తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రెబల్ స్టార్ మైనంపల్లి హన్మంతరావు. సాఫ్ట్ గా కనిపించే ఆ లీర్ వెనుక చాలా మాస్ కోణం వెలుగులోకి వస్తోంది. ఆయన సాదాసీదా వ్యూహంతో రాజకీయ అడుగులు వేయడం లేదని .. మాస్టర్ ప్లాన్ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వారం రోజుల పాటు తన అనుచరులతో మాట్లాడిన తర్వాత అసలు కథ నడిపిస్తానని చెబుతున్నారు. మైనంపల్లిపై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో బీఆర్ఎస్ హైకమాండ్ ఉంది. పొంగులేటిని, జూపల్లిని గెంటేసినంత ఈజీగా మైనంపల్లిపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మైనంపల్లి తన మాటల్ని వెనక్కి తీసుకోకపోయినా .. ఏ క్షణమైనా సస్పెండ్ చేస్తామని బయటకు చెబుతున్నారు కానీ.. మీడియాతో మాట్లాడవద్దని ఓ బీఆర్ఎస్ పెద్ద నేత ఒట్టేయించుకున్నారని మైనంపల్లి చెబుతున్నారు. అంటే మల్కాజిగిరి ఎమ్మెల్యే గట్టి ప్రయత్నంలోనే ఉన్నారని స్పష్టమవుతోంది. అదేమిటన్నది స్పష్టత రావాల్సి ఉంది.
మైనంపల్లి హన్మంతరావు మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఎనిమిదేళ్ల పాటు పని చేశారు. మెదక్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అందరి రాజకీయ నాయకుల్లా కాదు. ఉదారంగా ఉంటారు. రాజకీయంగా భారీ అవినీతికి పాల్పడేంత పెద్ద పెద్ద పదవులేమీ ఆయన అనుభవించలేదు. రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. తెలంగాణ ఉద్యమం అత్యంత ఉద్ధృతంగా ఉన్న సమయంలోనూ ఆయన ఆనాడు తాను ఉన్న టీడీపీ పార్టీని వదిలి పెట్టలేదు. పొత్తులో భాగంగా తన స్థానం గల్లంతు అవుతుందని తెలుసుకున్న తర్వాతనే ఆయన పార్టీ మారాడు. రాజకీయంగా ఆయన నమ్మిన పార్టీ విషయంలో నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరు. అదే సమయంలో ఆయన డైనమిక్. పార్టీ కార్యకర్తలను నిరంతరం అండగా ఉంటారు. అందుకే ఇప్పుడు మైనంపల్లి ఏం చేయబోతున్నారన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టిక్కెట్లు ప్రకటిస్తున్న రోజున మైనంపల్లి హన్మంతరవు తిరుమలలో ఉన్నారు. తన కుమారుడికి మెదక్ సీటు రాదని తేలిన తర్వాత తనకు సీటు ప్రకటిస్తారని స్పష్టత ఉన్నప్పటికీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తర్వాత వెనక్కి తగ్గలేదు. మీడియాతో మాట్లాడవద్దని బీఆర్ఎస్ పెద్దల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఇతర ఆలయాలకు వెళ్లి నాలుగు రోజుల తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చారు. రావడంతో టే అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ఏ పార్టీని విమర్శించలేదు. కానీ తాను తగ్గేది లేదని స్పష్టత నిచ్చారు. అదే సమయంలో తాను బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతానని కూడా చెప్పలేదు. ఇతర పార్టీల్లో చేరుతానని కూడా సంకేతలివ్వలేదు. కానీ పార్టీల మారడం తప్పేమీలేదన్నారు. ఆయన హైదరాబాద్ కు రావడానికి ముందే సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ వైరల్ అయింది. అందులో ఆయన అన్ని పార్టీల నేతల్నీ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డిని కూడా వదిలి పెట్టలేదు. ఉద్దేశపూర్వకంగా ఆ ఆడియోను లీక్ చేశారని ఎవరికైనా అర్థమవుతుంది. కానీ మైనంపల్లి వచ్చే ఎన్నికలకు సంబంధించి.. ఆ తర్వాత కూడా ఓ పక్కా ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయం మాత్రం అందరిలోనూ బలంగా వినిపిస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో చాలా బలమైన నేతల్ని వదలుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులను సస్పెండ్ చేసేశారు. నిజానికి వారు పొటెన్షియల్ లీడర్లు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా రాజకీయాలు చేస్తామని వారు కూడా ఊహించరు. వారు గత ఎన్నికల్లో అతి తక్కువ తేడాతో ఓడిపోయారు. అయినా కేసీఆర్ వారు అవసరం లేదనుకున్నారు. వారిని ఎవరి కోసం వదులుకున్నారో.. వారెవరూ బలమైన నేతలు కాదు. కొల్లాపూర్ లో బీరం హర్షవర్ధన్ రెడ్డి .. జూపల్లికి సరితూగే నేత కాదు. ఖమ్మంలో పొంగులేటి పార్టీ నుంచి వెళ్లిపోయాక.. అక్కడ బీఆర్ఎస్ ను నడిపించే నాయకుడు కనిపించడం లేదు. మంత్రి పువ్వాడ అజయ్ పై ఎవరికీ నమ్మకం లేదు. తుమ్మల కూడా గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. అలాంటిది .. మైనంపల్లి ధిక్కరిస్తున్నా ఎందుకు కేసీఆర్ సైలెంట్ గా ఉంటున్నారన్నది కీలకం. మల్కాజిగిరి ప్రజల్లో మైనంపల్లిది ప్రత్యేకమైన ముద్ర. ఆయన సేవా కార్యక్రమలు ఎక్కువగా బస్తీల ప్రజల్లో అభిమానాన్ని సంపాదించి పెట్టాయి. ఆయన బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోతే.. మైనంపల్లి కన్నా ఎక్కవగా బీఆర్ఎస్ నష్టపోతుంది. ఆయన ఇతర నియోజకవర్గాలపై దృష్టి పెడితే మరింత సమస్య అవుతుంది. అందుకే ఎన్నికల సమయం ఎదురు తిరిగి నేతలందర్నీ వదిలించుకోలేమన్న కారణంగానే కేసీఆర్ వెనక్కి తగ్గారని అనుకోవచ్చు.
అయితే మైనంపల్లి తన అనుచరులతో మాట్లాడిన సమయంలో.. బీఆర్ఎస్‌లోనూ తనను అణగదొక్కారని చెప్పుకొచ్చారు. ఏ వ్యక్తికైనా ఉన్నత స్థానానికి వెళ్లాలని ఉంటుందని చెప్పారు. అంటే.. మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యేగానే ఉండదల్చుకోలేదు. ఆయన పై స్థాయికి వెళ్లాలనుకుంటున్నారు. అంటే మంత్రి పదవి. బీఆర్ఎస్‌లో ఉంటే.. ఆయనకు మంత్రి పదవి అసాధ్యం. ఎందుకంటే కేసీఆర్ ..కేటీఆర్.. హరీష్.. ఎర్రబెల్లి వంటి వారికి ఖచ్చితంగా పదవులు ఇవ్వాల్సిందే. ఆ తర్వాత కూడా మరికొంత మంది నేతలు రేసులో ఉంటారు్. మైనంపల్లి ఆ రేసులో ఎక్కడో ఉంటారు. అందుకే ఆయన ఆలోచించినట్లుగా చెబుతున్నారు.
మైనంపల్లిని ఆకర్షిస్తే అటు పార్టీ బలోపేతం కావడం మాత్రమే కాదు.. బీఆర్ఎస్‌నూ బలహీనపర్చవచ్చని కాంగ్రెస్ నేతలకూ తెలుసు. అందుకే మైనంపల్లితో టచ్‌లోకి వెళ్లారని.. యన కోరుకుంటున్నవన్నీ ఇస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది.
మైనంపల్లి పొటెన్షియల్ లీడర్ భావిస్తున్న కాంగ్రెస్ రెండు టిక్కెట్లు ఆఫర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. శుక్రవారం కాంగ్రెస్ నేతలతో మైనంపల్లి చర్చలు జరిపారని అంటున్నారు. మైనంపల్లికి మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మెదక్ టికెట్ ఆశిస్తున్న తిరుపతిరెడ్డి, శశిధర్‌రెడ్డిలతో కూడా మాట్లాడారని.. మైనంపల్లి కుమారుడు పోటీ చేస్తే సహకరిస్తామని వారితో ఒప్పించినట్లుగా తెలుస్తోంది. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే నందికంటి శ్రీధర్‌ను కూడా బుజ్జగిస్తున్నారు. పార్టీలో చేరిన అసంతృప్తుల బెడద ఉండదని అంటున్నారు. మైనంపల్లి ఆర్థికంగా బలవంతుడైన నేత కావడంతో కాంగ్రెస్ నేతలు మరింతగా ఆసక్తి చూపించి ఆయనను ఆకర్షంచే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో మైనంపల్లి సామజికవర్గ నేతలు .. పెద్దగా లేరు. ఆ సామాజికవర్గం నుంచి ఆయనే కాంగ్రెస్ పార్టీ పెద్ద అయ్యే అవకాశం ఉంది. అంటే.. కీలక నేతగా మారిపోతారు. కాంగ్రెస్ గెలిస్తే మంత్రి పదవి ఖాయంగ వస్తుంది. అంత కంటే మైనంపల్లికి కావాల్సింది ఏముంటంది ?.
ఎన్నికల షెడ్యూల్ రావడానికి ఇంకా నెలన్నర వరకూ సమయం ఉంది. అందుకే మైనంపల్లి ఇటు బీఆర్ఎస్ టిక్కెట్ ను తీసుకుని పోటీ చేస్తానని చెప్పకుండా.. మరో వైపు కుమారుడి రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచిస్తూ కీలక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మైనంపల్లి రోహిత్ ఇప్పటికే మెదక్ నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి అందరికీ దగ్గరయ్యారని.. కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధిస్తారని అంటున్నారు. మొత్తంగా కాంగ్రెస్ రెండు టిక్కెట్ల ఆఫర్ తో రెడీగా ఉంది. ఇక చాయిస్ .. మైనంపల్లిదేనని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో మైనంపల్లి చాలా క్లారిటీగానే ఉన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారు. అది ఎలాంటిదో మైనంపల్లికి బాగా తెలుసని.. ఆయన ఆషామాషీగా ఈ రాజకీయం చేయడం లేదని చెబుతున్నారు.
మైనంపల్లి హన్మంతరావు వ్యవహారం.. బీఆర్ఎస్ పార్టీ అధినేతలోని భయాల్ని వెలుగులోకి తెస్తోంది. దీన్ని కాంగ్రెస్ పకడ్బందీ ప్రణాళికతో వాడుకునేందుకు సిద్ధమవుతోంది. మొత్తంగా మైనంపల్లి ఎవరికి అస్త్రంగా మారుతారన్నది మాత్రం సస్పెన్స్.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…