తెలుగు మహిళకు బారెడు కష్టం

By KTV Telugu On 28 August, 2023
image

KTV TELUGU :-

నాయకులకు పార్టీలో వ్యతిరేకులు ఉండటం సహజం. కాని పచ్చ పార్టీలో ఓ మహిళా నేతకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామనే రేంజ్‌లో ప్రత్యర్థులు తయారయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆ మహిళా నేత పార్టీలో తనను వ్యతిరేకించేవారికి చుక్కలు చూపించారు. కేసులు పెట్టి వేధించారు. ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ మహిళా నేతకు సీటిస్తే మేమే ఓడిస్తామని పార్టీ నాయకత్వానికి వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇంతకీ ఆ మహిళా నేత ఎవరో చూద్దాం.

తెలుగు మహిళకు బారెడు కష్టం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సొంత నియోజకవర్గంలో అసమ్మతి సెగ గట్టిగా తగులుతోంది. అనితను వ్యతిరేకించే నేతలంతా  పాయకరావుపేటలో సమావేశం అయ్యారు. అనిత కారణంగానే పాయకరావుపేటలో టిడిపి బ్రష్టుపట్టిందని వారు మండి పడుతున్నారు. నియోజకవర్గంలో టీడీపీ ఆరు గ్రూపులుగా తయారయ్యిందంటే దానికి కారణం అనితనేనని నిప్పులు చెరుగుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు అనిత అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు. పెన్షన్ మంజూరు చేసేందుకు 5 వేల రూపాయలు తీసుకునే వారిని, ప్రభుత్వం ఇచ్చే ఇంటికి 30 వేలు వసూలు చేసేవారని ఆరోపించారు. చివరికి జెడ్పిటిసి కో ఆప్షన్ పదవిని కూడా అమ్ముకున్న చరిత్ర అనితకు ఉందన్నారు.

వచ్చే ఎన్నికల్లో అనితకు సీటు ఇస్తే ఓడించి తీరుతామని టిడిపి అధిష్టానాన్ని హెచ్చరించారు. అనిత ఎమ్మెల్యేగా ఉన్నపుడు నాలుగు మండలాల్లో నలుగురు అనుచరులను పెట్టుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని అంటున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి తామంతా పార్టీలో ఉన్నామని.. అనితను పాయకరావుపేట నియోజకవర్గానికి పరిచయం చేసి ఎమ్మెల్యేని చేసింది తామేనని ప్రస్తుతం ఆమెను వ్యతిరేకిస్తున్న నేతలు చెబుతున్నారు. నియోజక వర్గంలో పార్టీని నాశనం చేసిన అనిత అధికారంలోకి వచ్చిన తరువాత తమపైనే తప్పుడు కేసులు బనాయించిందన్నారు. అనిత అవినీతికి అడ్డం పడుతున్నామని తమను పార్టీ నుండి సస్పెండ్ చేయించిందన్నారు. మాజీ ఎమ్మెల్యేకు మరో సారి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

నేతలు వ్యతిరేకిస్తున్నారు

అనితను నియోజకవర్గంలో వ్యతిరేకించేది ఒక టిడిపి  నాయకులే కాదు, జనసేన పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తమ మద్దతుతోనే అనిత ఎమ్మెల్యేగా గెలిచిందని జనసేన నేతలు అంటున్నారు. కాని ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తమపై రేప్ కేసులు, అవినీతి కేసులు బనాయించిందని ఆరోపిస్తున్నారు. ఈ సారి పాయకరావుపేట స్థానాన్ని టిడిపి, జనసేన పొత్తులో భాగంగా జనసేనకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ జనసేనకు కాదని అనితకు సీటు ఇచ్చినట్లయితే ఓడించి తీరుతామని టిడిపికి సవాల్ విసురుతున్నారు.

అనితపై నియోజకవర్గంలో నాయకులు తిరుగుబాటు చేయడం ఇదే మొదటిసారి కాదు…గతంలో కూడా అనేకసార్లు తమ అసమ్మతి గళాన్ని వినిపించారు.

కొవ్వూరు నుంచి ఓడిపోయారు

అనిత ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ప్రతి గ్రామంలోనూ ఆమెకు వ్యతిరేకంగా టిడిపి నాయకులు ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబును కలిసి 2019లో పాయకరావుపేట సీటు ఇవ్వద్దంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో గత ఎన్నికల్లో అనితను కొవ్వూరు నుంచి పోటీ చేయించగా ఓడిపోయారు. తర్వాత మళ్లీ ఆమెను పాయకరావుపేట నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. అప్పటి నుంచి అనితకు వ్యతిరేకంగా టీడీపీలో అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో అయినా  ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని  పట్టుదలగా ఉన్న అనితకు సొంత పార్టీ నేతల నుండే తలనొప్పులు రావడంతో ఏం చేయాలో పాలుపోక తల పట్టుకుంటున్నారు. ఇటు టిడిపితో పాటు అటు జనసేన కూడా తనపై కక్షగట్టేసినట్లు వ్యవహరిస్తోందని లోలోన కుత కుత లాడిపోతున్నారు అనిత. ఒక వేళ  పాయకరావు పేట నియోజక వర్గం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తే మరో నియోజక వర్గంపై కర్చీఫ్ వేయాలని ఆమె  ఆలోచిస్తున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి