లగడపాటి రాజగోపాల్ మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన రాజకీయ సన్యాసం నుంచి బయటకు వస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి వెళ్లినా లాభం లేదనుకున్న లగడపాటి రాజగోపాల్.. ఇప్పుడు కొత్త పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ముహుర్తమే మిగిలిందన్న చర్చ జరుగుతోంది. రాజకీయాలు అలవాటైన వాళ్లు అంత తొందరగా వదిలిపెట్టలేరంటారు. అందులోనూ పదవును అనుభవించిన వాళ్లు, ఎక్కువ కాలం లైమ్ లైట్లో ఉన్న వాళ్లు ఖాళీగా ఉండలేరంటారు. లగడపాటి రాజగోపాల్ పరిస్థితి కూడా అదే. దాదాపు పదేళ్లు ఇంటికే పరిమితమైన విజయవాడ మాజీ ఎంపీ మళ్లీ రాజకీయాల్లోకి లెగ్గు పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. అందుకు కమలనాథులు కండువా పట్టుకుని రెడీగా ఉన్నారట.. పర్వతనేని ఉపేంద్ర అల్లుడైన లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ తరపున 2004,2009లో విజయవాడ ఎంపీగా సేవలందించారు. రాష్ట్ర విభజనపై లోక్ సభలో చర్చ సందర్భంగా ఆయన పెప్పర్ స్ప్రే కొట్టి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. తర్వాత రాజకీయ సన్యాసం ప్రకటించారు. అయితే రెండు మూడు సంవత్సరాలుగా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ జరుగుతోంది. టీడీపీలో చేరతారని, చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారని కూడా చెప్పుకున్నారు. అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకున్నందున అలాంటి ఉద్దేశం లేదని చెప్పుకున్న లగడపాటి ఇప్పుడు మాత్రం మనసు మార్చుకున్నట్లుగా ఉంది. లగడపాటిని బీజేపీలో చేర్చేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కిరణ్ కుమార్ రెడ్డి పావులు కదిపినట్లు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి లగడపాటికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీలో చేరిన అతి కొద్దిరోజుల్లోనే కిరణ్ రెడ్డికి పార్టీ అధిష్టానం మంచి ప్రాధాన్యమిచ్చింది. కమలం గూటికి చేరితే బాగుంటుందని కిరణ్ స్వయంగా లగడపాటిని ఆహ్వానించినట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆయనకు ఆ పార్టీ నుంచి ఆహ్వానం వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒకటికి రెండు సార్లు అగ్రనేతలతో సమావేశం అయినట్లుగా చెబుతున్నారు. పొత్తులు ఇతర పరిణామాలపై కొలిక్కి వచ్చాక ఆయన బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి. లగడపాటి తన అనుచరులతో కలిసి త్వరలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించబోతున్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత కాషాయ కండువా కప్పుకోబోతున్నారు…
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా విజయవాడ ఎంపీ అభ్యర్థిపై అయోమయ స్థితి ఉంది. ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు పట్ల చంద్రబాబు అసహనంగా ఉన్నారు. నాని కూడా టీడీపీలో ఉండాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని నాని చెప్పుకుంటున్నారు. దానితో నానిని పక్కన పెట్టి బీజేపీకి టికెట్ కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. అలాంటప్పుడు బీజేపీ అభ్యర్థిగా లగడపాటి పోటీ చేస్తే మద్దతిచ్చేందుకు చంద్రబాబుకు ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. పైగా బీజేపీ కూడా చౌదరి సామాజికవర్గాన్ని దగ్గరకు చేర్చుకునే పనిలో బిజీగా ఉంది. కమ్మ, రెడ్డి, కాపు సోషల్ ఇంజనీరింగ్ పై దృష్టి పెట్టింది. అది సక్సెస్ ఫార్ములా అని బీజేపీ విశ్వసిస్తోంది. అందుకే పార్టీ పెద్దలు గెలుపు గుర్రాల వైపు చూస్తున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…