మానవాళికి ముప్పు కాలుష్యం – ఆయువు తగ్గించేస్తోంది !

By KTV Telugu On 5 September, 2023
image

KTV TELUGU :-

మనిషి సగటు ఆయుర్ధాయం ఎంత ?. ఇప్పుడు 65 నుంచి 70 ఏళ్ల వరకూ ఉంది. వైద్య ప్రపంచం ఇంత అభివృద్ధి చెందిన తర్వాత .. చావు అంచుల వరకూ వెళ్లిన వారిని కూడా బతికిస్తున్న ప్రపంచంలోకి వచ్చాక ఈ మాత్రం ఉంది. నిజానికి మనం మరో పదకొండేళ్లు ఎక్కువ బతకాల్సి ఉంటుంది. మన ఆయుర్ధాయంలో పదేళ్ల వరకూ ఉత్తిపుణ్యాన తగ్గిపోతోంది. మన ప్రమేయం లేకుండానే తగ్గిపోతోంది. ఎందుకంటే కాలుష్యం. మనం నిద్ర లేచినప్పటి నుంచి కల్తీ, కాలుష్యాలతో సహవాసం చేస్తున్నారు. అవి మన శరీరాన్ని నిర్వీర్యం చేసి వేగంగా చావు వైపు నడిపిస్తున్నాయి.

రాజధాని నగరం ఢిల్లీతో పాటు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఇటీవల కొన్ని నివేదికలు వెల్లడయ్యాయి. చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌ రూపొందించిన ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ నిలిచింది. కాలుష్య స్థాయి ఇదే మాదిరి కొనసాగితే ఢిల్లీ ప్రజానీకం తమ జీవితకాలంలో 11.9 సంవత్సరాలు కోల్పోతారని హెచ్చరించింది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలను మించిన కాలుష్యంలో దేశంలోని మొత్తం జనాభా మగ్గుతోందని అర్థం.

గత ఏడాది ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా 1650 నగరాల్లో చేసిన అధ్యయనం లోనూ, అదే నెలలో అమెరికాకు చెందిన హెల్త్‌ ఎఫెక్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రపంచంలోని ఏడు వేల నగరాల్లో చేసిన పరిశీలనలోనూ వాయు కాలుష్యంలో ఢిల్లీ నగరమే అగ్రస్థానంలో ఉన్నట్లు తేలింది. దేశంలోని మిగిలిన నగరాల్లోనూ కొంచెం అటుఇటూగా తాజా నివేదికలోని పరిస్థితులే ఉన్నట్లు ఆ ఏడాది, అంతకు ముందు రెండు మూడు సంవత్సరాల్లో చేసిన అధ్యయనాల్లో తేలింది. ఒక అధ్యయనం ప్రకారం ప్రతి ఏటా 20లక్షల మంది ప్రజానీకం వాయు కాలుష్యం కారణంగా వచ్చే వివిధ రకాల వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న వాటిలో వాయు కాలుష్యం ఐదవ స్థానంలో నిలుస్తోంది. డబ్ల్యుహెచ్‌ఓ గణాంకాల ప్రకారం దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా వంటి వాటి కారణంగా చోటుచేసుకుంటున్న మరణాల సంఖ్య మన దేశంలోనే అత్యధికం. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో 50శాతం మంది చిన్నారుల ఊపిరితిత్తులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి.

ప్రస్తుతం ఉన్న కాలుష్య స్థాయిలను చూస్తుంటే, ఉత్తర భారతదేశంలో సుమారు 51 కోట్ల జనాభా ఆయుర్దాయంలో సగటున 7.6 సంవత్సరాలను కోల్పోతున్నారని యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ సూచిస్తోంది. 2013 నుంచి ప్రపంచంలో సుమారు 44 శాతం కాలుష్యం ఒక్క భారతదేశం నుంచే వెలువడుతున్నట్లు పేర్కొంది. ప్రపంచంలోనే కాలుష్యం అధికంగా ఉన్న దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది. ప్రతి క్యూబిక్‌ మీటర్‌కు 40 మైక్రోగాముల కాలుష్యానికి అనుమతి ఇస్తూ మన దేశం రూపొందించుకున్న సొంత నాణ్యతా ప్రమాణాలు సైతం ఆచరణలో వెలవెలబోతున్నాయి. జాతీయ పరిమితి కన్నా అధికంగా కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో దేశంలోని 67.4 శాతం జనాభా జీవనం సాగిస్తోంది. మన మహానగరాలన్నీ వాయు కాలుష్యంతో అతలాకుతలమౌతు న్నాయి. తామెంత ప్రమాదకర పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్నామో ఆ ప్రాంతాలలో నివసించే ప్రజానీకంలో అత్యధిక మందికి కనీస అవగాహన కూడా ఉండటం లేదు. ప్రజానీకానికి పెను ప్రమాదంగా మారుతున్న వాయుకాలుష్యంపై ఈ తరహా హెచ్చరికలు ప్రతీ ఏడాది .. ఇంకా చెప్పాలంటే.. అంతర్జాతీయ సంస్థలు అధ్యయనం చేసినప్పుడల్లా వస్తూనే ఉంటాయి.

దేశ రాజధాని ఢిల్లీ ఇప్పటికే కాలుష్య కారకంగా మారింది. దీపావళి తర్వాత వచ్చే కాలుష్యం వల్ల అక్కడిప్రజలు ఎంత ఆయుర్ధాయం కోల్పోతారో తెలిస్తే చాలా మంది భయపడిపోతారు. కానీ ఇదంతా ఆలోచించే తీరిక… ప్రజలకు లేదు. ఉన్నంతకాలం ఉండాలన్నట్లుగా గడిపేస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య్ పరిస్థితుల్ని చూసి సుప్రీంకోర్టు ‘నరకానికన్నా అధ్వానంగా ఢిల్లీ నగరం తయారైంది’ అని ఓ సార ివ్యాఖ్యానించింది. ‘పేలుడు పదార్థాలు అమర్చి ప్రతి ఒక్కరినీ చంపేయడం మంచిది’ అని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేసారు. అయినా, పాలకులలో పెద్దగా స్పందన రాలేదనడానికి ఆ తరువాత కూడా ఢిల్లీతో పాటు దేశమంతా వాయుకాలుష్యం పెరుగుతూనే ఉన్నాయి. వ్యక్తిగత వాహనాల వినియోగం దేశ వ్యాప్తంగా ఏడాదికేడాదికి పెరుగు తోంది. ఫలితంగా వాయు కాలుష్యం పెద్దఎత్తున పెరుగుతోంది. దీనిని అరి కట్టడానికి సరి,బేసి నంబర్ల వాహనాలను రోజువిడిచి రోజు రోడ్లమీదకు అనుమ తించాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రయత్నం ఫలించలేదు. ఢిల్లీ నగరానికి చుట్టుపక్కల చెట్లు కొట్టి వేయడం, పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్న పరిశ్రమలు కాలుష్యానికి కారణమౌతున్నాయి. పరిశ్రమల్లో కాలుష్యానికి తీసుకోవాల్సిన చర్యలు అమలు కాకపోవడంతో వాయు కాలుష్యంతో పాటు యమునా నది కూడా పెద్దఎత్తున కాలుష్యం బారిన పడుతోంది.

దేశ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి రైతాంగాన్ని, వారు తగలబెడుతున్న గడ్డిని ఈ దుస్థితికి కారణంగా చిత్రీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం. కోవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించిన సంవత్సరా లలో వ్యవసాయం మినహా మిగిలిన అన్ని రంగాలు మూతపడిన సంగతి తెలిసిందే, ఆ సమయంలో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కాలుష్యం తగ్గినట్టు నిర్ధారణ కావడం గమనార్హం. ప్రభుత్వాలకు ప్రజారోగ్యం పట్ల ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్నా ప్రజా రవాణా వ్యవస్థను గణనీయంగా మెరుగు పరచాలి. పరిశ్రమ ల్లోనూ, నిర్మాణ పనుల వద్ద కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలి. అడవు లను పరిరక్షించడంతో పాటు, వీలైన అన్ని ప్రాంతాల్లోనూ చెట్లను పెంచాలి. ఈ తరహా చర్యలే వాయు, జలకాలుష్యాల నుండి ప్రజానీకాన్ని కాపాడుతాయి. లేకపోతే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది.

మనిషి బతకడానికి .. విలాసాల కోసం కాలుష్యం సృష్టిస్తున్నాడు. కానీ కాలుష్యం తమ ఆయుర్ధాయాన్ని క్షీణింప చేస్తుందని తెలిసినా తెలియనట్లే ఉంటున్నాడు. మార్పు వచ్చినప్పుడే మనుషుల ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి