టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయనకు ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. చంద్రబాబు నాయుడిపై గతంలో చాలా అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఏ రోజూ జైలుకు వెళ్లలేదు. జీవితంలో మొదటి సారి ఓ అవినీతి కేసులో అభియోగాలపై చంద్రబాబు నాయుడు జ్యుడీషియల్ రిమాండ్ కు వెళ్లారు. ఇది ఏపీలో పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపేనని టిడిపితో పాటు దాని మిత్ర పక్షంగా వ్యవహరిస్తోన్న జనసేన, సీపిఐ కూడా ఆరోపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విపక్షాలంటున్నాయి. అయితే అవినీతి కేసులో న్యాయమూర్తి విధించిన రిమాండ్ కు ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని పాలక పక్షం అంటోంది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ జర్మనీకి చెందిన సిమన్స్ కంపెనీ తో ఒప్పందం కుదుర్చుకుందని అప్పట్లో అన్నారు. యువతలో నైపుణ్యాలను మెరుగు పర్చేందుకు శిక్షణ ఇవ్వడమే దీని ఉద్దేశం. ఇందులోభాగంగా రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు ఇస్తే సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ గా ఇస్తుందని కేబినెట్ లో నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చెప్పారు. సిమన్స్ కంపెనీ ఒక్క పైసా కూడా విడుదల చేయకుండానే ఏపీ ప్రభుత్వం వాటాగా 371 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ నిధుల విడుదల విషయంలో ఐఏఎస్ అధికారులు అభ్యంతరాలు చెప్పినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేసి నిధులు విడుదల అయ్యేలా చేశారని ఆరోపణలు వచ్చాయి.
ఈ 371 కోట్ల రూపాయలను డొల్ల కంపెనీలకు తరలించి అక్కడి నుండి చంద్రబాబు నాయుడు,ఆయన తనయుడు లోకేష్ లకు అందించారన్నది అభియోగం ఈ కేసు ఎలా బయటకు వచ్చిందంటే నిధులు తరలించిన డొల్ల కంపెనీలు జి.ఎస్.టి. రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దాంతో జి.ఎస్.టి. లోని ఇంటెలిజెన్స్ విభాగం ఈ కంపెనీలు ఏం వ్యాపారాలు చేస్తున్నాయని నిఘా పెడితే అసలు బండారం బయట పడింది. అసలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నది సిమన్స్ కంపెనీ కానే కాదు. భారత్ లోని సిమన్స్ కంపనీలో పనిచేసే ఒక ఉద్యోగే తన పేరు మార్చి ఫేక్ కంపెనీ క్రియేట్ చేసి ఈ మొత్తం అక్రమ వ్యవహారాన్ని ముందుకు నడిపినట్లు తేలింది. దీంతో జి.ఎస్.టి. అధికారులు అప్పటి ఏపీ ప్రభుత్వంలోని ఏసీబీ అధికారులకు ఉప్పందించారు.
ఏసీబీ అధికారులు చంద్రబాబు నా యుడికి ఈ అక్రమాల గురించి చెప్పినా ఆయన మౌనంగా ఉండడంతో ముందుకు అడుగు వేయలేదు ఏసీబీ. ఈ కేసుపై ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. ఈడీ దర్యాప్తులో ఇప్పటికే కుంభకోణానికి సంబంధించి సాక్ష్యాధారాలు దొరకడంతో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇపుడు చంద్రబాబు నాయుణ్ని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు రిమాండ్ విధించడానికి వీల్లేదని బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సిఐడి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబు నాయుడికి రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
ఇక చంద్రబాబు నాయుడి అరెస్ట్ తో తెలుగుదేశం పార్టీ భగ్గు మంది. ఇది జగన్ మోహన్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగా రాజకీయ కక్షసాధింపులో భాగంగా చేయించిన అరెస్టేనని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వారు ఆరోపించారు. చంద్రబాబు నాయుణ్ని జైలకు పంపడానికి నిరసనగా ఏపీ వ్యాప్తంగా టిడిపి బంద్ కు పిలుపు నిచ్చింది. ఈ బంద్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు సిపిఐ నారాయణ కూడా మద్దతు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు కాబట్టి ప్రతిపక్షనేతలను కూడా జైలకు పంపాలని అనుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడికి చివరి వరకు తాను మద్దతుగా ఉంటానన్నారు పవన్ కళ్యాణ్.
అటు సిపిఐ నేత నారాయణ కూడా ఏపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరిగ్గా లేదని ఆయన ఆరోపించారు. టిడిపి బంద్ కు పూర్తి మద్దతు ప్రకటించారు.నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడిపై చాలా కేసులు ఉన్నాయి. ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇంత వరకు ఏ ఒక్క కేసులోనూ చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లలేదు. ఈ కేసులోనూ చంద్రబాబు నాయుడికి బెయిల్ వస్తుందని రిమాండ్ విధించే పరిస్థితులు ఉండవని టిడిపి నేతలతో పాటు జనసేన కూడా భావించింది.చంద్రబాబు నాయుడి తరపున ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూధ్రా వాదనలు వినిపించడంతో ఎలాగైనా సరే చంద్రబాబును జైలుకు వెళ్లకుండా కాపాడగలరని అనుకున్నారు. అయితే న్యాయమూర్తి మాత్రం సిఐడీ వాదనలతో ఏకీభవించారు. అందుకే రెండు వారాల పాటు రిమాండ్ విధించారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…