తాయిలాలతో దారికి తెస్తున్నారు

By KTV Telugu On 29 August, 2023
image

KTV TELUGU :-

కొట్టడానికైనా పెట్టడానికైనా కేసీయార్ కేసీయారే. కొద్ది రోజుల క్రితం ఎన్నికల కోసం 115 మంది అభ్యర్ధులతో తొలి జాబితా ప్రకటించిన కేసీయార్ కొంతమంది ఆశావహుల  ఆశలపై నీళ్లు కుమ్మరించారు. జాబితాలో తమ పేర్లు లేవని కొందరు  అసంతృప్తితో  రగిలిపోయారు. మాకే టికెట్లు ఇవ్వరా? అని కుత కుత లాడిపోయారు. ఇక మా సత్తా చూపిస్తాం అని లోలోనే కసిగా అనుకున్నారు. అయితే ఈ కోపాలు తాపాలు అన్నీ మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయేలా ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే అసంతృప్తి నేతల ఆగ్రహాన్ని  మొదట్లో  కొట్టి పారేసిన కేసీయార్ ఇపుడు ఏ ఒక్కరినీ వదులుకోకూడదన్న వ్యూహానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది.

సిటింగ్ ఎమ్మెల్యేల్లో 9 మందిని పక్కన పెట్టారు కేసీయార్. వాళ్లల్లో సీనియర్ నేత వేములవాడ ఎమ్మెల్యే  చెన్నమనేని రమేష్, ఘన్ పూర్ ఎమ్మెల్యే  రాజయ్య, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఉన్నారు. సిటింగులు కాకపోయినా సీనియర్లు అయి ఉండి టికెట్ రాని వారిలో బాగా సీనియర్ అయిన తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఇక తనకు టికెట్ వచ్చినా తన కొడుక్కి మెదక్ సీటు ఇవ్వలేదని మరో సీనియర్ మైనంపల్లి హనుమంతరావు మంట మీద ఉన్నారు. ఖానాపూర్ లో మహిళా ఎమ్మెల్యే రేఖానాయక్ కూడా నిప్పులు చెరిగేస్తున్నారు.

అసలే టికెట్ రాక  కుమిలిపోతోన్న   నేతలకు కేసీయార్ మాటలు మరింత  క్షోభ పెట్టాయి. ఇక బి.ఆర్.ఎస్. లో ఉంటే భవిష్యత్తు ఉండదని కొందరు భావించారు. తమ అనుచరులతో సమావేశమై వారి అభిప్రాయాలను  అడిగి తెలుసుకున్నారు. వీరిలో ఖమ్మం జిల్లా పాలేరుకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు అయితే మీరు తక్షణమే  కాంగ్రెస్ లో చేరిపోవాలని సూచించారు. అటు చెన్నమనేని రమేష్  మిత్రులు శ్రేయోభిలాషులు బిజెపిలోకి వెళ్తే బెటరేమో అని సలహా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చాయో లేదో కేసీయార్ తనకే సాధ్యమైన శైలిలో గేర్ మార్చారు.

ఎమ్మెల్యే టికెట్ రాకపోయినంత మాత్రాన రాజకీయంగా అంతా అయిపోయినట్లేనా? అని అసంతృప్త నేతలను  బుజ్జగించిన కేసీయార్  ప్రతీ నేత దగ్గరకూ తన దూతలను రాయబారానికి పంపారు. రక రకాల పదవుల ఆఫర్లు ఇచ్చారు. దూతల రాయబారాలతో కొందరు నేతలు  కోపం తగ్గించుకున్నారు . అసంతృప్తిని  తీసి జేబులో పెట్టేసుకున్నారు. బి.ఆర్.ఎస్.తోనే ఉంటే పోలా అనుకున్నారు. అలా అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా తన వైపు లాక్కుంటున్నారు కేసీయార్. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కామ్ అయిపోయారు. ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య అయితే కంటతడి పెట్టారు.కానీ ఆ తర్వాత కేసీయార్ గీసిన గీత దాటేదే లేదని  స్పష్టం చేశారు.

సరిగ్గా ఈ తరుణంలోనే  కేసీయార్ తిరుగులేని మంత్రంతో చెన్నమనేని రమేష్ మనసు గెలుచుకున్నారు. చెన్నమనేనికి ప్రభుత్వంలో కేబినెట్ హోదా ఉండే పదవిని  ఇచ్చారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా  చెన్నమనేనిని నియమించాలని డిసైడ్ అయిపోయారు. ఈ పదవిలో చెన్నమనేని అయిదేళ్ల పాటు ఉంటారు. వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత చదువులు చదివిన చెన్నమనేనికి ఈ పదవి కూడా బాగా  నచ్చిందని అంటున్నారు. ఇక మొదట్లో హరీష్ రావుపై  నోటికొచ్చినట్లు  దూకుడుగా విమర్శలు చేసిన మైనంపల్లి హనుమంతరావు కూడా తాజాగా తగ్గారు. పార్టీ తనని ఏమీ అనలేదని.. తాను కూడా పార్టీని ఏమీ అనలేదని మైనంపల్లి హనుమంతరావు కొత్త రాగం అందుకున్నారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అయితే భర్తతో కలిసి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇద్దరూ కూడా  ఖానాపూర్ టికెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే రేఖానాయక్ పార్టీని వీడినా తమకి నష్టం లేదన్న భావనలో కేసీయార్ ఉన్నారని అంటున్నారు.
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూడా పార్టీ మళ్లీ అధికారంలోకి రాగానే  కీలక పదవి ఇస్తామని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే  ఉన్న అసంతృప్తే తక్కువ అనుకుంటే అది కూడా సమసిపోయేలా చేసుకున్నారు మాస్టర్ మైండ్ కేసీయార్.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి