ముహూర్తం కుదిరింది

By KTV Telugu On 28 August, 2023
image

KTV TELUGU :-

2018లో జనవరి 17న ప్రమాణ స్వీకారం చేసిన

తెలంగాణాలో ఎన్నికల నగారాకు ముహూర్తం ఫిక్స్ అయిపోయిందా? అక్టోబరు నెలలోనే  ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని  అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డిసెంబరు రెండో వారం లోపు తెలంగాణాలో కొత్త ప్రభుత్వం కొలువు తీరేలా ఎన్నికల తేదీలు ఉంటాయని అంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి   సాధ్యాసాధ్యాలు..ఇతరత్రా పరిస్థితులను  పరిశీలించేందుకు  కేంద్ర ఎన్నికల సంఘం బృందం తెలంగాణా రానుంది. ఒకే దఫాలో తెలంగాణాకు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

తెలంగాణాతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఒకేసారి నగారా మోగుతుందని భావిస్తున్నారు. 2018 లో తెలంగాణా ఎన్నికలకు అక్టోబరు ఆరు న నగారా మోగింది. డిసెంబరు ఏడో తేదీన ఒకే విడతలో పోలింగ్ జరిగింది. డిసెంబరు 11న ఫలితాలు వెలువడ్డాయి. అయితే మంచి ముహూర్తం దొరకలేదనో ఎందుకో కానీ ఎమ్మెల్యేలంతా జనవరి 17న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అంటే నెల రోజులకు పైనే అందుకోసం నిరీక్షించారు. ఆ లెక్కన  వచ్చే 2024 జనవరి 16 లోపు ఎప్పుడైనా తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు కావలసి ఉంది.

అధికార వర్గాల  ప్రచారానికి అనుగుణంగానే  తెలంగాణా కాంగ్రెస్ మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా  అక్టోబరులోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని జోస్యం చెప్పారు. తన దగ్గర ఉన్న సమాచారం మేరకు  నవంబరు 30న తెలంగాణా ఎన్నికలు జరుగుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ సాక్షిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  కనీసంలో కనీసం 70 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఈ ఏడాది చివర్లో జరగనున్న అయిదురాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం తరపున ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తో నాయకత్వంలో ముగ్గురు సభ్యుల బృందం అక్టోబరు మొదటి వారంలో తెలంగాణా పర్యటించనుందని అంటున్నారు. ఈ బృందం ఎన్నికల సన్నద్ధతపై అధ్యయనం చేసి ఓ నివేదిక రూపొందిస్తారు. దానికి అనుగుణంగా ఎన్నికల నగారాకు రంగం సిద్ధం చేస్తారు. అక్టోబరు రెండో వారం లోపు  ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్నది ఎన్నికల సంఘం ఆలోచనగా చెబుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుండి  ఇప్పటికే ఓ బృందం తెలంగాణా పర్యటించి వెళ్లింది.

ఎన్నికల నగారా గురించి ముందుగానే ఊహించారో ఏమో కానీ గులాబీ బాస్ కేసీయార్ అందరికన్నా ముందుగానే  115 మంది సభ్యులతో తొలిజాబితా ప్రకటించి  విపక్షాలకు చెక్ చెప్పారు. అయితే కేసీయార్ ప్రకటించిన జాబితాలో సగానికి పైగా అభ్యర్ధులకు టికెట్లే ఇవ్వరని బిజెపి నేతలు అంటున్నారు. తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్  మీడియాతో మాట్లాడుతూ జాబితాలో ఒకరి పేరు ప్రకటించి మరో అభ్యర్ధిని కేసీయార్ తన వద్దకు పిలిపించుకుని చర్చిస్తున్నారని అన్నారు. ముందుగా ప్రకటించిన జాబితాలో చాలా మందికి చివరి నిముషంలో టికెట్లు ఇచ్చే పరిస్థితి ఉండదని ఇలా మోసం చేయడం కేసీయార్ కు కొత్త కాదని సంజయ్ ఆరోపిస్తున్నారు.

బి.ఆర్.ఎస్. నాయకత్వం అభ్యర్ధుల జాబితాను ప్రకటించేస్తే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్ధులు  టికెట్ కోసం దరఖాస్తులు పెట్టుకోడానికి గాంధీ భవన్ కు వెల్లువెత్తారు. ఆగస్టు 25న  దరఖాస్తులు చేసుకోడానికి చివరి రోజు కావడంతో పార్టీలోని కీలక నేతలతో పాటు యువ నేతలు కూడా గాంధీభవన్ కు తరలి వచ్చారు. తమ తమ నియోజక వర్గాల్లో టికెట్ల కోసం దరఖాస్తులు సమర్పించుకున్నారు. బి.ఆర్.ఎస్. , కాంగ్రెస్  పార్టీల్లో టికెట్ రాని అసంతృప్తులను  చేరదీసి   అభ్యర్ధుల జాబితాను తయారు చేయాలని బిజెపి భావిస్తోంది. అయితే తన తొలి జాబితాను సెప్టెంబరు మొదటి వారంలోనే విడుదల చేయాలని బిజెపి నాయకత్వం డిసైడ్ అయ్యిందంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి