నారా చాణక్యం

By KTV Telugu On 2 September, 2023
image

KTV TELUGU :-

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో  చక్రాలు తిప్పుతున్నారు. ఏడుపదుల వయసు దాటినా తన వ్యూహాల్లో పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నారు చంద్రబాబు. ఢిల్లీ వేదికగా కేంద్రంలో  సంకీర్ణ ప్రభుత్వాల శకంలో   చక్రం తిప్పిన రాజకీయ దురంధరుడు ఇపుడు మరోసారి  పొలిటికల్ గేమ్ కు తెరతీశారు.తన రాజకీయ ప్రత్యర్ధులకు అంతు చిక్కకుండా వారిని ఉక్కిరి బిక్కిరి చేసేలా వ్యవహారాలు చేస్తున్నారు. ఏపీలో 2024 ఎన్నికల్లో జనసేన-బిజెపిలతో కలిసి  పొత్తు పెట్టుకుని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను ఇంటికి సాగనంపాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

దివంగత ఎన్టీయార్ పేరిట వంద రూపాయల నాణేన్ని విడుదల చేసే కార్యక్రమంలో ఎన్టీయార్ కుటుంబ సభ్యులతో పాటు నారా కుటుంబ సభ్యులు కూడా  పాల్గొన్నారు. ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి ఈ  కార్యక్రమానికి చంద్రబాబును కూడా ఆహ్వానించారు. తనను దూరం పెట్టి తనపై తీవ్ర విమర్శలు చేసిన పురంధేశ్వరినే తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మలుచుకోవడం చంద్రబాబు చాణక్యానికి  పరాకాష్ఠ అంటున్నారు  రాజకీయ పండితులు. ఈ కార్యక్రమంలో  బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏకాంతంగా భేటీ అయ్యే అవకాశాన్ని అంది పుచ్చుకున్నారు చంద్రబాబు

ఏపీలో బిజెపితో పొత్తును ఓకే చేయించుకోవాలనుకుంటోన్న చంద్రబాబు నాయుడు ముందుగా  బిజెపి కాళ్లకు ముందర బంధం వేశారని అంటున్నారు.  ఏపీ కన్నా ముందుగా ఎన్నికలు జరగనున్న తెలంగాణాలో టిడిపికి  తనకంటూ నిర్దిష్ట ఓటు బ్యాంకు ఉంది. వచ్చే ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకును బిజెపికి బదలాయించేలా  మద్దతు ఇస్తామని చంద్రబాబు నాయుడు నడ్డాకి బంపర్ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. తెలంగాణాలో ఇలా తమ సాయం అందించినందుకు గానూ 2024 ఎన్నికల్లో ఏపీలో తమతో పొత్తుకు అంగీకరించాలని చంద్రబాబు షరతి పెట్టినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆఫర్ వినడంతో నడ్డా  కూడా సానుకూలంగానే స్పందించారట. కాకపోతే తెలంగాణాలో బిజెపి ఒంటరిగా బరిలో దిగుతుందని క్లారిటీ ఇచ్చిన నడ్డా ఏపీలో ఎన్నికలకు ముందు పొత్తుల గురించి ఆలోచిస్తామని అన్నారని అంటున్నారు.

ప్రతి కూలా పరిస్థితులు ఎదురైనపుడు చాలా మంది డీలా పడిపోతారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం  ఆ ప్రతికూల పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటారు. తనని దూరం పెట్టిన బిజెపితో స్నేహం కోసం ఒకపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత లాబీయింగ్ చేయిస్తోన్న చంద్రబాబు ఇపుడు ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని ఆయుధంగా వాడుకుంటున్నారని అంటున్నారు. ఏపీ బిజెపిలో తనను వ్యతిరేకించే మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వర్గీయులకు పార్టీలో కీలక పదవులు రాకుండా అడ్డుకోవడంలోనూ చంద్రబాబు నాయుడు విజయం సాధించారని వారంటున్నారు.

హస్తిన వర్గాల్లో వినపడుతోన్న దాన్ని బట్టి బిజెపి అగ్రనాయకత్వం కూడా  పాత మిత్రుడైన చంద్రబాబును చేరదీయడానికి సిద్ధంగానే ఉన్నట్లు చెబుతున్నారు. వివిధ సర్వేల్లో  ఎన్డీయే గ్రాఫ్ తగ్గడంతో పాటు విపక్ష కూటమి ఇండియా గ్రాఫ్ పెరుగుతోన్నట్లు కనిపించడంతో బిజపి కలిసొచ్చే ప్రతీ ఒక్కరినీ దగ్గరకు తీసుకోవాలని చూస్తోందంటున్నారు.  ఈ పరిస్థితినే చంద్రబాబు చాకచక్యంగా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారని వారంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి