ఆ ప‌విత్ర క్షేత్రానికి ఇక మ‌హిళ‌లు ఒంట‌రిగా వెళ్లొచ్చు!

By KTV Telugu On 12 October, 2022
image

– మ‌క్కా యాత్ర‌కు మ‌గ‌తోడు అవ‌స‌రంలేదు!
– సౌదీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఒంట‌రిగానే మ‌హిళ‌ల హ‌జ్ యాత్ర‌

ముస్లింల ప‌విత్ర పుణ్యక్షేత్రాల ద‌ర్శ‌నంలో ద‌శాబ్ధాల నిబంధ‌ల‌ను స‌డ‌లించింది సౌదీ అరేబియా. హజ్, ఉమ్రా ఆధ్యాత్మిక యాత్రలకు మహర్మ్ లేదా మగ సంరక్షకుడి అవ‌స‌రం లేకుండానే మహిళలు హాజరయ్యేలా చారిత్ర‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌యాత్రికుల‌కు ఈ నిర్ణ‌యం వ‌ర్తిస్తుంద‌ని సౌదీ అరేబియా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టిదాకా ఎవ‌రో ఒక‌రు తోడులేకుండా మ‌క్కాలో అడుగుపెట్ట‌లేని మ‌హిళ‌ల‌కు ఇది శుభ‌వార్తేన‌ని చెప్పొచ్చు.

మ‌గ సంర‌క్ష‌కుడెవ‌రూ లేకుండానే ఉమ్రా చేసేందుకు మ‌హిళ‌లు రావ‌చ్చంటోంది సౌదీఅరేబియా. కైరోలోని సౌదీ రాయబార కార్యాలయంలో సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్ రబియా ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో సౌదీలో త‌రాలుగా అమ‌ల‌వుతున్న ఆంక్ష‌ల‌ను ఎత్తేసిన‌ట్ల‌యింది. హజ్, ఉమ్రా చేయడానికి మహిళలకు మహర్మ్ అవసరమని సౌదీ మతపెద్దలు మొద‌ట్నించీ క‌ట్ట‌డి చేస్తూ వ‌చ్చారు. అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ముస్లిం స‌మాజం నుంచి వ‌స్తున్న విజ్ఞ‌ప్తుల‌ను ఎట్ట‌కేల‌కు సౌదీ మ‌న్నించింది.

దైవ‌చింత‌న‌లో కాలంగ‌డిపే ప్ర‌తీ ముస్లిం జీవితకాలంలో ఒక్కసారైనా హ‌జ్ యాత్ర చేయాల‌నుకుంటాడు. హ‌జ్ యాత్ర‌తోనే త‌మ జీవితానికో సార్థ‌క‌త ద‌క్కుతుంద‌నుకుంటారు. ఉమ్రా యాత్ర‌ని మాత్రం సంవత్సరంలో ఎప్పుడైనా చేయొచ్చు. అయితే ముస్లింలు ఉమ్రా కంటే హ‌జ్ యాత్ర‌కే ప్రాధాన్యం ఇస్తారు. అదే కీల‌కం అనుకుంటారు. అందుకే మ‌హిళ‌లు యాత్రికుడు లేదా మ‌గ‌తోడు లేకుండానే హ‌జ్‌, ఉమ్రా యాత్ర‌లు చేసే వెసులుబాటు ఇవ్వ‌టాన్ని అంతా ఆహ్వానిస్తున్నారు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఉమ్రా వీసాలకు కోటా, సీలింగ్ లేదు. ఎలాంటి వీసాలతోనైనా సౌదీకి వ‌చ్చే ముస్లింలను ఉమ్రా చేసేందుకు అనుమతిస్తామన్నారు ఆ దేశ మంత్రి తౌఫిక్‌. హజ్ యాత్ర ఖర్చును తగ్గించేందుకు మంత్రిత్వశాఖ కృషి చేస్తోంది. ప‌విత్ర క్షేత్రాన్నిసంద‌ర్శించాల‌ని భావించే వారంద‌రికీ అందుబాటులో ఉండేలా సౌదీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఒంట‌రి మ‌హిళ‌లు నిర్భ‌యంగా సౌదీకి రావ‌చ్చంటోంది అక్క‌డి ప్ర‌భుత్వం. విజ‌న్‌-2030తో మరిన్ని సంస్క‌ర‌ణ‌ల దిశ‌గా అడుగులేస్తోంది.