చాలా మంది లాజిక్కులను నమ్మరు. ఎంత చదువుకున్న వాళ్లయినా మ్యాజిక్కులనే నమ్ముతారు. బహుశా ఈ లాజిక్కు బాగా తెలిసే కావచ్చు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ మ్యాజిక్ చేస్తున్నారు. నాలుగున్నర దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రదర్శిస్తోన్న మ్యాజిక్ ని చూసి ఆయన సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు. చంద్రబాబు నాయుడికి ఏమైందని వారు తలలు పట్టుకుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదు. తన మ్యాజిక్ ని మించిన లాజిక్ లేదని ఆయన నమ్ముతున్నారు.
14ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు మరో 14 ఏళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాల శకంలో ఓ వెలుగు వెలిగారు. రాష్ట్రపతులు, ప్రధానులుగా ఎవరుండాలో తానే నిర్ణయించానని కూడా ఆయన చెబుతూ ఉంటారు.రాజకీయ ఎత్తుగడల్లోనూ..చాణక్య వ్యూహాల్లోనూ చంద్రబాబు ను మించిన వారు సమకాలీన రాజకీయాల్లో ఎవరూ లేరన్న ప్రచారమూ ఉంది. అటువంటి చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా మ్యాజిక్కులు, మంత్రాల మాటలు మాట్లాడ్డమే విడ్డూరంగా ఉందంటున్నారు రాజకీయ పండితులు.
2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. అందుకోసం ఎవరితో పొత్తు కుదుర్చుకోడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఆయనే సంకేతాలు ఇస్తున్నారు. తనయుడు లోకేష్ ను యువగళం పేరిట పాదయాత్రతో జనంలోకి పంపారు. వేలాది కిలోమీటర్ల పాదయాత్రలో లోకేష్ ఇప్పటికే వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటి చాలా రోజులైంది.మరో పక్క చంద్రబాబు నాయుడే స్వయంగా పలు జిల్లాలు తిరుగుతూ నీటి ప్రాజెక్టుల తీరుపై ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఎన్నికల వాతావరణాన్ని తెచ్చి పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయాన్ని ఎవరూ ఆపలేరంటోన్న చంద్రబాబు నాయుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను జనం ఇంటికి సాగనంపడం ఖాయమని అంటున్నారు.
నిత్యం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తూర్పారబట్టడమే అజెండాగా దూసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు. ఓటర్ల జాబితాలోంచి టిడిపి అనుకూల ఓటర్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి ఏకంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇవన్నీ చేస్తూనే పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. తాను పర్యటించిన ప్రతీ చోటా బలమైన అభ్యర్దులు ఉంటే వచ్చే ఎన్నికల్లో ఈయనే మీ అభ్యర్ధి అని చెబుతున్నారు కూడా. ఇలా దూసుకుపోతూనే మరో వైపు చంద్రబాబు నాయుడు మంత్రాల జోలికి ఎందుకు వెళ్తున్నారో అర్ధం కావడం లేదంటున్నారు విశ్లేషకులు.
చంద్రబాబు నాయుడు చేస్తోన్న మ్యాజిక్ చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోక తప్పదు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలకు ఓ వేదికపై కొన్ని తాయెత్తులు ఇచ్చారు. ఇవి మామూలు రాఖీలు కావు తమ్ముళ్లూ..45 రోజుల పాటు దేవుడి దగ్గర పెట్టి పూజించాను. చాలా మహిమ కలిగిన రాఖీలు ఇవి అంటూ తాయెత్తులను రాఖీలుగా వర్ణించారు. తాను ఇచ్చిన రాఖీని ప్రతీ నాయకుడూ భద్రంగా తమ దగ్గర ఉంచుకోవాలన్నారు. ఏ పాటి కష్టం వచ్చినా తనని తలుచుకుంటే చాలు సమస్య తీరేలా తాను భగవంతుడిని కోరతానని చాలా సీరియస్ గా ఎక్కడా నవ్వకుండా చెప్పుకుపోయారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడేంటి.. ఇలా మంత్రించిన తాయెత్తులు ఇవ్వడం ఏంటి .. చంద్రబాబు కాస్తా చంద్ర బాబా గా అవతారం ఎత్తారా ఏంటి? అని టిడిపి శ్రేణులు గుస గుస లాడుకుంటున్నాయి.
మంత్రాలకు చింతకాయలు రాలవు. చింతకాయలే రాలనపుడు ఓట్లు రాలిపడతాయా? ఛస్తే పడవు. మరి మంత్రించిన తాయెత్తులు కట్టుకుంటే టిడిపి నేతలకు ఎన్నికల్లో ఎలా కలిసొస్తుంది? మధ్యలో చంద్రబాబును తలుచుకోవడం ఏంటి? అసలు ఎన్నికల ఏడాదిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి?
ఏ జిల్లాలో ఏయే అభ్యర్ధులను బరిలో దించాలి? పార్టీ పరంగా ఉన్న లోపాలేంటి అన్నవి సమీక్షించుకుని అవసరమైతే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. అవన్నీ పక్కన పెట్టేసి పాతాళ భైరవిలో మాయల ఫకీరులా అదేదో సినిమాలో నేపాలీ మాంత్రికుడిలా ఈ మంత్రించిన తాయెత్తులేంటో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పండితులు. అసలు చంద్రబాబు నాయుడి మైండ్ కి ఏమైనా సమస్య రాలేదు కదా అని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…