నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన వాళ్లు ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఓసీలకు వచ్చిన గుర్తింపు అధికసంఖ్యాకులైన ఓబీసీలకు ఎందుకు రావడం లేదు. కష్టపడి పనిచేసే తత్వమున్న యాదవులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, పద్మశాలి సామాజిక వర్గాల వారు తెలంగాణలో రాజకీయ హక్కులను ఎందుకు సాధించలేకపోతున్నారు. వాళ్ల పరిస్థితి కూరలో కరివేపాకులా తయారైందా.. పార్టీలు, ముఖ్యంగా కేసీఆర్ వారిని పూర్తిగా అణిచివేశారా….
అందరికీ మంచి చేసినట్లే ఉండాలి. సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసినట్లే కలరింగ్ ఇవ్వాలి. కొత్త స్కీముతో ఊరిస్తూ కనిపించాలి. ఎప్పుడూ చూసినా ప్రకటనలు గుప్పిస్తుండాలి. ఒక పథకం ఇచ్చాం…ఇంకేముంది మరో 99 ప్రవేశపెడితే సెంచూరీ కొట్టినట్లే అని ప్రచారాలు ఉదరగొట్టెయ్యాలి. వాస్తవ పరిస్థితులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా కొనసాగాలి. అదీ ప్రస్తుతం ప్రభుత్వాల తీరు.. అలాంటి గేమ్ ప్లాన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా ఆరితేరారు.. ఆయన అందరి బంధువుగా కనిపిస్తారు. చివరకు ఎవరికీ సిస్టమేటిగ్గా సాయం చేసిన సందర్భమూ భూతద్దం పెట్టి వెదికినా దర్శనం ఇవ్వదు…
కేసీఆర్ కు ఓబీసీలంటే కోపమా.. లేకపోతే ఇలా టికెట్లు ఇవ్వడమేంటీ.. గులాబీ దళపతి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే ప్రతీ ఒక్కరి మదిలో మెదిలిన ప్రశ్న అధి.టికెట్ల బట్వాడాలో సామాజిక న్యాయానికి చోటు ఎక్కడుందన్న ప్రశ్న ఇప్పటికీ తలెత్తుతూనే ఉంది.115 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ రిలీజ్ చేసిన మొదటి జాబితాలోని సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే.. అత్యధికంగా ఓసీ వర్గానికి 58 సీట్లు దక్కాయి. ఈ వర్గం నుంచి ఎంపికైన వారంతా అత్యంత సంపన్నులే కావడం గమనార్హం. ఓసీలకు దక్కిన 58 టికెట్లలో 40 టికెట్లు రెడ్డి వర్గం వారే పొందారు. ఇక బీసీ వర్గానికి కేవలం 22 టికెట్స్ ఇచ్చారు. అయితే ఇందులో అత్యధికంగా 10 సీట్లను ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉన్న మున్నూరు కాపులకు ఇచ్చారు. యాదవులకు ఐదు, గౌడ్స్ కు 4, బెస్తలకు 1, వంజరలకు 1, పద్మశాలీలకు 1 టికెట్ ను కేసీఆర్ కేటాయించారు. 2018తో పోలిస్తే బీసీలకు ఈసారి 2 టికెట్లు ఎక్కువగానే కేటాయించినప్పటికీ.. ముదిరాజ్ లకు అవకాశం కల్పించలేదు.తెలంగాణ జనాభాలో అటు ఇటుగా సగభాగం ఓబీసీలుంటే…అధికార పార్టీ వారికి పదిశాతం సీట్లు కూడా కేటాయించలేదు. ఒక అంచనా ప్రకారం జనరల్ జనాభాలో 23 శాతం ఉండగా, దళుతులు 17 శాతం, గిరిజన-ఆదివాసీలు 11 శాతం, ఓబీసీలు 48 శాతం వరకు ఉంటారు. దాదాపు రెండు కోట్ల మంది బీసీ జనాభా ఉంటే వారిలో ఓబీసీలే ఎక్కువని చెప్పాలి..
ఆ నాలుగు కులాలు అంటే ముదిరాజులు, మున్నూరు కాపులు, యాదవులు, పద్మశాలీలు పూర్తి స్థాయిలో అన్యాయమైపోయారని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ముదిరాజుల జనాభా 60 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తుండగా.. వారిలో ఒక్కరికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీఆర్ఎస్ మంత్రివర్గంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు ముదిరాజులకు మంచి గుర్తింపు వచ్చింది.ఆయన బీజేపీలోకి చేరిపోయిన తర్వాత సీన్ మారింది. ఎందుకనో ముదిరాజులను దూరం పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వస్తున్నారు. ఒక పక్క ఈటల రాజేందర్ మరో పక్క టీటీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నరుక్కుంటూ వస్తున్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత ఎక్కడా తొందరపడినట్లుగా కనిపించడం లేదు. దానితో ఇప్పుడు ముదిరాజులు రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి అధికారపార్టీని ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించి చూపిస్తామని ముదిరాజ్ సంక్షేమ సంఘం సవాలు చేసింది. కనీసం ఐదు స్థానాలు అడిగితే ఒక టికెట్ అయినా ఇవ్వరా అన్నది వారి ప్రశ్న. ఇప్పటికే చాలా స్ట్రాంగ్ అయిన కాంగ్రెస్ పార్టీ వైపునకు ముదిరాజ్ లు చేరితే.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చెందిన చాలా అసెంబ్లీ సీట్లు గల్లంతయ్యే ముప్పు ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముదిరాజులు ఎలాగూ బీఆర్ఎస్, కాంగ్రెస్ వైపుకు వెళ్తున్నందున ఇతర సామాజిక వర్గాల వైపు ఫోకస్ చేస్తే బావుంటుందని కేసీఆర్ ఆలోచించారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.
తెలంగాణలో బాగా వెనుకబడిపోయిన ఓసీబీ కులాల్లో యాదవులు ఒకరిగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 18 శాతం యాదవులు ఉన్నట్లు వాళ్లు చెబుతుంటారు. కేసీఆర్ మాత్రం వారికి ఐదు టికెట్లు మాత్రమే కేటాయించారు. యాదవులు అనగానే గుర్తుకు వచ్చేదీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అని చెప్పక తప్పదు. రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉంటే తలసాని వల్ల తమకు ఎలాంటి ప్రయోజనమూ కలగడం లేదని యాదవులు వాపోతుంటారు. అయితే బీఆర్ఎస్ అధికారానికి వచ్చిన కొత్తల్లోనే ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం మాత్రం యాదవులకు కొంత మేర ప్రయోజనం కలిగించింది. 2017లో సిద్ధపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కొండపాకలో కేసీఆర్ స్వయంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ స్కీమ్ కారణంగా తొలి విడతలోనే 1.25 లక్షల యూనిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం 75 శాతం, లబ్ధిదారులు 25 శాతం భరించే ఈ స్కీముల్లో గొర్రెలు, పొటేళ్లకు బీమా సౌకర్యం కూడా కల్పించారు.రాష్ట్రంలో గొర్రెల సంఖ్య రెండు కోట్లు దాటగా.. సంపద 10 వేల కోట్ల రూపాయల పైమాటేనని చెబుతున్నారు. అయితే తర్వాతి కాలంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం కారణంగా స్కీము కొంత నీరుగారిపోయిందన్న వార్తలు వచ్చాయి.
ఇక ఓబీసీలో మరో సామాజిక వర్గమైన మున్నూరు కాపుల పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. ఆ వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, శాసన మండలి సభ్యుడు దండే విఠల్ లాంటి వాళ్లు ప్రభుత్వం ఏదో చేసేస్తోందని చెప్పినా వారి కోసం అంత గొప్పగా జరిగిందేమీ లేదు. వ్యవసాయంపై ఆధారపడే మున్నూరు కాపులో కోసమే కేసీఆర్ వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని మంత్రులు చెబుతున్నప్పటికీ వారిలో పేదరికం ఎక్కువగా ఉన్న సంగతిని మాత్రం పాలకులు గుర్తించడం లేదు. చేనేతలో బాగా నష్టపోయి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకునే సామాజికవర్గం ఏదైనా ఉందంటే అది పద్మశాలీలనే చెప్పాలి. సిరిసిల్ల నుంచి రాష్ట్రంలో మారుమూల వరకు ఎక్కడైనా పద్మశాలీలు కనిపిస్తారు. తెలంగాణలో వారి జనాభా 17 లక్షల వరకు ఉంటుందని అంచనా వేయగా, ఎనిమిది శాతం ఉంటామని మరికొందరి వాదన. ఎల్. రమణకు ఎమ్మెల్సీ ఇవ్వడం, గుండు సుధారాణిని వరంగల్ మేయర్ చేయడం లాంటి చర్యల ద్వారా పద్మశాలీలను రాజకీయంగా ప్రోత్సహిస్తున్నామని బీఆర్ఎస్ చెబుతున్నప్పటికీ వారి జనాభాకు వచ్చే అవకాశాలకు పొంతన లేదు. టెక్స్ టైల్స్ రంగాన్ని కేంద్రం విస్మరించినా… రాష్ట్ర ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకుంటోందని బీఆర్ఎస్ అంటోంది. తమకు ఆరు అసెంబ్లీ స్థానాలు , రెండు లోక్ సభా స్థానాలు కావాలని పద్మశాలీ నేతలు కోరుతుండగా, ఈ సారి కేవలం బీఆర్ఎస్లో కేవలం ఒక్క ఎమ్మెల్యే టికెట్ దక్కింది. దానితో పద్మశాలీలు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.
దశాబ్దాల తరబడి వివక్షకు లోనైనా ఓబీసీ సామాజిక వర్గాలను సంతృప్తి పరిచే ప్రకటనలు లేకపోతే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కష్టకాలమేనని చెప్పాలి. ఇప్పటికే బంజారా భవన్, బ్రహ్మణ భవన్ తరహాలో వెనుకబడిన ప్రతీ కులానికి ఓ భవన్ నిర్మించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి 56 కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లే.. తెలంగాణలోనూ బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ తరహాలో ప్రతీ వెనుకబడిన కులానికి ఒక కార్పొరేషన్ కావాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి వినతిపత్రం అందజేశారు. ఆయా కులాల్లో విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్స్ నిర్మించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ ఒక భవన్ ఉండాలని మున్నూరు కాపు సంఘం కోరుతోంది. ఇక చేనేత జౌళి శాఖను పునరుద్దరించాలని పద్మశాలీలు కోరుతున్నారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి తమ వ్యవస్థను బలోపేతం చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. పద్మశాలీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ వృత్తుల్లో కొనసాగుతున్న 90 శాతం మందికి ఉపాధి, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో నోటాకు ఓటేస్తామని పద్మశాలీలు హెచ్చరిస్తున్నారు. ప్రతీ కుల కార్పొరేషన్ కు కనిష్టంగా పది వేల కోట్ల రూపాయలు కేటాయించాలన్న డిమాండ్ తాజాగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లే గానీ, బీసీ, ఓబీసీ ఓట్లు తగ్గిపోతాయన్న వాదన నడుమ దాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…