– అభిషేక్ బుక్ అయ్యాడు.. అతని తర్వాత ఎవరు?
ఢిల్లీలో మొదలైంది. హైదరాబాద్ గల్లీదాకా వచ్చింది. మనీష్ సిసోడియా నుంచి కేసీఆర్ కూతురు కవిత దాకా ఈ స్కామ్‌లో ఎన్నెన్నో పేర్లు. లోపాయికారీ ఒప్పందాలు, వ్యాపారాలు ఎలా ఉంటాయో కళ్లకు కడుతోంది లిక్కర్ స్కామ్. సీబీఐ దెబ్బకి డొంకంతా కదులుతోంది. ఎవరెవరి ఖాతాల్లోకి ఎక్కడెక్కడినుంచి ఎలా డబ్బొచ్చి పడిందో సీబీఐ కూపీ లాగుతోంది. వన్ బై వన్ అందరినీ ఆరాతీస్తోంది. బోయినపల్లి అభిషేక్. రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్. అభిషేక్‌ని కదిపితే చాలామంది గుండెల్లో షేకింగ్ మొదలైంది.
అభిషేక్ ఎంక్వయిరీతో కొత్త విషయాలు బయటికొచ్చాయి. ఢిల్లీ వ్యాపారి అమిత్ అరోరాను ఆరాతీసిన సీబీఐ వాహలా రూపంలో నగదు బదిలీ జరిగినట్లు గుర్తించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అనుచరుడు అర్జున్ పాండేకు విజయ్ నాయర్ తరపున సమీర్ మహేంద్రు ముడుపులు ముట్టజెప్పినట్లు సీబీఐ భావిస్తోంది. బ్యాంకు లావాదేవీలు, నిందితులతో జరిగిన సమావేశాలతో ఈ ఎపిసోడ్‌లో అభిషేక్ పాత్రే కీలకమన్న నిర్ధారణకు వస్తున్నారు. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరిన్ని అరెస్టులు జరగబోతున్నాయి.
అభిషేక్‌కు తెలంగాణలోని ప్రముఖ నేతలతో వ్యాపార సంబంధాలున్నాయని సీబీఐ ప్రాథమిక విచారణలో గుర్తించింది. చేతులు మారిన ముడుపులు కొందరు నేతల జేబుల్లోకి వెళ్లుంటాయని అనుమానిస్తున్నారు. కొత్త మద్యం పాలసీ రాకముందే వచ్చే లాభాల గురించి నిందితులతో అభిషేక్ అనేక సిట్టింగ్‌లు వేశాడు. ఢిల్లీ, ముంబైతోపాటు హైదరాబాద్‌లో కూడా మీటింగ్‌లు జరిగాయి. ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు నుంచి వచ్చిన డబ్బు అభిషేక్ ఖాతాకు చేరింది. ఇప్పటికే ఓ పత్రికాసంస్థ యజమానిని కూడా ప్రశ్నించిన సీబీఐ మరికొందరికి నోటీసులిస్తోంది.
హైదరాబాద్ మరికొందరి అరెస్ట్ తప్పకపోవచ్చు. వ్యాపారులతో పాటు రాజకీయ నాయకులు కూడా సీబీఐ ఉచ్చులో చిక్కుకునేలా ఉన్నారు. ఎవరి సీటు కదులుతుందో, ఏ నాయకుడి పరువు బజారున పడుతుందో తెలియటంలేదు. మొత్తానికి ఆప్ సర్కార్ టార్గెట్‌గా మొదలైన లిక్కర్ స్కామ్ ఎంక్వయిరీ చివరికి తెలంగాణలో కొందరు ప్రముఖులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరి కల్వకుంట్ల కవితమ్మ సేఫేనా?