ఒకే రోజు రెండు పొలిటికల్ మూవీస్

By KTV Telugu On 11 September, 2023
image

KTV TELUGU :-

కాంగ్రెస్ -భారతీయ జనతా పార్టీలు హైదరాబాద్ వేదికగా బలపరీక్షకు రెడీ అవుతున్నాయి. రెండు జాతీయ పార్టీలూ ఒకే రోజున హైదరాబాద్ లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. ఈ సభల ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు తమ తమ పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు ప్రత్యర్ధి పార్టీలపై నిప్పులు చెరగడమే అజెండాగా రెండు పార్టీలూ కత్తులు నూరుకుంటున్నాయి. డిసెంబరులో ఎన్నికలు జరగనున్న తెలంగాణాలో అధికారం కోసం పాలక బి.ఆర్.ఎస్.తో పాటు కాంగ్రెస్, బిజెపిలు కూడా పోటీలు పడుతున్నాయి. అధికారం తమదంటే తమదంటూ ధీమాలు వ్యక్తం చేస్తున్నాయి. రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలే బహిరంగ సభల్లో మాటల తూటాలు సంధించనున్నారు.సెప్టెంబరు 16,17 తేదీల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు( సోనియా, ఖర్గే,రాహుల్)
సెప్టెంబరు 17న తుక్కుగూడలో సోనియా గాంధీ సారధ్యంలో బహిరంగ సభ(సోనియా)
సెప్టెంబరు 17నే పరేడ్ గ్రౌండ్స్ లో అమిత్ షా అధ్యక్షతన బహిరంగ సభ( అమిత్ షా)
బి.ఆర్.ఎస్. పై మాటల తూటాలు సంధించనున్న సోనియా, అమిత్ షా( సోనియా/అమిత్ షా)
ఈ నెల 16,17 తేదీల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వీటికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ,కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు తరలి వస్తారు. రెండు రోజుల వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పార్టీకి దిశానిర్దేశనం చేస్తారు. సమావేశాల ముగింపు రోజు అయిన సెప్టెంబరు 17న తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. నిజానికి ఈ సభను సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో పెట్టాలనుకున్నారు. కానీ దానికి అనుమతులు రాకపోవడంతో తుక్కుగూడకు మార్చారు.కాంగ్రెస్ నాయకత్వం భారీ బహిరంగ సభ నిర్వహించాలనుకున్న సెప్టెంబరు 17నే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కూడా హైదరాబాద్ వేదికగానే హడావిడి చేసేయాలని డిసైడ్ అయ్యింది. తెలంగాణా విమోచన దినోత్సవాల పేరిట సెప్టెంబరు 17న వివిధ కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం భారీ బహిరంగ సభను నిర్వహించాలని బిజెపి నిర్ణయించుకుంది. కొంతకాలంగా తెలంగాణాలో వెనకబడి డీలా పడి ఉన్న బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు రానున్న ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు వారికి దిశానిర్దేశనం చేయడమే లక్ష్యంగా బహిరంగ సభను నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ముఖ్యఅతిథిగా విచ్చేస్తారు. నాలుగు కోట్ల తెలంగాణా ప్రజల సొంత రాష్ట్రం కలను సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ప్రజలకు గుర్తు చేయడంతో పాటు వరుసగా రెండు ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. కు పట్టం కట్టిన తెలంగాణా ప్రజలు కనీసం ఈ సారి అయినా తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని సోనియా గాంధీ అప్పీల్ చేయబోతున్నారు. బహిరంగ సభలో సోనియా చేయబోయే ప్రసంగం ఆద్యంతో భావోద్వేగాలతో కూడి ఉంటుందని పది కాలాల పాటు తెలంగాణా ప్రజలు గుర్తుచుకునేలా ఉంటుందని అంటున్నారు.ఇక బిజెపి నిర్వహించబోయే కార్యక్రమాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు. నిజాంల నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ కు విమోచన కల్పించింది సర్దార్ వల్లభాయ్ పటేలేనని అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేయనున్నారు. పటేల్ వారసత్వాన్ని అంది పుచ్చుకున్న భారతీయ జనతాపార్టీకి అధికారం కట్టబెట్టాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. తెలంగాణా రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడంలో కేంద్రంలో నాడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి కీలక పాత్ర పోషించిందని..సుష్మా స్వరాజ్ తెలంగాణా ప్రజల వాణిని పార్లమెంటులో వినిపించారని అమిత్ షా వివరించనున్నారు.అమిత్ షా బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ సభకు పరేడ్ గ్రౌండ్స్ ను ఇవ్వడానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నిరాకరించిందని ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ సభను అడ్డుకోవడం కోసం తాము పరేడ్ గ్రౌండ్స్ ను అడ్డుకోలేదని.. సెప్టెంబరు 17న పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభ అనేది చాలా నెలల క్రితమే తాము నిర్ణయించుకున్నామని బిజెపి నేతలు అంటున్నారు. ఇటు సోనియా గాంధీ, అటు అమిత్ షా ఇద్దరూ కూడా తెలంగాణాలో అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్. ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టేలా ప్రసంగాలు చేయడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి