తిరుమల కొండా ? చిరుతల కొండా ?

By KTV Telugu On 11 September, 2023
image

KTV TELUGU :-

రోజూ లక్ష మంది వచ్చే పవిత్ర పుణ్యక్షేత్రం అది. అందులోనూ సగం మంది శేషాచలం అడవిలోని నడకమార్గం గుండా వస్తుంటే.. వారిని  చిరుతలు పలుకరిస్తున్నాయి. ఎన్ని చిక్కాయి.. ఇంకా చిక్కాల్సినవి ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు టీటీడీతో పాటు  అటవీ శాఖను వేధిస్తున్న పెద్ద ప్రశ్న. అసలు చిరుతలు అటుగా ఎందుకు వస్తున్నాయో ఖచితంగా తెలుసుకోగలిగితే వాటిని రాకుండా చూసే అవకాశమూ కొంత  మేర ఉంటుందనే చెప్పాలి. వన్యమృగాలను  చూస్తే ఎవరైనా హడలి  పోవాల్సిందే. అందులోనూ పులులు, చిరుతలు, ఏనుగులను చూస్తే ఆ భయం పది రెట్లు అవుతోంది. అలాంటిది భక్తుల నడకమార్గంలో  చిరుతలు  తిరుగుతున్నాయని తెలియడం, అందులో ఐదు చిరుతలు చిక్కడంతో ఇప్పుడు భద్రత చర్చనీయాంశమైంది. కర్ర చేతికిచ్చినంత మాత్రాన చిరుత వెనక్కి తగ్గుతుందా అన్నది కూడా పెద్ద ప్రశ్నే….గోవిందా.. గోవిందా అంటూ నడకదారిలో వెళ్లే యాత్రికులు ఇప్పుడు వామ్మో  చిరుత..

వామ్మో చిరుత అంటూ కొండ మీదకు పరుగులు తీస్తున్నారు. తొలి అనుమానం నిజమైనప్పటి నుంచి ఇంతవరకు అడపా దడపా చిరుత ఆనవాళ్లు తెలుస్తూనే ఉన్నాయి. జూన్‌ 24 నుంచి ఇప్పటిదాకా మొత్తం ఐదు చిరుతల్ని బంధించిన అటవీ అధికారులు… అడవిలో ఇంకా ఒకటి రెండు ఉంటాయని అనుమానిస్తున్నారు. ఒక చిరుతను  జూకు తరలించే లోపు మరోకటి బోనులో  చిక్కుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆపరేషన్ చిరుతలో భాగంగా నడకమార్గంలో దాదాపు 300ట్రాప్ కెమెరాలు, అధునాతన బోన్లు ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలను నిరంతరం మానిటరింగ్ చేస్తూ వన్య మృగాల సంచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత చిక్కినట్లా లేదా అన్న ప్రశ్నకు కూడా ఇంకా సమాధానం దొరకాల్సి ఉందంటున్నారు.

ఇందుకోసం చిరుతల నుంచి నమూనాలు సేకరించారు. అటవి నుంచి ఏడు కొండల వైపు చిరుతలు రావడానికి  రెండు మూడు కారణాలున్నాయని  చెబుతున్నారు. గంటా మండలం, నానాల గవి దగ్గర 225 ఎకరాల విస్తీర్ణంలో అకేసియా చెట్లు పెంచడం, చిరుతలు అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటున్నారు. అకేసియా చెట్లను కొట్టేసిన తర్వాత చిరుతలు మనుషులు తిరిగే ప్రాంతాల వైపుకు  వస్తున్నాయని గుర్తించారు. దారి పొడవునా ఏర్పాటు చేసిన అంగళ్ల వల్ల కూడా చిరుతలు, వన్యప్రాణులు ఆకర్షితమవుతున్నాయని అంచనా  వేస్తున్నారు. అంగళ్ల వాళ్లు విసిరేసే వ్యర్థ పదార్థాలు చాలా  దూరం వరకు  పడిపోయి వాటి వాసనకు చిరుతలు, ఎలుగుబంట్లు వస్తున్నాయని త్వరలో ఎనుగుల సంచారం పెరిగే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు.

ఇప్పటికే బస్సు రూటులో రెండు మూడు సార్లు ఏనుగుల గుంపు తారసపడింది. యాత్రికులు కూడా తాము తెచ్చుకున్న ఆహార పదార్థాలను కొండ ప్రాంతాల్లో పడేస్తుండటం సహేతుకం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న జింకల పార్కును తొలగించినప్పటికీ భక్తులు వేసే ఆహార పదార్థాల కోసేం జింకలు రావడం, వాటి కోసం చిరుతలు సంచరించడం జరుగుతోందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. తిరుమల కొండలపై వన్య మృగాలు తిరగడం పెద్ద విషయమేమీ కాదన్నది అటవీ శాఖ వాదన. కాకపోతే  గతంలో భక్తులు తప్పెట్లు, తాళాలు, పాటలతో పెద్దగా అరుస్తూ వెళ్లేవారు. అప్పుడు ఆ శబ్దాలకు అటవీ జీవులు దూరంగా ఉండేవి.

భక్తులు ఇప్పుడా కల్చర్ మానేశారు. దానితో అవి ధైర్యంగా వచ్చేస్తున్నాయి. భక్తులు మళ్లీ పాత పద్ధతులకు వెళితే మంచిదే. మరో పక్క ఆహార పదార్థాలు విసిరేసే పద్ధతి కూడా మానుకోవాలి. అంతే కానీ చేతి కర్ర వల్లే పూర్తి ప్రయోజనం ఉండకపోవచ్చు. కొంత మేర అయితే ఉంటుందనే అనుకోవాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి