వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీల మద్దతుతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ను గద్దె దింపాలని భావిస్తోన్న చంద్రబాబు నాయుడికి ఒక విధంగా ఆయన అరెస్ట్ సమయంలో విపక్షాలన్నీ మద్దతుగా నిలిచాయి. చంద్రబాబు నాయుడి అరెస్టును అన్ని పార్టీలూ ఖండించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో పాటు భారత కమ్యూనిస్టు పార్టీ, జనసేన పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. చంద్రబాబు నాయుడి అరెస్ట్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్ని పార్టీలూ విమర్శించాయి. అరెస్ట్ ప్రక్రియలో ఎలాంటి నిబంధనలనూ పాటించలేదని నిరంకుశంగా వ్యవహరించారని విమర్శించారు.
చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసిన వెంటనే కేంద్రంలో బిజెపికి మిత్ర పక్షంగా ఉంటోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి పూర్తి మద్దతు ప్రకటించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు అత్యంత దుర్మార్గమని ఆయన దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్ మోహన్ రెడ్డి పార్టీకి చెందిన నేతల అక్రమాలను తాము కూడా తిరగతోడతామని హెచ్చరించారు. ఇక ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చంద్రబాబు అరెస్ట్ లో చట్టాలు నిబంధనలను గాలికి వదిలేశారని విమర్శించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి^నారాయణ, ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ ఇద్దరూ కూడా చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.
అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చిన తరుణంలో టిడిపి నేతలతో పాటు టిడిపికి మద్దతుగా ఉన్న విపక్షాలన్నీ కూడా చంద్రబాబును రిమాండ్ కు పంపే పరిస్థితులు ఉండవనే అనుకున్నారు. కోర్టులకు సంబంధించిన వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడికి ఉన్న అవగాహన సమకాలీన రాజకీయ నేతల్లో ఎవరికి లేదని..చంద్రబాబు కచ్చితంగా బెయిల్ తో బయటకు వస్తారని భావించారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును జైలుకు తరలించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజున బందుల గురించి ఎవరూ ఆలోచన చేయలేదు. కానీ ఆయన జైలుకు వెళ్లడంతో దానికి నిరసనగా రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది టిడిపి. దీనికి జనసేన, సిపిఐలు మద్దతు ప్రకటించాయి.
చంద్రబాబు నాయుడి అరెస్ట్ ను ఖండించిన ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరిట టిడిపి బంద్ కు బిజెపి మద్దతు ఉన్నట్లు సోషల్ మీడియాలో లేఖ విడుదల అయ్యింది. అయితే మర్నాటి ఉదయానికి పురంధేశ్వరి దాన్ని ఖండించారు. తన లెటర్ హెడ్ ను తన ప్రమేయం లేకుండానే ఎవరో వాడారని ఆరోపిపంచిన పురంధేశ్వరి దానిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకించిన పురంధేశ్వరి అంతకు ముందు చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసిన వైనంపై ఆంగ్ల దిన పత్రికలో కథనం వచ్చినపుడు రాజకీయ దుమారం రేగింది. ఆ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ఐటీ నోటీసులనేవి సర్వసాధారణమని వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చంద్రబాబుకు మద్దతుగా వ్యాఖ్యానించారు. దానికి ముందు తన తండ్రి పేరు మీద వంద రూపాయల నాణెం విడుదల సమయంలోనూ చంద్రబాబుకు అనుకూలంగానే ఆమె వ్యవహారాలు నడిపి జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ ఉండేలా చేశారని ప్రచారం జరిగింది.
చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతో ఆయన తనయుడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. తమకు అండగా నిలిచిన ఇతర విపక్షాలన్నింటినీ కలుపుకుని ముందుకు పోవాలని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నింటితో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలన్నది ఆయన ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చి ఆయన జైలు నుండి విడుదల అయ్యి పరిస్థితులను సాధారణ స్థితికి వచ్చే వరకు యువగళం యాత్రను నిలిపివేయాలని లోకేష్ నిర్ణయించుకున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…