తెలంగాణా లో బి.ఆర్.ఎస్ కు చుక్కలు చూపించడానికి బిజెపి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బి.ఆర్.ఎస్. లో అతిరథ మహారథులు అనదగ్గ కీలక నేతలను ఓడించడమే లక్ష్యంగా అభ్యర్ధులను ఎంపిక చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయంటున్నారు. కేసీయార్ కుటుంబ సభ్యులతో పాటు కీలక మంత్రులను ఎన్నికల్లో ఇంటికి సాగనంపడమే అజెండాగా బిజెపి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని పార్టీ వర్గాల భోగట్టా. పార్టీలోనే దిగ్గజ నేతలను బి.ఆర్.ఎస్. అభ్యర్ధులపై బరిలో దింపేందుకు పార్టీ అధినాయకత్వం ఒక వ్యూహాన్ని ఖరారు చేసిందని అంటున్నారు. అదే జరిగితే బి.ఆర్.ఎస్. కు ముచ్చెమటలు పట్టడం ఖాయమన్నది వారి వాదన.
ఎన్నికల నగారా మోగడానికి చాలా ముందుగా.. మిగతా పార్టీలకన్నా ముందుగా బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ 115 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసి సంచలనం సృష్టించారు. ఈ సందర్భంగానే తాను రెండు నియోజక వర్గాల నుండి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తోన్న గజ్వెల్ నియోజక వర్గంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజక వర్గం నుండి కూడా పోటీ చేస్తున్నారు కేసీయార్. ఓటమి భయంతోనే కేసీయార్ ఎందుకైనా మంచిదని రెండు నియోజక వర్గాల నుండి పోటీ చేస్తున్నారని తన ఓటమిని ఆయన ముందుగానే ఒప్పుకున్నట్లు అయ్యిందని బిజెపి నేతలు అప్పట్లో సెటైర్లు వేశారు కూడా.
కేసీయార్ ఎలాగూ జంకుతున్నారు కాబట్టి ఆయన్ను మరింత కంగారు పెట్టాలనుకున్నారో.. లేక కేసీయార్ ను ఓడించి తీరాలని బిజెపి నాయకత్వం కసిగా ఉందని అంటున్నారు. అందుకే కేసీయార్ కు దీటైన ప్రత్యర్ధిని బరిలో దింపాలని బిజెపి అగ్రనాయకత్వం హస్తినలోనే డిసైడ్ చేసిందని ప్రచారం జరుగుతోంది. గజ్వెల్ నియోజక వర్గంలో కేసీయార్ పై బిజెపి అభ్యర్ధిగా సీనియర్ నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను పోటీలో ఉంచాలని బిజెపి భావిస్తోన్నట్లు చెబుతున్నారు. ఈటల రాజేందర్ కు మంచి జనాదరణ ఉండడంతో పాటు వెనుకబడ్డ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కేసీయార్ పై విజయం సాధించడానికి అవకాశాలున్నాయని బిజెపి అంచనా వేస్తోంది. అందులోనూ ఎన్నికల వ్యూహాల్లో కేసీయార్ కు ఏ మాత్రం తీసిపోని ఈటల అయితేనే కేసీయార్ కు చెక్ చెప్పగలమని బిజెపి నమ్ముతోంది.
తెలంగాణా ఉద్యమంలో కేసీయార్ మొదట్నుంచీ కేసీయార్ వెన్నంటే ఉన్న ముఖ్యనేతల్లో ఈటల రాజేందర్ ఒకరు. వామపక్ష ఆలోచనలు ఉన్న ఈటల రాజేందర్ మంచి వక్తే కాకుండా వ్యూహకర్త కూడా. రాజకీయంగానూ పాలనా పరంగానూ దక్షుడే. అందుకే కేసీయార్ కేబినెట్ లో నంబర్ టూ గా వెలిగారు. కేసీయార్ తో తేడా రాగానే ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయించి ఆయనపై కేసులు పెట్టించారు కేసీయార్
హుజూరాబాద్ లో ఈటలను ఓడించడానికి కేసీయార్ శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఈటల రాజేందర్ తన కున్న జనాదరణతో కేసీయార్ ఎత్తులను చిత్తు చేసి ఘన విజయం సాధించారు.
హుజూరా బాద్ లో ఈటల విజయం మామూలు విజయం కాదు. అది కేసీయార్ పై ఈటల సాధించిన విజయం. అందులో బిజెపికి వాటా లేదు. అది పూర్తిగా ఈటల విజయమే. ఈ విషయం బిజెపి అగ్రనాయకత్వానికీ తెలుసు. అందుకే అంత బలమైన ఈటల రాజేందర్ ను కేసీయార్ పై పోటికి నిలబెడితే కేసీయార్ ను తేలిగ్గా ఓడించవచ్చునని బిజెపి నాయకత్వం లెక్కలు గట్టినట్లు చెబుతున్నారు. ఒక వేళ నిజంగానే కేసీయార్ వర్సెస్ ఈటల రాజేందర్ పోటీ అనివార్యం అయితే వచ్చే ఎన్నికల్లో గజ్వెల్ నియోజక వర్గంపైనే అందరి దృష్టీ ఉంటుంది.
ఒక్క కేసీయార్ పైనే కాదు కేసీయార్ తనయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ ప్రాతినిథ్యం వహిస్తోన్న సిరిసిల్లా నియోజక వర్గంలోనూ గట్టి పోటీ పెట్టాలని బిజెపి డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నే కేటీయార్ పై బరిలో దింపాలన్నది పార్టీ ఆలోచనే. తన వాగ్దాటితో ప్రత్యర్ధులకు చుక్కలు చూపించడంలో దిట్ట అయిన బండి సంజయ్ కి మంచి జనాదరణ కూడా ఉంది. కేటీయార్ ను ఓడించగల సత్తా కూడా బండి సంజయ్ కి ఉందన్నది బిజెపి అభిప్రాయం. అలాగే మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ఆర్ధికంగా బలమైన కొండా విశ్వేశ్వర రెడ్డిని బరిలో దింపాలని చూస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…