– బీజేపీ కంప్లయింట్ చేస్తే చాలు ఏ పోస్ట్ అయినా డెలీట్!
– కమలం కన్నెర్ర చేస్తే ఇన్స్టాకి తడిసిపోతోందంతే!
మైకులు పట్టుకుని వీధివీధికి తిరిగే రోజులు పోయాయి. ఇంటింటికీ వెళ్లి దండాలు పెట్టే కాలం అస్సలే కాదు. ఇప్పుడంతా సోషల్‌మీడియా యుగం. నెగిటివ్ క్యాంపైన్ అయినా, మనల్ని మనం ఆకాశానికి ఎత్తుకోవాలన్నా సోషల్‌మీడియానే ఈ కాలపు రాజకీయాలకు కీలక ప్లాట్‌ఫామ్. ఈ విషయంలో బీజేపీ మిగిలిన పార్టీలకంటే నాలుగు పీహెచ్‌డీలు ఎక్కువే చేసింది. అందుకే కోట్లమందిని ప్రభావితం చేసే సోషల్‌మీడియాలపై కమలదళం పట్టు బిగిస్తోంది.
ఇప్పుడు జరుగుతున్న ప్రచారమే నిజమైతే భవిష్యత్తులో ఇన్‌స్టాగ్రామ్‌లో బీజేపీ వ్యతిరేకపోస్టులు కనిపించకపోవచ్చు. ఎవరైనా ఉత్సాహంగా మోడీకో, బీజేపీకో వ్యతిరేకంగా ఏదన్నా పోస్ట్ చేసినా సెకన్లలో అది డెలిట్ కావచ్చు. తమకు వ్యతిరేకంగా ఉన్న పోస్టులపై బీజేపీ ఐటీ సెల్ రిపోర్ట్ చేయడమే ఆలస్యం. ఎలాంటి రివ్యూ లేకుండానే ఏదో ఒక కారణం చూపిస్తూ ఇన్స్టాగ్రామ్ వాటిని రిమూవ్ చేస్తోంది. దీనిమీద ది వైర్ పరిశోధనాత్మక కథనం కలకలంరేపుతోంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గుడికట్టి పూజ చేయడంపై సూపర్హ్యూమన్స్ ఆఫ్ క్రింజ్టోపియా ఖాతాలో ఉన్న పోస్ట్‌ని విచిత్రమైన కారణాలతో ఇన్‌స్టా తొలగించింది. న్యూడిటీ, సెక్సువల్ కంటెంట్ ఉందన్న కారణంచూపినా ఆ పోస్ట్‌లో ఎలాంటి అభ్యంతరకరమైన కంటెంట్ లేదు. వైర్ ప్రతినిధులు దీనిమీద మెటాని సంప్రదిస్తే బీజేపీ ఐటీ సెల్ ఫిర్యాదుతోనే తొలగించామన్న జవాబువచ్చింది. @క్రింజ్ఆర్కివిస్ట్ హ్యాండిల్లో పోస్ట్ అయిన ఏడు మెసేజ్‌లతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న దాదాపు 705 పోస్టులను ఇదే కారణంతో తొలగించారు.
ఏదన్నా పోస్ట్ మీద ఫిర్యాదు వస్తే ఇన్స్టాగ్రామ్ ఇంటర్నల్ రివ్యూ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా, అభ్యంతరకరంగా ఉందనుకుంటే ఖాతాదారుడికి సమాచారమిస్తూ ఆ పోస్ట్‌ని తొలగించాలి. అయితే బీజేపీ ఐటీ వింగ్ ఫిర్యాదుచేసిన ఏ పోస్టుమీద కూడా ఇన్స్టాగ్రామ్ ఎలాంటి సమీక్షా నిర్వహించలేదన్నవిషయం బయటపడింది. కొన్ని రాజకీయపక్షాలకు మేలుచేసేలా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేలా ఇన్‌స్టా చర్యలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. కామెంట్‌కి స్ట్రాంగ్ కౌంటర్ ఉండాలిగానీ అసలా కామెంటే లేకుండా చేయడమంటే భావ స్వేచ్ఛని హరించడం కాదా? అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ పోకడ సరైనదేనా?