చంద్రబాబుపై జగన్ కక్షకట్టారా.. ఒక రకంగా వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నారా.. అవును మీరు వింటున్నదీ నిజమే…జగన్ పనిగట్టుకుని, కసి పెంచుకుని చంద్రబాబు వెంట పడుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఎలా ఉన్నా సరే.. ఇప్పటికిప్పుడు చంద్రబాబును వదిలిపెట్టబోనని జగన్ భీష్మించుకు కూర్చున్నారు. తాను కేసీఆర్.. కాదని జగన్మోహన్ రెడ్డినని చెప్పేందుకు ఏపీ సీఎం ప్రయత్నిస్తూనే ఉన్నారు.
చిట్టా చాలా పెద్దదే ఉంది. ఫస్ట్ బ్లడ్ ఇప్పుడే కారింది. రాజకీయ కక్షసాధింపు తారాస్థాయికి చేరే టైమ్ వచ్చిందని చెప్పక తప్పదు. చంద్రబాబుపై ఉన్న ఆరోపణలను జగన్ రెడ్డి ఒకటొకటిగా బయటకు తీస్తారని అనుకోవాలి. అనుకున్నది ఒకటైతే మరో కేసును బయటకు తీసి మరీ చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని జగన్ అనుకున్న తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది.
నిజానికి చంద్రబాబుపై తొలి కేసు తెలంగాణలోనే నమోదైంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు అప్పటి తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి చేసిన ఓవరాక్షన్ చంద్రబాబు మెడకు చుట్టుకుంది. ప్రస్తుత తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన మోసం చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్ రెడ్డి అడ్డంగా దొరకడం, అందులోనూ ‘బ్రీఫ్డ్ మీ’ అని చంద్రబాబు ఫోన్లో చిక్కడంతో టీడీపీ అధినేత కూడా జైలుకు వెళ్తారనుకున్నా…. సీఎం కేసీఆర్ ఆ వ్యవహారాన్ని మధ్యలోనే వదిలేశారు.కేసీఆర్ ఎందుకో బాబును అరెస్టు చేయించలేదు. కేసును కోల్డ్ స్టోరేజీలోకి నెట్టారు. ఇప్పుడు జగన్ మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు. చివరిదాకా లాగాలని డిసైడయ్యారు.
ఎక్కడా చిక్కకుండా, దొరకకుండా పని కానిచ్చే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో కూడా చిక్కినట్లు కనిపించలేదు. చంద్రబాబు చుట్టూ ఉన్నవారిని కొట్టి కొంత సమాచారం లాగిన జగన్ ప్రభుత్వం దాని ఆధారంగా టీడీపీ అధినేతను ఫిక్స్ చేసే ప్రయత్నంలో ఉంది. కేసు వీగిపోతుందా.. శిక్ష పడుతుందా ఇప్పుడే చెప్పడం కష్టమైనప్పటికీ విచారణలో ఎన్నో మలుపులు తిరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కేసుతో జగన్ వదిలి పెడతారని కూడా చెప్పలేం. ఇతర వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని పోలీసులకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు అవసరమైనట్లుగా అధికారుల బదిలీ ప్రక్రియ కూడా జరిగిపోయింది.
తెలుగుదేశం నాయకుడు ఎం లింగారెడ్డి చెప్పిన దాని ప్రకారం చంద్రబాబుపై 24 కేసులు హౌస్ కమిటీల దర్యాప్తుల్లో ఉండేవి. సాక్ష్యాలు లేని కారణంగా నాలుగు కేసులు అప్పటి సీఎం వైఎస్ విత్ డ్రా చేసుకున్నారు. ఇప్పుడు జగన్ అధికారానికి వచ్చిన తర్వాత ఐదారు కేసులు పెట్టారు. వాస్తవానికి అమరావతి రాజధాని విషయంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని మొదటి నుంచి జగన్ ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే ఆ కేసులోనే చంద్రబాబును ఫిక్స్ చేస్తారని ప్రచారం జరిగింది. ఎవరూ అంచనా వేయని విధంగా స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో అరెస్ట్ చేశారు. ఇక మిగతా కేసులను కూడా వేగవంతం చేయాలని జగన్ ఆదేశించిన నేపథ్యంలో వారానికో, పది రోజులకో కేసు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అరెస్టులు ఉంటాయో ఉండవో చెప్పలేదు. 41ఏ నోటీసులు ఇచ్చి తరచూ విచారణకు పిలవడం మాత్రం తప్పదనిపిస్తోంది. రోజుల తరబడి సీఐడీ కార్యాలయంలో కూర్చెబెట్టి మానసిన ఒత్తిడికి గురి చేయడం కూడా అంతే ఖాయమని చెప్పాలి. ఆంగ్లంలో వివరించాలంటే దాన్ని హెరాస్మెంట్ అని పిలవాల్సి వస్తుంది.
చంద్రబాబును అరెస్టు చేసిన తీరు కాస్త ఇబ్బందికరమైనదేనని అందరూ ఒప్పుకుంటున్నారు. విచారణ జరిపి ఛార్జ్ షీటు దాఖలు చేస్తే సరిపోయే కేసులో అరెస్టు చేసి వేధిస్తున్నారన్న అభిప్రాయమూ కలుగుతోంది. ఇదీ పాతకక్షలు తీర్చుకునేందుకేనని లెక్కలేస్తున్నారు. గతంలో జగన్ పై కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టి జైలుకు పంపినప్పుడు ఆ కేసుల్లో టీడీపీ కూడా ఇంప్లీడ్ అయ్యింది. తనపై కేసు బలంగా మారడానికి చంద్రబాబే కారణమని భావిస్తూ జగన్ కక్ష పెంచుకున్నారు. అందుకే అదును చూసి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆయన్ను అరెస్టు చేయించారని అంటున్నారు, వైసీపీ సోషల్ మీడియా కూడా పరోక్షంగా ప్రచారం చేస్తోంది. IF YOU ARE BAD.. IAM YOUR DAD అన్నది వైసీపీ వారి కొత్త నినాదం. అంటే ఇప్పట్లో వదిలిపెట్టమన్నది వైసీపీ వారి వాదన. చూడాలి మరి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…