ఎలక్షన్లు లేకపోతే వ్యాపారాలు ఎలా ? – ఈ సమస్య ఆలోచించారా ?

By KTV Telugu On 6 September, 2023
image

KTV TELUGU :-

దేశమంతా ఇప్పుడు జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. దేశానికి జమిలి మంచిదో కాదో చర్చిస్తున్నారు. వరుసగా రెండేళ్లకో సారి ఎన్నికలు జరగడం వల్ల చాలా ఖర్చుయిపోతుందని వాదన ప్రముఖంగా వినిపిస్తున్నారు. నిజానికి ఖర్చు అనేది చేస్తేనే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి అయ్యే ఖర్చునే చూపిస్తున్నారు. కానీ ఎన్నికలు జరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ భారీగా పుంజుకుంటుంది. పార్టీలు పెట్టే ఖర్చు వేల కోట్లలోనే ఉంటాయి. అవన్నీ సర్క్యూలేషన్ లోకి వస్తాయి. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిగితే.. ఆ డబ్బంతా ఓ మూలకు చేరిపోతుంది. ఈ సమస్యను ఇంత వరకూ ఎవరూ చర్చించడం లేదు.

ఖర్చు కారణంగా జమిలీ ఎన్నికలు పెడతాం అనే వాదన పూర్తి డొల్ల. ప్రజాస్వామ్యంగా.. రాజ్యాంగ హక్కుగా నిర్వహించాల్సిన ఎన్నికలను నిర్వహించడం ఖర్చు అయితే.. ఐదేళ్లకు ఎందుకు.. పదేళ్లకో.. ఇరవైఏళ్లకో ఒకసారి ఎన్నికలు జరుపుకుంటే ఇంకా ఖర్చు మిగులుతుంది. భారదేశంలో ఎన్నికల నిర్వహణకు అధికార అంచనాల ప్రకారం ఖర్చు పదివేల కోట్లు. పార్లమెంట్, అసెంబ్లీలకు అన్నింటికి ఎన్నికలు నిర్వహించాడనికి అయ్యే ఖర్చు ఇది సగటున ఏడాదికి రెండు వేల కోట్లు అనుకోవచ్చు. ప్రజాస్వామ్యం కోసం.. ఆ మాత్రం ఖర్చు పెట్టలేమా ? ఓ రాష్ట్ర ప్రభుత్వం రంగుల కోసం చేసే దుబారా అంత కూడా లేదు ఈ మొత్తం. ఓ ప్రభుత్వం ప్రకటనలకు వెచ్చించేదాంట్లో సగం కూడా ఉండదు ఈ మొత్తం. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లన్నీ కలిపితే.. 30 నుంచి 35 లక్షల కోట్లు దాటిపోతుంది. 35 లక్షల కోట్లు ప్రభుత్వాలు ఖర్చు పెడుతూంటే.. ప్రజాస్వామ్యం కోసం..అందులో ఒక్క శాతం కూడా ఖర్చు పెట్టలేమా ?

వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కు ప్రధాన కారణంగా కేంద్రం… చూపిస్తున్న అంశం… ఎన్నికల ఖర్చు. పది వేల కోట్లు ఖర్చయిపోతున్నాయని.. పదే పదే ఎన్నికలతో పాలనకు ఆటంకాలు వస్తున్నాయని చెబుతోంది. అభివృద్ధి పనులు జరగడం లేదని కేంద్రం వాదన. కానీ నిశితంగా పరిశీలిస్తే ఎన్నికల వల్ల సమాజానికి.. దేశానికి ఎంతో మేలు జరుగుతోంది. ఎన్నికలు లేకపోతే.. చాలా వరకూ నష్టపోయే వ్యాపారాలు ఉన్నాయి. ఒక్క సారి ఆలోచిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చానుకుందాం..ఇక్కడ అయ్యే ఖర్చు ప్రభుత్వానికి అయ్యే ఖర్చు మాత్రమేనా ?. అది అసలు లెక్కలోకి రాదు. మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని నిలబడతాయి. పార్టీ పరంగా ఖర్చు పెడతాయి. హెలికాఫ్టర్లర దగ్గర నుంచి ప్రచార సామాగ్రి వరకూ కోట్లలోనే ఖర్చు పెడతాయి. దీని వల్ల ప్రతి ఒక్క వ్యాపార వర్గానికి బెనిఫిట్ ఉంటుంది. ఇక అభ్యర్థుల వరకూ వస్తే..ఇక విచ్చలవిడిగా వారు చేసే ఖర్చు గురించి చెప్పాల్సిన పని లేదు. పార్టీ కార్యకర్తల్ని రెండు, మూడు నెలల పాటు చూసుకోవాలి. ఇందుకు కోట్లలో ఖర్చు అవుతుంది. ఒక్క మునుగోడు నియోజకవర్గంలో కనీసం వెయ్యి కోట్ల రూపాయలు అభ్యర్థులు, పార్టీలు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాయి. ప్రభుత్వం అధికారికంగా పథకాల పేరుతో పంచి పెట్టేవి వేరే లెక్క. లెక్కలోకి రాకుండా… అభ్యర్థులు చేసిన ఖర్చు వెయ్యి కోట్లకుపైగానే ఉంటుంి.

ఒక్క సారి ఎన్నికలు వస్తున్నాయంటే… ఎన్నో వ్యాపారాలు యాక్టివ్ అవుతాయి. డిజిటల్ మీడియా దగ్గర నుంచి జెండాలు తయారు చేసే వరకూ.. అలాగే.. అడ్డాకూలీల వరకూ అందరికీ పని లభిస్తుంది. ఎలక్షన్లు వస్తే.. నిరుపేదలకూ అది సీజనే. ఓ రకంగా పెద్ద ఎత్తున వ్యాపారాలు.. ఆర్థిక వ్యవహారాలు జరగడానికి ఎన్నికలు కారణం అవుతాయి. ఇటీవలి కాలంలో ఎన్నికల కోసం పనిచేసే వ్యవస్థ విస్తృతం అయింది. ఓ రకంగా పరిశ్రమలాగా మారింది. ఐదేళ్లకోసారి మాత్రమే ఎన్నికలంటే వాటి పరిస్థితి ఏం కావాలి ? మన దేశంలో వనరుల దోపిడీ ద్వారా… ప్రజలను దోపిడీ చేయడం ద్వారా.. అవినీతి ద్వారా రాజకీయ నేతలు వెనకేస్తున్న సొమ్ములు లక్షల కోట్లలోనే ఉంటాయి. చాలా మంది రాజకీయ నేతలు తాము అవినీతి పరంగా సంపాదించి… ఎన్నికల్లో ఖర్చు పెడుతూంటారు . ఏదో ఓ సందర్భంలో రావడం వల్ల తమ అవినీతి సొమ్మును ఖర్చు చేస్తూంటారు. అదే ఎలాంటి ఖర్చు అవసరం లేకపోతే దాచి పెట్టుకుంటారు కానీ…. అవినీతి చేయడం ఆపేయరు. ఎందుకంటే… మన రాజకీయ నేతల్లో దోచుకోని వారు అంటూ ఎవరూ లేరు. కానీ కొంత మంది రాజకీయ అవినీతి చేసి రాజకయానికే ఖర్చు చేస్తారు. కొంత మంది వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటారు. ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకపోతే అందరూ దాచుకుంటారు. నిజానికి దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ వల్లే అయ్యే ఖర్చు పది వేల కోట్లు మాత్రమే . అది ప్రభుత్వం పెట్టే ఖర్చు . కానీ రాజకీయ పార్టీలు పెట్టే ఖర్చు దానికి కొన్ని వందలరెట్లు ఉంటుంది. ఒక్క తెలంగాణ లేదా ఏపీ రాష్ట్రంలోనే రాజకీయ పార్టీలు అనధికారికంగా పెట్టే ఖర్చు వేల కోట్లలోనే ఉంటుంది. అభ్యర్థులందరూ ఓట్లు కొనేందుకూ డబ్బులు ఉపయోగిస్తారు. వరుసగా ఏదో ఓ ఎన్నిక రాకపోతే ఈ డబ్బులన్నీ గుప్తంగా ఉండిపోతాయి.

ఎన్నికలకు ఏడాది మందు నుంచే ఎన్నికల కేంద్రంగా రాజకీయ పార్టీలు చేసే ఖర్చు ప్రారంభమవుతుంది. అంటే వారి అవినీతి సొమ్ము ఆర్థిక వ్యవస్థలోకి రావడం ప్రారంభమవుతుంది. ఎలాగోలా ప్రజల వద్దకు చేరుతుందన్నమాట. ఎన్నికలే లేకపోతే.. మరి ఇదంతా ఎలా సాధ్యం ?

జమిలీ ఎన్నికల వల్ల సమయం వృధా, కోడ్ వస్తుంది.. అభివృద్ధి చేయలేం.. అనే మాటలన్నీ.. అవాస్తవాలే. ఎన్నికల వేడి పెరగిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఊపు వస్తుందని మనం గమనిస్తాం. ఎన్నికలు వస్తే ప్రతి ఒక్క వర్గానికి ఉపాధి లభిస్తుంది. అది ప్రత్యక్షంగా ఉండానేమీ లేదు .. పరోక్షంగా కూడా ఉపాధి లభిస్తుంది. ఇప్పుడు కూడా ఉదాహారణగా తెలంగాణను చూద్దాం. గత ఆరు నెలలుగా తెలంగాణలో రాజకీయం జోరుగా ఉంది. మీడియా ప్రకటనలు దగ్గర్నుంచి పార్టీ నేతల ర్యాలీలు.. వేడుకలు.. ఇలా ప్రతి అంశంలోనూ విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. అది బీఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు అన్ని పార్టీల నేతలూ చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయం ఎంత ఖరీదైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఎంత ఖరీదు చేసుకున్నా.. ఆ ఖర్చు అంతా ప్రజల్లోకి.. ఆర్థిక వ్యవస్థలోకి వస్తుంది. అందుకే ఆ ఖర్చు దేశానికి నష్టం చేస్తుందని మాత్రం చెప్పలేం. పది మందికి ఉపాధి లభిస్తే అది ఖచ్చితంగా అభివృద్దే్ అవుతుంది. మన దేశంలో ఎన్నికలను కూడా అదే కోణంలో చూడాల్సి ఉంటుంది.

ఎన్నికలు లేకపోతే రాజకీయ అవినీతి తగ్గుతుందని అనుకోలేం. ఎందుకంటే.. రాజకీయం అంటే సంపాదించుకోవడం అన్నట్లుగా మారిపోయింది. మనిషికి ఆశ ఉండదు. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వారు వేలకోట్లు సంపాదించుకున్నారనే ఆరోపణలు వస్తూ ఉంటాయి. నిజంగా కళ్ల ముందు వారి అక్రమ సంపాదన ఉన్నా మన వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయి. అధికారంలోకి వచ్చే వరకూ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు.. అధికారంలోకి వచ్చాక.. వేల కోట్లకు అధిపతి అవుతున్నారు. ఇలాంటి అవినీతి కళ్ల ముందు కనిపిస్తున్నా.. శిక్షించలేం. కానీ.. వారు సంపాదించినది మళ్లీ ప్రజల్లోకి … వ్యవస్థలోకి వచ్చేలా చేసేది మాత్రం ఎన్నికలే. ఎన్నికలే లేకపోతే ఈ సంపద అంతా వారి వద్ద పోగుపడి పోతుంది.

ఆర్థిక వ్యవస్థ గురించి నిశితంగా పరిశీలిస్తే.. డబ్బులు ఖర్చు పెట్టే వారు అంటే వినియోగశక్తి ఎక్కువ ఉన్న వారు.. చేసే ఖర్చు వల్లే ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుంది. పెట్టె ప్రతిఖర్చులో కొంత భాగం ప్రభుత్వానికి చేరుతుంది. అంతే కానీ ఆ సొమ్ము నిర్వీర్యం అయిపోదు దీన్ని గుర్తించిన ఎవరూ ఎన్నికలు నిర్వహించడం ఖర్చు దండగ అనరు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించలేరు.. కానీ అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును రాజకీయ నేతలద్వారానే ప్రజల్లోకి తెప్పించే అవకాశాన్ని ఎన్నికలు ఇస్తాయి. ఇప్పుడు అన్ని రకాల ఎన్నికలను.. ఒకేసారి నిర్వహించడం ద్వారా.. బోలెడంత అభివృద్ధి చేస్తామని.. వందల కోట్లు మిగిలిస్తామని చెప్పేవారంతా ఆర్థిక శాస్త్రంపై సరైన అవగాహన లేని వారే అనుకోవచ్చు.

రాజకీయ అవినీతిని అంతమొందించి పాలకులు.. తమకు డబ్బు సంపాదన ముఖ్యం కాదనుకున్న రోజున జమిలీ అద్భుతమైన ఆలోచన. ఇప్పటి రాజకీయానికి సూట్ కాదు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి