దగ్గుబాటి-నారా కుటుంబాలు మళ్లీ దగ్గరవుతున్నట్లు కనిపిస్తున్నాయి. బిజెపి-టిడిపిల మధ్య మళ్లీ అవగాహన కుదురుతోన్నట్లే కనిపిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ లో 2024 ఎన్నికలే లక్ష్యంగా రాజకీయసమీకరణాలు వేగంగా మారుతున్నట్లు అనిపిస్తోంది.తాజాగా దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు పేరిట 100 రూపాయల నాణేన్ని విడుల చేసే కార్యక్రమంలో బిజెపి అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు నాయుడు భేటీ కావడం ఇద్దరూ పలు అంశాలపై చర్చించుకోవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు చాలా ఏళ్లుగా దగ్గుబాటి-నారా కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉండేది అటువంటిది పురంధేశ్వరి తోపాటు చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం పై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు పేరిట 100రూపాయల నాణేన్ని విడుదల చేశారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్న ఈ కార్య క్రమానికి ఎన్టీయార్ కుటుంబ సభ్యులైన ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎన్టీయార్ తనయుడు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ఎన్టీయార్ తో సన్నిహితంగా ఉన్న మరి కొందరు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జేపీ నడ్డా పక్క సీటులోనే చంద్రబాబు నాయుడు కూర్చున్నారు. ఇద్దరూ కూడా చాలా సేపు చాలా అంశాలపై చర్చించుకున్నారు
గతంలో బిజెపితో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు 2014లో బిజెపితో పొత్తుతోనే అధికారంలోకి వచ్చారు. అయితే 2018లో ఎన్డీయే ప్రభుత్వం నుండి బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు. 2019ఎన్నికల ప్రచారంలో బిజెపిపై నిప్పులు చెరుగుతూ ప్రసంగించేవారు చంద్రబాబు. మోదీని ఓడించడమే తన లక్ష్యమని సవాల్ విసిరారు. అయితే ఆ ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి అదరగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి టిడిపిని ప్రతిపక్షానికి పరిమితం చేసింది.
2024 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావాలంటే జనసేనతో పాటు బిజెపితో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే బిజెపి మాత్రం టిడిపితో మరోసారి పొత్తు వద్దని దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే అనుకోకుండా వచ్చిన అదృష్టంలా బిజెపి అగ్రనేత పాల్గొనే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనే అవకాశం దక్కింది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు చంద్రబాబు, జేపీ నడ్డాతో కీలక అంశాలపై చర్చించారు. అందులో రెండు పార్టీల మధయ పొత్తు అంశం కూడా ఉందంటున్నారు రాజకీయ పండితులు.
దూరమైన బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోన్న చంద్రబాబు నాయుడు ఏళ్ల క్రితం తాను దూరం చేసుకున్న దగ్గుబాటి కుటుంబాన్ని దగ్గర చేసుకోడానికి మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు.1994 సెప్టెంబరులో ఎన్టీయార్ కు వ్యతిరేకంగా టిడిపిలో తిరుగుబాటు తెచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావడంతో సహకరించిన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్లు కు డిప్యూటీ సిఎం పోస్టు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆ పదవిని ఇవ్వలేదు. అందుకే దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబుకు దూరంగా ఉన్నారు. అటువంటిది ఇపుడు పురంధేశ్వరి-చంద్రబాబు నాయుడి మధ్య ఏదో అవగాహన కుదిరినట్లుందని రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు
దగ్గుబాటి-నారాల మద్య ఏడాది క్రితమే సంధి కుదిరి ఉంటుందని రాజకీయ పండితులు అంటున్నారు. ఏడాది క్రితం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుండె సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. అపుడు సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు నాయుడు దగ్గుబాటిని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారు.బహుశా అప్పుడే తోడల్లుళ్ల మధ్య ఒకరకమైన అవగాహన కుదిరి ఉండచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ క్రమంలోనే ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా నియమితులైన పురంధేశ్వరిని కూడా కలుపుకుపోవడం ద్వారా బిజెపితో పొత్తు సాధించుకోవాలని చంద్రబాబు భావిస్తోన్నట్లు చెబుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…