ఐటీ నోటీసులు బాబు మెడకి చుట్టుకుంటాయా

By KTV Telugu On 7 September, 2023
image

KTV TELUGU :-

ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి కేంద్రంలోని ఐటీ శాఖ అధికారులు పంపిన నోటీసులు రాజకీయ రచ్చ రాజేస్తున్నాయి. తమ రాజకీయ ప్రత్యర్ధి అవినీతికి సంబంధించి సూది మొనంత ఆధారం దొరికినా రాజకీయ పార్టీలు పండగ చేసుకోవడం సహజం. అటువంటిది ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు నాయుడు తన ఖాతాలకు మళ్లించుకున్నారంటూ ఆధారాలతో సహా నోటీసులు పంపడంతో ఏపీలో పాలక పక్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు బాబుపై నిప్పులు చెరుగుతున్నారు.

కొన్నేళ్ల క్రితం కేంద్ర ఐటీ శాఖ అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పి.ఏ. పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఆ సోదాల్లో రెండు వేల కోట్ల రూపాయల మేరకు అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఆ మేరకు పత్రికా ప్రకటిన కూడా విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఆ కేసు గురించి ఎవరూ మాట్లాడలేదు. తాజాగా ఆ కేసులోనే చంద్రబాబు పిఏ ఇచ్చిన వివరణతో ఐటీ అధికారులు ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజీ కంపెనీలో విచారణ జరిపితే డొంకంతా కదిలిందని అంటున్నారు. చంద్రబాబు నాయుడి పిఏ బెదిరింపుల మేరకే తాము డొల్ల కంపెనీల ద్వారా తప్పుడు ఇన్ వాయిస్ ల ద్వారా 118 కోట్లకు పైగా నిధులను చంద్రబాబు కు పంపించినట్లు పల్లోంజీ ప్రతినిథి ఐటీ విచారణలో ఒప్పుకునన్నారు.

ఆ క్రమంలోనే ఐటీ శాఖ చంద్రబాబు నాయుడుకు ఏడాది క్రితమే నోటీసులు పంపింది. దానికి చంద్రబాబు నాయుడు మూడు సార్లు లేఖలు కూడా రాశారట. ఆలేఖల్లో చంద్రబాబు నాయుడు తనకు ఐటీ శాఖ కేంద్ర కార్యాలయం నుండి నోటీసులు వచ్చాయని..కానీ తన కేసు ఆ పరిధిలోనిది కాదని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో కథనం వచ్చింది. చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ అధికారులు తిప్పికొట్టారని కూడా ఆ కథనంలో పేర్కొన్నారు. ఆంగ్ల దిన పత్రికలో ఈ కథనం వచ్చే వరకు ఆయనకు ఐటీ నోటీసులు వచ్చిన సంగతి ఎవ్వరికీ తెలీదు. ఇపుడు అది కాస్తా బట్టబయలైపోవడంతో దీనిపై వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది.

చిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు కేంద్రంలోని బిజెపితో పొత్తుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని రాష్ట్ర పతి భవన్ లో టిడిపి వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీయార్ పేరిట వందరూపాయల నాణేన్ని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పక్కనే కూర్చున్నారు. అప్పుడే చంద్రబాబు నడ్డా వైపు వంగి కొద్ది సేపు మంతనాలు చేశారు. బిజెపి-టిడిపిల మధ్య పొత్తు గురించే చంద్రబాబు మాట్లాడారని ప్రచారం జరిగింది. నడ్డాతో బాబు మాట్లాడుతోన్న ఫోటో విడుదలపైనా దుమారం రేగింది. రాష్ట్రపతి భవన్ లో ఎవరి కెమెరాలనూ అనుమతించారు.

అయితే బిజెపిలో చేరిన టిడిపి ఎంపీ సిఎం రమేషే తన కెమెరాను ఎవరికో ఇచ్చి ఆ ఫోటో తీయించినట్లు..దాన్ని మీడియాకు కూడా ఆయనే లీక్ చేసినట్లు సిఎం రమేషే ఓ టీవీ డిబేట్ లో ఒప్పుకున్నారు. ఇది జరిగిన తర్వాతనే చంద్రబాబు కు ఐటీ నోటీసులు ఇచ్చిన ఉదంతంపై హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో కథనం వచ్చింది. సిఎం రమేష్ ద్వారా చంద్రబాబు నాయుడు నడ్డాతో కూర్చున్న ఫోటో లీక్ చేయించడం పట్ల ఆగ్రహంతో ఉన్న కొందరు బిజెపి నేతలే చంద్రబాబుకు ఐటీ నోటీసులు పంపిన కథనాన్ని సదరు ఆంగ్లపత్రికలో వచ్చేలా చేశారని ప్రచారం జరుగుతోంది

చంద్రబాబు నాయుడు 118 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తన ఖాతాలకు రప్పించుకున్నట్లు ఆధారాలతో సహా ఐటీ అధికారులు బట్టబయలు చేశారు కాబట్టి దీనిపై ఈడీ దర్యాప్తు చేయించాలని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఐటీ నోటీసులపై ఇంత రచ్చ జరుగుతోంటే చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండడం పై పాలక పక్షం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏ తప్పూ చేయకపోతే చంద్రబాబు నాయుడు తనకి ఐటీ నోటీసులు ఇచ్చారంటూ కథనం ప్రచురించిన పత్రికపై పరువునష్టం దావా ఎందుకు వేయలేదో చెప్పాలంటూ పాలక పక్షం పట్టుబడుతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి