీ చేధించాల్సి ఉంటుంది.

రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీని బలహీనం చేసే మైండ్ గేమ్ కూడా కీలకం. కాంగ్రెస్ , బీజేపీలకు లీడర్లు అవసరం లేకపోవచ్చు.. కానీ బీఆర్ఎస్ ను నైతిక దెబ్బకొట్టాలంటే వలసలను ఆకర్షించాలి. మైనంపల్లి హన్మంతరావు లాంటి నేతలు ఇప్పటికే బయట పడ్డారు. టిక్కెట్లు ప్రకటించిన వారిని లాక్కుంటే.. అది అడ్వాంటేజ్ అవుతుంది. మాస్ లీడర్లుగా ఉన్న వారిని చేర్చుకుంటే.. మరింత ప్లస్ అవుతుంది. కానీ ఇది అంత తేలిక కాదని.. కేసీఆర్ తీసుకున్న ముందు జాగ్రత్తలే చెబుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ పాచికలు వేశారు. ఇక ఆట ఆడాల్సింది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే.

తెలంగాణ రాజకీయ చదరంగంలో కేసీఆర్ తొలి ఎత్తు వేశారు. అదీ కూడా చాలా త్వరగా. ఆయన ఎర వేశారా.. లేకపోతే తొందరపడ్డారా అన్నది తేల్చాల్సింది ..కేసీఆర్ ను ఓడించేందుకు పోటీ పడుతున్న వారే. వారి వ్యూహాలే ఇప్పుడు.. వారి గెలుపోటముల్ని నిర్దేశించబోతున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి