మోదీ మహా మాస్టర్ ప్లాన్.. ?

By KTV Telugu On 31 August, 2023
image

KTV TELUGU :-

తొందరపడి ఓ కోయిలా ముందే కూస్తోందా.. ప్రధాని మోదీ బృందం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా ?మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ ప్రయోగాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయబోతున్నారా.. పార్టీ శ్రేణులను ముందుగానే సమాయత్తం చేయాలన్నది వారి వ్యూహమా… అందుకు కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారా…

మోదీ, అమిత్ షా ద్వయం ఏం చేసినా అందులో ఒక దూకుడు కనిపిస్తుంది. సంప్రదాయ ప్రత్యర్థి కాంగ్రెస్ సహా ప్రాంతీయ పార్టీలన్నింటినీ దెబ్బకొట్టెయ్యాలన్న కోరిక వారిలో బలంగా నటుకుపోయింది. అందుకు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మద్దతు కూడా వారికి పూర్తి స్థాయిలో లభిస్తోంది. మోదీ హ్యాట్రిక్ కొట్టాలన్న ఆకాంక్షతో రాజకీయాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రత్యర్థులు నిద్రలేచే లోపే తాము ఆమడదూరం దూసుకెళ్లిపోవాలన్న కోరిక ఆయనలో గట్టిగా కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు సంగతి వేరే… ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడమే తమ అసలు వ్యూహమని బీజేపీ అంటోంది. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తూ 160 నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది.

డిసెంబరులో లోక్ సభకు ఎన్నికలు నిర్వహించాలన్నది బీజేపీ ఆకాంక్షగా కనిపిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే పార్టీలో చర్చ జరుగుతోంది. బీజేపీ ప్రత్యర్థులు కూడా డీసెంబరు, జనవరి ముహుర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ దిశగా మమతా దీదీ కూడా ఒక ప్రకటన చేశారు. డిసెంబరులో ఎన్నికలు జరిపించడం ఒక వంతయితే 160 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం మరో వంతు అని చెప్పాలి. ఇతర పార్టీలను షాకులో పడెయ్యాలని బీజేపీ డిసైడైంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే తొలి జాబితా విడుదల చేయాలన్న సంకల్పంలో పెద్ద వ్యూహమే ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లు, ప్రచారానికి తగిన సమయం ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఇతర పార్టీలు అభ్యర్థుల వేటలో ఉండగా తాము ఇంటింటి ప్రచారంలో ఉండాలని బీజేపీ లెక్కలేసుకుంటోంది. బీజేపీ ఎంపిక చేసుకుని తొలి జాబితాలో విడుదల చేసే 160 మంది అభ్యర్థుల జాబితాకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో తొలి జాబితాలో చేర్చుతారు. దానితో ఆ 160 నియోజకవర్గాల్లో దక్షిణాదివే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.తెలంగాణలోని 17 లోక్ సభా నియోజకవర్గాల్లో 12 చోట్ల తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయ్యిందని కూడా తెలంగాణ బీజేపీ నుంచి వినిపిస్తున్న మాట.

బీజేపీ ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు తొలి జాబితాను ప్రకటించింది. అక్కడ కూడా ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు. డిసెంబరులో ఎన్నికలకు ఇప్పుడే జాబితా ప్రకటించడంతో గత వారం రోజులుగా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. దీనితో ప్రజల నాడి తెలుస్తోందని బీజేపీ చేసిన మంచి పనులను జనంలోకి తీసుకువెళ్లేందుకు వీలు కలుగుతోందని అనుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉండగా, ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ సీఎం భూపేష్ భాగేల్ పాలన నడుస్తోంది ఛత్తీస్ గఢ్ ప్రజలు బీజేపీ పట్ల మొగ్గు చూపుతున్నారన్న సర్వేల నడుమ తొలి జాబితా ప్రకటించిన నియోజవర్గాల్లో అనూహ్య స్పందన కనిపిస్తోందని క్షేత్రస్థాయి నుంచి ఢిల్లీకి అప్పుడే నివేదికలు వెళ్లాయి. ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వాయు వేగంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుపుతున్నారు. రాఖీ పండుగను పురస్కరించుకుని లాడ్లీ బెహన్ ప్రోగ్రాం కింద 1.25 కోట్ల మంది మహిళలకు అదనంగా తలా రూ.250 రూపాయలు వారి ఖాతాలో జమ చేశారు.

దక్షిణాదిన బీజేపీకి అంతగా బలం లేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో మరింత ఇరకాటంలో పడింది. అక్కడ సిద్దరామయ్య ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత పథకాలు బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టాయి. తమిళనాడులో సీఎం స్టాలిన్ ను దాటుకుని బీజేపీ ముందుకు వెళ్లలేదు. కేరళ, ఏపీలో ఆ పార్టీకి సీన్ లేదు. తెలంగాణలో బండి సంజయ్ చీఫ్ గా ఉన్నప్పుడు పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు. అందుకే దక్షిణాదిన తొలి జాబితాలో ఎక్కువ స్థానాలు ప్రకటించి ప్రచారం ప్రారంభించాలనుకుంటోంది. అందుకు ఆయా రాష్ట్రాల్లో పార్టీ చీఫ్ లు కిషన్ రెడ్డి, పురంధేశ్వరి, అన్నామలై దూకుడుగానే వ్యవహరించగలరన్న నమ్మకం బీజేపీ అధిష్టానానికి ఉందని చెబుతున్నారు. చూడాలి మరి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి