మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం గంటకో ట్విటు…రోజుకో మలుపు అన్నట్లుగా కొనసాగుతోంది. మూడు పార్టీల నాయకులు పదునైన మాటలతో రెచ్చిపోతున్నారు. ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ తరపున పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో రాత్రికి రాత్రి వేలాది పోస్టర్లు వెలిశాయి. ఫోన్ పే సింబల్ గుర్తుకువచ్చేలాగా కాంట్రాక్టు పే అని రాసి దానికింద …18 వేల కోట్ల కాంట్రాక్టు రాజగోపాల్ రెడ్డికి కేటాయించారని ఆ పోస్టర్లను రూపొందించారు. అలాగే 500 కోట్ల బోనస్ అంటూ ఫోన్ పే ట్రాన్సక్షన్ తరహాలో రాత్రికి రాత్రే వేలాది పోస్టర్లు అతికించారు. ఈ పోస్టర్లు ఎవరు అంటించారనేది ఇంకా తెలియకున్నా…ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పని అయి ఉంటుందని భావిస్తున్నారు కోమటిరెడ్డి వర్గీయులు. రాజగోపాల్ రెడ్డి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే పోస్టర్ల నాటకం ఆడుతున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి కంపెనీకి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు దక్కిందని, ఆ కాంట్రాక్టు కోసమే ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే తాను ఆ కాంట్రాక్టును సక్రమంగానే దక్కించుకున్నానని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కోమటిరెడ్డి చెబుతున్నారు. అయినా ఆ కాంట్రాక్టును పదే పదే ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ కోమటిరెడ్డి మీద అటాక్ చేస్తోంది. గతంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ని టార్గెట్ గా చేసుకొని పే సిఎం అంటూ బెంగళూరులో వెలసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో ఇలాంటి పోస్టర్లు వెలువడం ఇదే మొదటిసారి కాదు..రాజగోపాల్ రాజీనామా చేసినప్పుడు కూడా మునుగోడు నిన్ను క్షమించదు అంటూ ఆ నియోజకవర్గంలో వెలసిన పోస్టర్లు తీవ్ర దుమారాన్ని రేపాయి.