ఒకటి చాలదు  రెండు కావాలంటున్నారు

By KTV Telugu On 2 September, 2023
image

KTV TELUGU :-

ఎన్నికల్లో  విజయావకాశాలు ఎక్కువగా ఉండే పార్టీ కోసం నేతలు ఎగబడటం సహజం. గెలవబోయే పార్టీకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ పార్టీ తరపున టికెట్ దక్కితే చాలు చట్టసభలో అడుగు పెట్టేసి మైక్ పట్టుకుని అధ్యక్షా అనేయచ్చని  ఆశావహులు  అనుకుంటూ ఉంటారు. దాంతో పార్టీలో టికెట్ల కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. ఫలితంగా రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది.ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్ లో ఇదే పరిస్థితి ఉంది. ప్రతీ నియోజక వర్గంలోనూ  ఎక్కువ మంది  టికెట్ కోసం దరఖాస్తు చేసుకుని కూర్చున్నారు. సీనియర్ నేతల నియోజక వర్గాల్లోనూ పోటీ మామూలుగా లేదు.

రాజకీయాల్లో ఫ్యామిలీ ప్యాకేజీలు కొత్తేమీ కాదు. ఎన్నికల్లో కుటుంబం నుంచి ఒక్కరే కాకుండా రక్త సంబంధీకులు  కూడా పోటీ చేయడం మామూలే. ఒక్కోసారి ఇద్దరు, ముగ్గురు ఒకే పార్టీ నుంచి కాకుండా వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేయడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఫ్యామిలీ ప్యాకేజీలు మరీ ఎక్కువయ్యాయంటున్నారు. రూల్స్‌ తమకు వర్తించవ్..నాకు మా అబ్బాయికి సీటివ్వాల్సిందే అంటున్న నాయకులు ఎక్కువయ్యారని గాంధీభవన్ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇంతకీ కాంగ్రెస్  టికెట్ కోసం నేతల విన్యాసాలు..సిత్రాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

టీ కాంగ్రెస్ ధరఖాస్తు ల పరిశీలన లో పలు కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. పలువురు సీనియర్ నేతలు ఫ్యామిలీ ప్యాక్ ను ప్రదేశ్ ఎన్నికల కమిటీ ముందు ఉంచారు.. దీంతో ఓక్కరికి టిక్కెట్ ఇవ్వడమే గగనం అనుకుంటే ఈ ఫ్యామిలీ గొడవ ఏంటి రా బాబు అని హస్తం నేతలు తలలు పట్టుకున్నారు. ఒక  నేత అయితే  నాకు , నా కొడుక్కి టికెట్ కావాలని అడిగితే.. మరో నేత నాకు నా భార్యకు ఇవ్వాల్సిందే అంటున్నారు.., ఇంకో నేత నాకు నా కూతురుకు అంటూ లాబీయింగులు  మొదలు పెట్టారు.

ఒకే కుటుంబానికి రెండు టికెట్లు అడుగుతున్న వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ,కొండా సురేఖ ,బలరాం నాయక్ , సీతక్క ,దామోదర రాజనర్సింహ ,అంజన్ కుమార్ యాదవ్  లు ఉన్నారు..ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఫ్యామిలీలో తనకు ,తన భార్య  పద్మావతి కి  టికెట్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉత్తమ్ పద్మావతి మాజీ ఎమ్మెల్యే కావడం తో టిక్కెట్ విషయం లో ఏఐసీసీ సానుకూలంగా ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. ఇక జానారెడ్డి తన ఇద్దరు కొడుకులు రఘువీర్ రెడ్డి ,జై వీర్ రెడ్డి లకు నాగార్జున సాగర్ ,మిర్యాలగూడ టిక్కెట్ అడుగుతున్నారు. ఎమ్మెల్యే సీతక్క తన కొడుకు సూర్యం ను ఈ ఎన్నికల్లో బరిలో దింపాలనుకుంటున్నారు సూర్యం కు పినపాక టిక్కెట్ అడుగుతున్నారు.

మరోనేత బలరాం నాయక్ తనకు మహాబూబాబాద్ టిక్కెట్, తన కొడుకు సాయిరాం శంకర్ కు ఇల్లందు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు  కొండా మురళి దంపతులు రెండు టికెట్ల కోసం పట్టుబడుతున్నారు. కొండా మురళి పరకాల ,కొండ సురేఖ వరంగల్ తూర్పు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక దామోదర రాజనర్సింహ ఫ్యామిలీ నుండి కూడా దామోదర తో పాటు ఆయన కూతురు దరఖాస్తు ధాఖలు చేశారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకూడదనుకుంటే  తన కూతురు కు ఇవ్వాలని దామోదర రాజనర్సింహ ముడిపెడుతున్నారట. ఇక మరోనేత అంజన్ కుమార్ యాదవ్ అయితే తనకు తన ఇద్దరు కొడుకులకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. ముషీరాబాద్ టిక్కెట్ తనకు లేదంటే తన పెద్ద కొడుకు అనిల్ కు ,గోషామహాల్ టిక్కెట్ తన చిన్న కొడుక్కి ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రదేశ్ ఎన్నికల కమిటీ ముందు ఉంచారట.

మరోవైపు కాంగ్రెస్ లో చేరాలనుకునే నేతలు సైతం రెండు టికెట్ల ప్రతిపాదననే ముందు ఉంచుతున్నారట.బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ తనకు తన భర్త కు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. మరోనేత మైనంపల్లి తో చర్చలు జరిపిన కాంగ్రెస్ నేతలకు ఇదే ప్రతిపాధన ఏదురైందట.తనకు మల్కాజిగిరి, తన కొడుక్కి మెధక్ టిక్కెట్ ఇవ్వాలనే ప్రధిపాదన పెట్టారట. దీంతో ఇలా ఫ్యామిలీ ప్యాక్ లు ఇచ్చుకుంటే పోతే మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారట మిగతా నేతలు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ను కచ్చితంగా అమలు చేసి..ఒక కుటుంబానికి ఒకే టికెట్ సూత్రాన్ని వర్తింప చేయాలని ఆశావాహులు పట్టుబడుతున్నారు. దీంతో కుటుంబానికి అడిగినన్ని టికెట్లు ఇవ్వకపోతే సీనియర్లతో బాధ.. ఇస్తే ఆశావాహులతో సమస్య.. ఎలా నెట్టుకురావాలో తెలియక హస్తం పెద్దలు తలలు పట్టుకుంటున్నారు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి