రాజకీయాలు అంటేనే ఎవరూ ఊహించని వ్యూహాలు పన్నడం.. అమలు చేయడం. ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేయడం. అయితే ఈ వ్యూహాలు ఎప్పుడూ… అమలు చేసిన వారికే మేలు చేస్తాయని చెప్పలేరు.. ఒక్కో సారి అవే ప్రత్యర్థులకు మేలు చేయవచ్చు. అందుకే…రాజకీయం కత్తి మీద సాము అంటారు. కేసీఆర్ ఇలాంటి రాజకీయాల్లో ఆరితేరిపోయారు. రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నది ఎవరి ఊహకు వారికి వదిలేశారు. కానీ విపక్షాలు మాత్రం కేసీఆర్ … కేవలం ఓటమి భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఫిక్స్ అయిపోయి తదుపరి వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో… వారు చేస్తున్న వ్యూహం.. కేసీఆర్ పై ఒకే అభ్యర్థిని పోటీ పెట్టడం. అదీ కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమకారుడ్ని నిలబెట్టడం. వారి దృష్టిలో ఉన్న నేత కోదండరాం.
తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆయన ఓటమి భయంతో ఉన్నారని విపక్షాలు ఓ అంచనాకు వచ్చాయి. అటు గజ్వేల్‌లో కానీ ఇటు కామారెడ్డిలో కానీ ఓ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీ మాజీ చైర్మన్ కోదండరాం ఈ విషయాన్ని అన్ని పార్టీల ముందు ఉంచారు. కేసీఆర్‌పై ఉమ్మడి అభ్యర్థిని దింపితే బాగుంటుందని గద్దర్ ఆలోచన చేశారన్నారు. ఆ దిశగా విపక్ష పార్టీలు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. ఈ అంశంపై రాజకీయ పార్టీలన్నీ ఓ స్పష్టతకు వచ్చే అవకాశాలు ఉన్నాయని జోరుగా చర్చ జరుగుతోంది.
కేసీఆర్ ను ఓడించడం అంటే.. ఆయన పార్టీని ఓడించడం. అంతే కాదు.. ఇప్పుడు ఆయనను కూడా ఎమ్మెల్యేగా ఓడించాలనే టాస్క్ ను విపక్షాలు తీసుకుంటున్నాయి. దీనికి కారణం కేసీఆర్ రెండు చోట్ల పోటీనే. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోలేదు. అంటే.. తెలంగాణలోని ఏ ఒక్క పార్టీ కూడా ఆయనకు మద్దతుగా లేదు. అన్ని పార్టీలూ వ్యతిరేకమే. కేసీఆర్ ను ఓడించాలన్న లక్ష్యంతో అన్ని పార్టీలూ ఉన్నాయి. ఆయన పార్టీని ఓడించడానికి అందరూ ఏకమయ్యే అవకాశాలు లేవు. కనీసం ఎమ్మెల్యేగా ఆయనను ఓడించడానికి అయినా ఏకమవ్వాలన్న ఆలోచనకు వస్తున్నాయి. అంటే.. అందరూ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెట్టడం. అందరి టార్గెట్ ఒకటే అయినప్పుడు ఇలాంటి నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ. అదంతా తేలికని మాత్రం ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే రాజకీయమంటే ఎన్నో సమీకరణాల సమాహారం.
తెలంగాణ విపక్షాల్లో కాంగ్రెస్, బీజేపీలు కూడా ఉన్నాయి. రెండూ కలిపి ఒకే అభ్యర్థిని నిలబెట్టడం లేదా ఒకే అభ్యర్థికి మద్దతివ్వడం అన్నది అసాధ్యం. అదే సమయంలో ఓ పార్టీ తరపున నిలబెట్టిన అభ్యర్థికి మరో పార్టీ మద్దతు ఇవ్వడం కూడా ఊహించలేము. ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఉమ్మడి అభ్యర్థి సాధ్యం కాదని ఎక్కువ మంది అనుకుంటారు. కానీ అసలు ఏ పార్టీ లేకుండా .. గుర్తు లేకుండా తెలంగాణ పట్ల నిబద్దత ఉన్న నేతను ఇండిపెండెంట్ గా నిలబట్టి అందరూ మద్దతు ఇస్తే తటస్తులు కూడా .. ఓట్లు వేస్తారన్న విశ్లేషణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి. ఇది కాస్త ఆచరణ సాధ్యంగానే ఉంది. అంటే కేసీఆర్‌కు వ్యతిరేకంగా నిలబెట్టబోయే అభ్యర్థిపై ఎలాంటి పార్టీముద్ర లేకుండా… ఉద్యమ నేపధ్యం ఉంటే సరిపోతుంది. అలాంటి నేపధ్యం గల అభ్యర్థిగా అన్ని పార్టీల ముందు కోదండరాం ఉన్నారు. ఆయన కూడా ఉమ్మడి అభ్యర్థి ఆలోచనను పంచుకున్నారు. అంటే ఆయన కూడా రెడీ అన్నమాట.
కేసీఆర్‌కు పోటీగా కోదండరాం అంటే… పెద్దగా ఎఫెక్ట్ రాకపోవచ్చు..కానీ కోదండరాం ఒక్కటే అంటే… మాత్రం కాస్త రీసౌండ్ వస్తుంది. అందరి దృష్టి ఆ పోటీపై ఉంటుంది. ఓటర్లు కూడా కేసీఆరా.. కోదండరామా అన్నది తేల్చుకునే చాయిస్ లభిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర సాధన పూర్తిగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం ద్వారా జరిగింది. ఈ జేఏసీ వెనుక కేసీఆర్ కీలకశక్తి కానీ తెర ముందు ఉండి నడిపించింది మాత్రం ప్రొఫెసర్ కోదండరాం. మిలియన్ మార్చ్ నుంచి సకల జనుల సమ్మె వరకూ కోదండరాం పాత్రను ఎవరూ కాదనలేరు. ఆయన పిల్లర్ లాంటి వారు. కారణాలు ఏవైతేనేం… ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ కు దూరమయ్యారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. కానీ అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు ఎందరో కీలక పదవుల్లో ఉన్నారని.. కోదండరాంకు ఏం తక్కువన్న సానుభూతి ఉద్యమకారుల్లో , ప్రజల్లో ఉంది. అదే సమయంలో కేసీఆర్ ఎన్ని పదవులు ఆఫర్ ఇచ్చినప్పటికీ తిరస్కరించి పోరాట పంధా ఎంచుకున్నారన్న మంచి పేరు ఉంది. దీంతో ఆయనే కేసీఆర్‌కు సరైన ఉమ్మడి ప్రత్యర్థి అవుతారన్న అంచనాలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
కోదండరాం… రాజకీయ పార్టీ పెట్టారు కానీ ఎప్పుడూ పదవుల కోసం ఆశపడలేదు. పదవుల కోసమే అయితే ఆయన ఎప్పుడో కేసీఆర్ పంచన చేరి ఉండేవారు. కానీ కేసీఆర్ కు వ్యతిరేకంగానే పోరాడుతున్నారు. కేసీఆర్ పంచన చేసిన ఉద్యమకారులంతా.. తమ గుర్తింపును కోల్పోయారు. కానీ కోదండరాం మాత్రం.. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన వారిలో ఇంకా గౌరవాన్ని పొందుతూనే ఉన్నారు. అందుకే కోదండరాం ఇప్పుడు కేసీఆర్ కు ప్రత్యర్థి అంటే… ఖచ్చితంగా టఫ్ ఫైట్ అన్న అభిప్రాయం వస్తుంది. ఉమ్మడి అభ్యర్థి ఆలోచన కూడా కోదండరాంలో ఉంది కాబట్టి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే. కానీ.. ఒక్కో పార్టీ వచ్చి అడిగితే కోదండరాం అంగీకరించకపోవచ్చు ..కానీ కాంగ్రెస్ , బీజేపీ సహా అన్ని పార్టీలు కలిసి వచ్చి .. పోటీ చేయమని అడిగితే మాత్రం ఆయన అంగీకరించవచ్చు. కానీ రెండు జాతీయ పార్టీలు ఒకే ఒరలో ఇమడవు. అది దాదాపుగా అసాధ్యం. ఈ సమస్యను మాత్రం పరిష్కరించుకోవాలి.
ఇక్కడ కోదండరాంను ఒకే ఒక అభ్యర్థిగా అన్నిపార్టీలు కలిసి అంగీకరించడానికి ఒకే ఒక్క దారి ఉంది. కోదండరాం అభ్యర్థిత్వం విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకడదు. ఆయన ఒక్కరే నామినేషన్ వేయాలి. బహిరంగంగా ఏ పార్టీ మద్దతు ప్రకటించకూడదు. పార్టీల ముద్ర లేదు కాబట్టి.. తాము కేసీఆర్ పై పోటీ పెట్టడం లేదని.. తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన కోదండరాం లాంటి వారు అసెంబ్లీకి రావాల్సి ఉంది కాబట్టి.. ఎవరూ పోటీ పెట్టడం లేదని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కేవలం కోదండరామే ప్రచారం చేసుకోవాలి. ఏ పార్టీ జెండాలు ఆయన వాడకూడదు. ఆయన సొంత బలగంతోనే ప్రచారం చేసుకోవాలి. అంటే.. కోదండరాం నిలబడతారు కానీ ఎవరూ బరిలో ఉండరు కేసీఆర్ తప్ప. ఆయనపై పార్టీ ముద్రలు ఉండవు. ఏ పార్టీలు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం రాదు. అప్పుడే ప్రజలు కేసీఆర్ లేదా కోదండరాం అనే ఆప్షన్ కు వస్తారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఎవరు ఎవరివైపో అంచనా వేయడం కష్గంగా ఉంది. అందకే ఈ ప్రతిపాదన ఎంత మేర ముందుకు వెళ్తుందన్నది అంచనా వేయడం కష్టమే. అయితే అసాధ్యమేమీ కాదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…