హైద‌రాబాద్ లో కాంగ్రెస్ అస‌లు వ్యూహం అదే

By KTV Telugu On 7 September, 2023
image

KTV TELUGU :-

కాంగ్రెస్ పార్టీలో అత్యున్న‌త నిర్ణాయ‌క సంస్థ అయిన కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశాల‌కు హైద‌రాబాద్ వేదిక కానుంది. ఈ నెల 16,17 తేదీల్లో జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశాలకు పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గేతో పాటు అగ్ర‌నేత‌లు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు పాల్గొంటారు. పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో నిర్వ‌హించ‌కుండా అధికారంలో లేని తెలంగాణాలో ఈ స‌మావేశాలు నిర్వ‌హించ‌డం వెనుక పార్టీ నాయ‌క‌త్వం వ్యూహం ఉంద‌ని అంటున్నారు. దేశం న‌లుమూల‌ల నుండి కాంగ్రెస్ దిగ్గ‌జ నేత‌లంతా కూడా ఈ స‌మావేశాల‌కు త‌ర‌లి వ‌స్తారు.

కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశాలు హైద‌రాబాద్ లో నిర్వ‌హించ‌డం ద్వారా తెలంగాణా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేయాల‌న్న‌ది పార్టీ వ్యూహ‌క‌ర్త‌ల ఆలోచ‌న‌గా చెబుతున్నారు. మ‌రో రెండు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న తెలంగాణాలో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశ‌నం చేయ‌డానికి కూడా ఈ స‌మావేశాలు దోహ‌ద ప‌డ‌తాయ‌ని భావిస్తున్నారు. స‌మావేశాల‌కు వ‌చ్చే సీనియ‌ర నేత‌లు తెలంగాణా కాంగ్రెస్ నేత‌ల‌తో స‌మాలోచ‌న‌లు జ‌రిపి ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల గురించి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇవ్వ‌నున్నార‌ని అంటున్నారు.పార్టీ విజ‌యానికి ఇది దోహ‌ద ప‌డుతుంద‌న్న‌ది అధిష్ఠానం ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశాల‌తో పాటు తెలంగాణా విలీన దినోత్స‌వ వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని పార్టీ భావిస్తోంది. ఈ సంద‌ర్భంగా భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేస్తారు. ఈ స‌భ‌లో సోనియా గాంధీ తెలంగాణా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తారు. ఈ ప్ర‌సంగం భావోద్వేగాల‌తో కూడుకుని ఉండేలా రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నిజం చేస్తూ ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవ‌కాశం ఇవ్వ‌లేరా? అని ప్ర‌జ‌ల్లో సెంటిమెంట్ రాజేసే విధంగా సోనియా గాంధీ విజ్ఞ‌ప్తి చేస్తార‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ ప‌ట్ల సానుభూతి పెల్లుబికేలా సోనియా ప్ర‌సంగం ఉంటుంద‌ని అంటున్నారు.

దీంతో పాటు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ నేత ప‌ర్య‌టించేలా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. కాంగ్రెస్ సీఎంలు, మంత్రులు మొద‌లుకుని సీనియ‌ర్ నేత‌లు ఒక్కో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించి..కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమ‌లవుతున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రిస్తారు. త‌ద్వారా తెలంగాణ‌లో త‌ప్ప
దేశంలో ఎక్క‌డ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు కావ‌డం లేన్న గులాబి నేత‌ల ప్ర‌చారానికి చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని కాంగ్రెస్ భావిస్తోంది. రాజస్థాన్, చ‌త్తీస్ ఘడ్, క‌ర్నాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లలో కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు వివరించనున్నారు.

రాష్ట్రాల ఆర్ధిక ప‌రిస్దితులు, అక్క‌డి అవ‌స‌రాల‌కు అనుగుణంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు సంక్షేమ ప‌థ‌కాలను అమ‌లు చేస్తున్నాయ‌న్న‌ విష‌యాన్ని తెలంగాణ‌లో ప్ర‌చారం చేస్తే..ప్ర‌జ‌లు కాంగ్రెస్ ను ఆద‌రిస్తార‌న్న న‌మ్మ‌కంతో కాంగ్రెస్ ఉంది. దీంతో పాటు పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం అంతా తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తే..తెలంగాణ కాంగ్రెస్ కు అధిక ప్రధాన్య‌తనిస్తుంద‌న్న సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్తాయ‌ని ..త‌ద్వారా కాంగ్రెస్సంప్ర‌దాయ ఓటర్లు కాంగ్రెస్ వైపు తిరిగి వ‌స్తార‌ని భావిస్తున్నారు.ఎన్నిక‌ల ఉన్న ప్ర‌తి రాష్ట్రంలో బీజేపీ ఈ వ్యూహ‌న్ని అమ‌లు చేసి ల‌బ్ది పొందుతున్న‌ట్లుగానే..పార్టీ ముఖ్యులంద‌రిని ఏక‌కాలంలో తెలంగాణ‌లో ప‌ర్య‌టింప చేయ‌డం ద్వారా ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం కాంగ్రెస్ అనుకూలంగా మారుతుంద‌ని న‌మ్ముతున్నారు. అందుకే కాంగ్రెస్ అత్యున్న‌త నిర్ణాయ‌క మండ‌లి అయిన CWC స‌మావేశాలను హైద‌రాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు.

పార్ల‌మెంటు స‌మావేశాల నేప‌థ్యంలో తేదిల్లో స్వ‌ల్ప మార్పులు జరిగినా సెప్టెంబ‌ర్ మూడో వారంలో CWC స‌మావేశాలు హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.
సమావేశాలను వచ్చే ఎన్నికలకు వాడుకునేందుకు టీ కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.ముఖ్యంగా పార్టీ మ్యానిఫెస్టో ను బాగా ప్రచారం చేయాలని చూస్తున్నారు.. సోనియా గాంధీ చేతుల మీదుగా మ్యానిఫెస్టో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.. మొత్తానికి సీడబ్ల్యూసీ సమావేశాలను తెలంగాణ ఎన్నికల కోసం అన్ని రకాలుగా వాడుకునేందుకు టీ కాంగ్రెస్ సిద్దమయింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి