ఈటలపై ఆశలు వదులుకున్నట్లేనా ?

By KTV Telugu On 5 September, 2023
image

KTV TELUGU :-

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పుడు పార్టీకి ఆయన పట్ల ఎన్నో ఆకాంక్షలుండేవి.భారీ స్థాయిలో నేతలను చేర్పించి బీజేపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దుతారన్న విశ్వాసం ఉండేది. కేసీఆర్ ప్రభుత్వాన్ని లాగి కింద పడేసే సత్తా ఈటలకు మాత్రమే ఉందని కూడా ఒక దశలో అధిష్టానం నమ్మింది. అలాంటిది ఇప్పుడు అన్ని విశ్వాసాలు సన్నగిల్లి అధిష్టానమే రంగంలోకి దిగాల్సిన అనివార్యత ఏర్పడింది.

కొంతమంది నేతలపై అతిగా ఆశలు పెట్టుకుంటారు. చివరకు డిసప్పాయింట్ అవుతారు. వారి వల్ల కాదులే అని పెద్దలే రంగంలోకి దిగుతారు. గ్రాస్ రూట్ నుంచి పనులు ప్రారంభిస్తారు. ఇప్పుడు టీబీజేపీలో అదే జరుగుతోంది. స్వామీ నీకో దండం అని ఈటలకు సమస్కారం చేశారు. పార్టీలో చేరికలపై రూటు కూడా మార్చారు.

ఈటల వచ్చినప్పుడు బీజేపీలో అంతా బంగారమే పండుతుందనుకున్నారు. చివరకు వెండి కాదు కదా.. రాగి, ఇత్తడి కూడా పండటం లేదన్న ఫీలింగ్ వచ్చేసింది. జాయినింగ్స్ కమిటీ చైర్మన్ గా ఈటల సాధించిందేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. పెద్ద బృందాన్ని ఖమ్మం తీసుకెళ్లి సుదీర్ఘ చర్చలు జరిపిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. బీజేపీలో చేరిన నిర్మల్ నేత మహేశ్వర్ రెడ్డి ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. కొత్తగా చేరికలు లేవు, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీ మారాలనుకున్న నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారే తప్ప బీజేపీని తలుచుకున్న వాళ్లు లేరు. దానితో ఇప్పుడు ఈటల నాయకత్వంపై బీజేపీ అధిష్టానానికి నమ్మకం పూర్తిగా పోయింది. పైగా బండి సంజయ్ టీబీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈటల అసమ్మతి రాజకీయాలు నడిపి చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నారు.

టీబీజేపీలో జరుగుతున్న తంతు మొత్తాన్ని కాంగ్రెస్ అధిష్టానం సమీక్షించింది. చెప్పుకోదగ్గ నేతలు పార్టీలో చేరిన దాఖలాలు లేవని తేల్చింది. కాంగ్రెస్ లో చేరడానికి రెడీగా ఉన్నప్పుడు బీజేపీలో ఎందుకు చేరడం లేదని తర్కించుకుంది. తెలంగాణలో ట్రెండ్ కాషాయానికి అనుకూలంగా లేదని గుర్తించింది. రాష్ట్రస్ధాయి నేతలను చేర్చుకోవటంపై ప్రయత్నాలు చేయటం అనవసరమని అనుకున్నట్లున్నారు. అదే విషయాన్ని ఈటలకు అర్థమయ్యేట్టు చెప్పినట్లు సమాచారం.

ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకులు, పెద్ద నాయకులు తమకు అవసరం లేదని బీజేపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో చిన్న నాయకులను చేర్చుకుంటే వాళ్లు అంకిత భావంతో పనిచేసి పార్టీని గెలిపిస్తారని బీజేపీ అధిష్టానం లెక్కగడుతోందని చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా వ్యూహాలు రూపొందించేందుకు కూడా ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. పోలింగ్ బూత్ నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ఓటర్లు, ఇతర అంశాలను లెక్కలోకి తీసుకుని…. అక్కడి నాయకుల వివరాలు తీలుసుకుని ఎవరిని చేర్చుకుంటే బావుంటుందో అంచనా వేసుకుని బీజేపీ పెద్దలు ముందుకు సాగుతున్నారు. ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ పూర్తయితే కనీసం 30 నుంచి 40 స్థానాల్లో గెలిచేందుకు ఎర్ర తివాచీ పరుచుకున్నట్లవుతుందని బీజేపీ విశ్వసిస్తోంది.

నిజానికి ఈటలకు బీజేపీ ఆఖరి అవకాశం ఇచ్చిందనే అనుకోవాలి. నియోజకవర్గాల స్థాయి నేతలను ఎంపిక చేసే ప్రక్రియలో ఆయనకు కూడా భాగస్వామ్యం కల్పించింది. ఈ సారి సరైన నాయకులను చేర్చలేకపోతే బీజేపీలో ఆయన ఖేల్ ఖతం అవుతుందని చెప్పక తప్పదు. ఆ సంగతి ఈటల కూడా అర్థం చేసుకుని కొన్ని ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టారు. సెంట్రల్ అథారిటీ కంటే లోకల్ లీడర్ షిప్ బెటరని గుర్తించిన నేపధ్యంలో ఏం జరుగుతుందో చూడాలి..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి