కామారెడ్డికి నిజామాబాద్ కి లింకేంటి ?

By KTV Telugu On 29 August, 2023
image

KTV TELUGU :-

కేసీఆర్ పెద్ద ప్లానే వేశారా. అందుకే రెండో నియోజకవర్గంగా కామారెడ్డిని ఎంపిక చేసుకున్నారు. చుట్టాలు, పక్కాలు, స్నేహితులు, పార్టీ వారు అందరూ కలిసొచ్చి తనకు తన కుటుంబానికి మేలు చేసే ప్రాంతాన్నే ఎంచుకున్నారు. పక్క జిల్లాపైనా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు.

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ పని చేసినా లాంగ్ టర్న్ ఫ్యూచర్ ప్లాన్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కామెరెడ్డిలో పోటీ కూడా అలాంటిదేనని వివరించాల్సిన పని లేదు. ఆయన గజ్వేల్ లో ఓడిపోతానన్న భయంతో కామారెడ్డిలోనూ నామినేషన్ వేయబోతున్నారని చెప్పలేము. కాకపోతే పార్టీని, కుటుంబాన్ని, సానుభూతిపరులను ఒక గ్రూపింగ్ చేసి కూతురు కవితకు ప్రయోజనం కలిగించే ప్రణాళికతోనే కామారెడ్డి ఓటర్లను పావుగా వాడుకుంటున్నారని చెప్పాలి..

డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కేసీఆర్ మాత్రం అప్పుడే అభ్యర్థులను ప్రకటించేశారు. ఏకంగా 115 నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితా రాగా, అందులో తాను రెండో నియోజకవర్గంగా కామారెడ్డి నుంచి పోటీ చేయడం ఓ హైలైట్. గతంలో ఆయన ఎప్పుడూ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీ చేయలేదు.అందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. కూతురు కవిత కోసమే ఆయన ఈ పని చేశారన్న చర్చ జరుగుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో కవిత ఓడిపోయినప్పటి నుంచి కల్వకుంట్ల కుటుంబంలో కసి పెరిగింది. అదే ఇప్పుడు కామారెడ్డికి కేసీఆర్ ను తీసుకెళ్లిందని చెప్పాలి. పైగా కామారెడ్డితో తెలంగాణ సీఎంకు విడదీయరాని సంబంధం ఉంది.

కామారెడ్డితో రాజకీయ అనుబంధం కన్నా పేగుబంధమే ఎక్కువ కేసీఆర్‌ తల్లి వెంకటమ్మ ఈ ప్రాంతానికి చెందినవారే. బీబీపేట మండలం కోనాపూర్‌ వెంకటమ్మ సొంతఊరు. కేసీఆర్‌ తండ్రి రాఘవరావు అక్కడికి ఇల్లరికం వచ్చారట. వాస్తవానికి రాఘవరావుది సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామం. పెళ్ళయ్యాక కోనాపూర్ ఇల్లరికం రావడంతో ఆయన కూడా ఈ ప్రాంత వాసిగా మారిపోయారు. అయితే, కోనాపూర్ సమీపంలో అప్పర్ మానేర్ డ్యామ్ నిర్మాణం కారణంగా ఇక్కడి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో కేసీఆర్ ఫ్యామిలీ అక్కడి నుంచి సిద్ధిపేట జిల్లాలోని చింతమడకకు వలస వెళ్లింది. కేసీఆర్ ముగ్గురు అక్కలు కామారెడ్డిలోనే నివాసం ఉండేవారు. ప్రస్తుతం వారి పిల్లలు ఇక్కడ నివసిస్తున్నారు. తాము ఈ ప్రాంతానికి చెందిన వారమేనని చెప్పుకోవడానికి కేసీఆర్ తనయుడు కేటీఆర్ చాలాసార్లు ఈ ప్రాంతంలో పర్యటించారు.కేటీఆర్ తమ నానమ్మ గ్రామమైన కోనాపూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సొంత నిధులతో పాఠశాల భవనం నిర్మించారు. రోడ్లు, డ్రైనేజీలు వేయించారు. అప్పుడు కూడా తాము కామారెడ్డి ప్రాంతానికి చెందిన వారమని చెప్పుకున్నారు. అప్పటి నుంచే కామారెడ్డిపై వారికి ఒక ప్లాన్ ఉందని అనుకోవాలి…

కామారెడ్డి సమీపంలోని మెదక్, దుబ్బాక నియోజకవర్గాలతోపాటు నిజామాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో గులాబీ పార్టీ వాడటం ఖాయం చేసుకోవాల్సిందేనని సర్వేలు ఘోషించాయట.ఆ పరిస్థితి నుంచి బయట పడేందుకు కూడా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇక కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంది. కాకపోతే అది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాంతమని మరిచిపోకూడదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు నిజామాబాద్, అటు జహీరాబాద్ స్థానాలపై పట్టు సాధించే ప్లాన్ లో భాగంగానే కామారెడ్డిని కేసీఆర్‌ ఎంచుకున్నారని చెబుతున్నారు. ఇక ఎలాగూ కామారెడ్డి మహారాష్ట్రకు దగ్గరగా ఉన్నందున అటు వెళ్లేందుకు ఉపయోగంగా ఉంటుందని కేసీఆర్ ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో కేసీఆర్ కు ధర్మపురి అరవింద్ పై కసి తీర్చుకోవాల్సిన అనివార్యత ఉంది, తానే కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే వస్తూ పోతూ జనాన్ని ఆకట్టుకునే వీలు కూడా ఉంటుందని, లోక్ సభ ఎన్నికల్లో దగ్గరుండి కవితను గెలిపించుకోవచ్చని కేసీఆర్ లెక్కగడుతున్నారు.

బీజేపీని ఓడించడం కంటే అర్విందును, ఆయన కుటుంబాన్ని దెబ్బకొట్టడం కేసీఆర్ సారుకు చాలా అవసరం. అర్వింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ను పిలిచి పార్టీలో అందలమెక్కిస్తే తర్వాత ఆయన అవమానకరంగా ప్రవర్తించారన్న కోపం కేసీఆర్ లో ఉంది. పైగా అర్వింద్ ఐనదానికి కానిదానికి బూతులు అందుకంటున్నారు. అది కూడా కేసీఆర్ కు అసలు నచ్చడం లేదు. అందుకే ఆయన కామారెడ్డిలో కాలు పెట్టాలని డిసైడయ్యారు. అయితే రెండు చోట్ల గెలిచిన తర్వాత ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటారన్నది పెద్ద ప్రశ్నే అవుతుంది. రెండు స్థానాల్లో గెలిచిన వాళ్లు ఆరు నెలల లోపు ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడు నాలుగు నెలలకే లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. దానితో అప్పటి వరకు ఆగి.. ఎన్నికల లబ్ధి పొందిన తర్వాత కామారెడ్డికి కేసీఆర్ రాజీనామా చేసినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన కేసీఆర్…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి