సవాలక్ష సమస్యలు – శతకోటి ఉపాయాలు

By KTV Telugu On 2 September, 2023
image

KTV TELUGU :-

సమస్యలు పెరుగుతున్నాయి. డైవర్షన్ లేకపోతే ఇబ్బందులు తప్పవు, అనేకానేక కార్యక్రమాలతో దేశ ప్రజలను బిజీగా ఉంచినా ఇంకా టైమ్ మిగిలింది. మధ్యలో వచ్చే వారం రోజులను ఎలా మేనేజ్ చేయాలి. ఇదంతా సామాన్యులను వేధించే సమస్య. మోదీ లాంటి రాజకీయ దురంధరుడికి అది చాలా ఈజీ. ఆయన ఇప్పుడు అదే చేశారు. తన అమ్ములపొదిలోంచి కొత్త అస్త్రాన్ని బయటకు తీశారు. ఆ అస్త్రమే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలని చెప్పుకోక తప్పదు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇప్పుడిప్పుడే ముగిశాయి. నవంబరులో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతాయి. ఈ లోపు ప్రత్యేక సమావేశాలు పెట్టకపోయినా మిన్ను విరిగి మీద పడే పరిస్థితి లేదు.. ఐనా సరే మోదీ మార్క్ రాజకీయాలకు తెరలేచింది. సెప్టెంబరు నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రకటన వెలువడింది. విపక్షాలు లబోదిబోమని కొట్టుకోవడం మినహా సమావేశాలను ఆపే సీన్ లేదు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండా తెలియకపోయినా మూడు నాలుగు అంశాలను బీజేపీ కావాలనే మీడియాలో ప్రచారం చేస్తూ జననాడిని తెలుసుకునే ప్రయత్నంలో ఉంది. సెప్టెంబరు 18 వరకు వేచి చూసి అవసరాన్ని బట్టి అజెండా రూపొందించే అవకాశం ఉంది.

అదో అకస్మాత్తు నిర్ణయం. ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్న నిర్ణయంపై సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ ట్విటర్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేసి మరింత ఆశ్చర్యానికి గురి చేసిన మాట నిజం. అమృత్‌ కాల్‌ సంబరాలవేళ జరుగుతున్న ఈ సమావేశాలు ఫలప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రత్యేక సమావేశాలు పార్లమెంటు పాత భవనంలో ప్రారంభమై కొత్త భవనంలో ముగుస్తాయని తెలుస్తోంది. ఈ సమావేశాల అజెండా ఏమిటన్నది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదుగానీ.. ఈ ప్రత్యేక సమావేశాల్లో ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ పేరుతో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లును కూడా ప్రవేశపెట్టి దేశంలో పెద్దఎత్తున మహిళల అభిమానం చూరగొనాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ జమిలి ఎన్నికలు సాధ్యపడని పక్షంలో లోక్‌సభ ఎన్నికలను కొద్దిగా ముందుకు జరిపి సాధ్యమైనన్ని రాష్ట్రాలతో కలిపి పాక్షికంగా జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం అనూహ్యమైన, అసాధారణమైన చర్యలను ప్రకటించే అవకాశాలున్నాయని, ఈ చర్యలు దేశ ప్రజల దృష్టిని మళ్లించి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చని ఆపార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రధాని మోదీ ఈ నెల 17న తన 73వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. దాని కోసం పక్షంరోజుల పాటు వేడుకలకు, సేవా కార్యక్రమాలకు బీజేపీ ప్రత్యేక అజెండా రూపొందించారు. మోదీ జన్మదిన వేడుకలు జరుపుతున్న సమయంలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం కాకతాళీయమయితే కాదు. అది ఫుల్ ప్లాన్డ్ స్ట్రాటజీగానే చెప్పుకోవాలి. జమిలీ ఎన్నికల వ్యవహారాన్ని తేల్చేయ్యాలనే మోదీ మహాశయుడు ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు. అందుకోసం ఐదు రాజ్యాంగ సవరణలు చేయాలన్నది మోదీకి తెలియనిది కాదు. దీర్ఘకాలిక అజెండాలోని అంశాలను త్వరగా పూర్తి చేసేందుకు బీజేపీ దూకుడునే ప్రదర్శిస్తోందనడానికి ఇదో నిదర్శనంగా చెప్పాలి. అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే జమిలి ఎన్నికలపై ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దానిపై ఒక కమిటీని వేస్తామని ప్రకటించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దాని తర్వాత లా కమిషన్‌కు ఈ విషయం నివేదించారు. లా కమిషన్‌ తన 79వ నివేదికలో పలు సిఫారసులు చేసింది. ఈ విషయంపై ఆచరణీయమైన రోడ్‌మ్యాప్‌ రూపొందించాల్సిందిగా ప్రభుత్వం లా కమిషన్‌ను కోరినట్లు జూలై 27న రాజ్యసభలో న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ చెప్పారు. పార్లమెంట్‌ ఉభయ సభల కాలపరిమితికి సంబంధించి 83వ అధికరణ, లోక్‌సభ రద్దుకు సంబంధించి 85వ అధికరణ, రాష్ట్రాల శాసనసభల కాలపరిమితికి సంబంధించి 172వ అధికరణ, రాష్ట్రా ల శాసన సభల రద్దుకు సంబంధించి 174వ అధికరణ, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు సంబంధించి 356 అధికరణలను సవరించాల్సి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూడింట రెండు వంతుల మెజార్టీతో ఆమోదం పొందాల్సిన రాజ్యాంగ సవరణల విషయమై కొన్ని ఇబ్బందులు ఎదురుకావడం తప్పదని తెలిసినా.. తమ చాణక్యాన్ని వినియోగించాలని బీజేపీ డిసైడైంది.

దశాబ్దాలుగా వాయిదా పడుతూ వస్తున్న మహిళా బిల్లు అంశాన్ని కూడా ఇప్పుడే తేల్చేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఈ సారి ఎన్నికల్లో మహిళల పాత్ర కీలకమవుతున్న నేపథ్యంలో వారిని ఆకట్టుకోవాలని మోదీ భావిస్తున్నారు. వంట గ్యాస్ ధర 200 రూపాయలు తగ్గింపు కూడా ఆ చర్యల్లో భాగమే అవుతుంది. మధ్యప్రదేశ్లో సూపర్ సక్సెస్ అయిన లాడ్లీ బెహన్ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నారని సమాచారం. ఎన్ని చేసినా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగదనిదే ప్రయోజనం ఉండదని మోదీ భావిస్తున్నారు. అందుకే ఈ సారి బిల్లును ప్రవేశపెట్టి విపక్షాలను ఇరకాటంలో పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ దిశగా జమిలీ ఎన్నికలకు, మహిళా బిల్లుకు లింకు కూడా కుదరుతుంది. మహిళల ఓట్లు ఇబ్బడిముబ్బడిగా బీజేపీకి వస్తాయన్న విశ్వాసం పెరుగుతుంది.

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల అజెండాలో మరో రెండు మూడు అంశాలున్నప్పటికీ ఎన్నికలు, మహిళా బిల్లు మాత్రమే ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. సమావేశ తేదీలపై విపక్షాలకు కొన్ని అభ్యంతరాలున్నప్పటికీ ప్రభుత్వపక్షం పట్టించుకునే చాన్స్ కనిపించడం లేదు. గణేశ ఉత్సవాల టైమ్ లో పార్లమెంటు సమావేశాలేమిటని మహారాష్ట్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. అసలు నవంబరులో శీతాకాల సమావేశాలున్నప్పుడు నెలన్నర ముందు ప్రత్యేక సమావేశాలు ఎందుకని కొందరి వాదన. దేశంలో సమస్యలు పెరిగిపోతున్నాయని వాటి నుంచి తప్పించుకునేందుకే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. నిజానికి అవన్నీ శేష ప్రశ్నలే అవుతాయి. వాటికి మోదీ, బీజేపీ ఎప్పుడూ సమాధానం చెప్పరు. అవసరమైతే ఎదురుదాడి చేస్తారంతే….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి