తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎందుకు హాట్ టాపిక్ గా మారింది. ఆ ముగ్గురికి కేసీఆర్ ఎందుకు టికెట్లు నిరాకరించారు. సీఎం చేయించిన సర్వేల్లో ఆదిలాబాద్ కహానీ ఏమిటి.. మరి టికెట్ దక్కని వారు ఊరుకుంటారా. వారి ఆలోచన ఎలా ఉంది. ఓ సారి చూద్దాం…
గులాబీ దళపతి ప్రకటించిన 115 సీట్లలో ఉమ్మడి ఆదిలాబాద్ కు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. టికెట్లు దక్కని ఏడుగురు సిట్టింగుల్లో ముగ్గురు ఆదిలాబాద్ జిల్లా వారే కావడం చర్చనీయాంశమవుతోంది. ఒకరు తిరుగుబాటు చేయగా మిగతా ఇద్దరూ ఏం చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. ఆదిలాబాద్ టికెట్ల గేమ్ లో కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడైన ఓ ఎమ్మెల్యే కిలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచి.. అందులో టికెట్లు రాని తాజా మాజీలు కూడా భాగస్వాములైతే ఏం చేయాలన్నదే పెద్ద ప్రశ్న
నిజానికి టికెట్లు దక్కని ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆలోచనలో పడిపోయారు. ఇప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఎదురుతిరిగారు. ఆమె భర్త కాంగ్రెస్లో చేరిపోగా, రేఖా నాయక్ మాత్రం టికెట్ హామీ కోసం ఎదురు చూస్తున్నారు. .ఎంపీ టికెట్ హామీతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చల్ల బడ్డా, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావుతోపాటు బోథ్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ నగేష్ పార్టీ మారతారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ముగ్గురు సిట్టింగ్ లను మార్చడం వెనుక బీఆర్ఎస్ భారీ కసరత్తు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పై మెజారిటీ క్యాడర్ లో వ్యతిరేకత కు తోడు అవినీతి ఆరోపణలను పరిగణలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. అన్ని సర్వేల్లోనూ రేఖా నాయక్ వెనుకబడి ఉండటం, పైగా కేటీఆర్ స్నేహితుడు జాన్సన్ నాయక్ కు టికెట్ ఇవ్వాల్సి రావడం కూడాఆమెకు శాపంగా మారింది. రేఖా నాయక్ కూడా అదే మాట చెబుతున్నారు. కేటీఆర్ స్నేహితుడి కోసం తనను బలిపశువును చేశారని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే ఆమె కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె భర్త అసీఫాబాద్ టికెట్ కోసం కాంగ్రెస్ లో కర్చీఫ్, టవల్ అన్నీ వేశారు.
టికెట్ కోసం వేచి చూసి రాథోడ్ బాపు రావు తీవ్ర నిరాశలోకి మునిగిపోయారు. వరుసగా రెండు సార్లు గెలిచిన తనకు టికెట్ ఎలా ఆపుతారని బాపు రావు ప్రశ్నించారు. ఆయనకు టికెట్ రాకపోవడానికి అవినీతి ఆరోపణలే కారణమని చెబుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా ప్రగతి భవన్ కు రిపోర్టులు వెళ్లడంతో చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. దళిత బంధులో అవినీతిని సహించేది లేదని సీఎం కేసీఆర్ హెచ్చరించిన వారిలో బాపు రావు కూడా ఉన్నారన్నది ఆదిలాబాద్ జిల్లాలో వినిపిస్తున్న మాట. సర్వేలో బాపు రావుకు మంచి మార్కులే వచ్చినా.. అవినీతి ఆరోపణల వల్ల టికెట్ ఆపేశారని పార్టీలో వినిపిస్తున్న టాక్. ఇక సర్వేల్లోనే వెనుకబడినందుకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఎర్రజెండా చూపించారని చెబుతున్నారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సక్కు ఆ తర్వాత కొద్ది రోజులకే గులాబీ కండువా కప్పుకున్నారు. 2023 ఎన్నికల్లోనూ టిక్కెట్ ఇస్తామనే షరతుపైనే ఆయన గులాబీ గూటికి చేరారు. ఇప్పుడు మాత్రం కేసీఆర్ స్వయంగా సక్కును బుజ్జగించి.. కోవ లక్ష్మికి టికెట్ కన్ఫార్మ చేశారు. ఆదిలాబాద్ లోక్ సభా స్థానాన్ని ఆయనకు కేటాయిస్తామని హామి ఇవ్వడంతో ప్రస్తుతానికి సక్కు చల్లబడినట్లు చెబుతున్నారు.
బీఆర్ఎస్ లో విభేదాలను క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు సిద్ధంగా ఉన్నాయి. ప్రజాదరణ ఉండి, కాస్త డబ్బులు ఖర్చుపెట్టుకోగలిగిన బీఆర్ఎస్ వారికి టికెట్లు సర్దుబాటు చేసేందుకు టీపీసీసీ సిద్ధంగా ఉంది. వారిలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా టచ్ లో ఉన్నారు. బీజేపీ కూడా కొత్తవారి కోసం ఆవురావురు మంటూ ఎదురు చూస్తోంది. నియోజకవర్గాల వారీగా కమలం పార్టీ లెక్కలు తీస్తుంది. పోలింగ్ బూత్ స్తాయి నేతలను సంప్రదించి బీఆర్ఎస్ వారి బలాబలాలు బేరీజు వేస్తోంది. అందుకే అధికార పార్టీలో టికెట్ దక్కని వాళ్లు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఎన్నికల్లో గెలవడమొక్కటే వారికి సమస్య. ఎన్నికల పరీక్షలో వాళ్లు గట్టెక్కితే ఇక తిరుగుండదనే భావిస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…