సీన్ మారుతోందా..కొత్త సినిమా కనిపిస్తుందా.. చంద్రబాబు అరెస్టు ప్రభావం తెలంగాణ రాజకీయాలపై ఉంటుందా. ఐటీ ప్రొఫెషనల్స్ ధర్నాలతో హైదరాబాద్ జనంలో చలనం వచ్చిందా.. అరెస్టుపై కేసీఆర్ ఆరా తీస్తున్నప్పటికీ… మాకు సంబంధం లేదని కేటీఆర్ ఎందుకు అంటున్నారు. టీకాంగ్రెస్ నేతల తీరు ఎలా ఉంది. ఇదే అదునుగా కాంగ్రెస్, టీడీపీ పొత్తు కుదరాలని వాళ్లు కోరుకుంటున్నారా…
కొన్ని ఘటనలు రాజకీయ చరిత్రను, వర్తమానాన్ని మార్చేసే అవకాశం ఉంటుంది. రాజకీయ శక్తుల పునరేకీకరణకు తెరతీసీ ఛాన్సు ఉంటుంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్టు కూడా ఆ రూటులోనే వెళ్లొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలకు విడదీయరాని సంబంధం ఉన్న నేపథ్యంలో ఏపీ పరిణామాల ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వారం కూడా కాకముందే హైదరాబాద్ ఐటీ కారిడార్ స్పందించింది. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించింది. అధికార బీఆర్ఎస్ వ్యూహాత్మక దూరం పాటించినా ఇతర పార్టీలు ఒకటొకటిగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నాయి. ఇదే రేపటి రాజకీయానికి నాంది కావచ్చు…
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. విజయవాడ ఏసీబీ కోర్డు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా.. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్టు కావటం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి.ఒక పక్క కేసులు కొనసాగుతుండగానే మరో పక్క చంద్రబాబు అరెస్టుపై నిరసనలు నిర్వహిస్తున్నారు. బాబుకు తోడుగా మేము సైతం అంటూ నిరసనలు, రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఐటీ కారిడార్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు చంద్రబాబు అరెస్టును ఘండిస్తూ నిరసనలు నిర్వహించారు. ఆయన్ను విడుదల చేయాలనే నినాదంతో హైదరాబాద్ ఐటీ క్షేత్రం దద్దరిల్లింది. బుధవారం మధ్యాహ్నం విప్రో కూడలిలోనూ, పొద్దుపోయిన తర్వాత కూకట్ పల్లిలోనూ వాళ్లు ఐయామ్ విత్ బాబు అని ప్లకార్డులు పట్టుకుని నినదించారు. వీ స్టాండ్ విత్ విజనరీ చంద్రబాబు అంటూ ఫాల్స్ కేసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతర శ్రామికుడు చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని కోరారు. చంద్రబాబు చలవ వల్లే తాము ఇంతటి ఉన్నత స్థితిలో ఉన్నామని చెప్పుకున్నారు.
హైదరాబాద్ లో మొదలైన నిరసనలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ గా మారే అవకాశాలూ ఉన్నాయి. ఐటీ కారిడార్ లో నిరసన తెలియజేసిన వారిలో 90 శాతం మంది ఆంధ్రప్రదేశ్ మూలాలున్న వాళ్లే. హైదరాబాద్ లో స్థిరపడిపోయి ఇళ్లు కొనుక్కుని, భాగ్యనగర పరిసరాల్లోనే ఓటు కూడా పొందిన వాళ్లు అయి ఉంటారు. దానితో వారు, వారి కుటుంబాల ఓట్ల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై పడుతుందని కూడా భావించాల్సి ఉంటుంది. అందుకే చంద్రబాబు అరెస్టు విషయమై తెలంగాణలోని వివిధ పొలిటికల్ పార్టీలకు చెందిన నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బాబు అరెస్టుపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మినిట్ టూ మినిట్ అప్డేట్స్ తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఏపీలోని పలువురికి ఫోన్లు చేయించి అక్కడి పరిస్థితిలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
ఎంత లేదన్న బాబు అరెస్టు ప్రభావం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీపై ఖచితంగా ఉంటుందనే చెప్పాలి. ప్రస్తుతానికి బీఆర్ఎస్ మౌనంగానే ఉంది. అది పక్క రాష్ట్రం వ్యవహారం అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ఐటీ మంత్రి కేటీఆర్ కూడా అది వేరే రాష్ట్రం వ్యవహారం అన్నట్లుగా మాట్లాడుతూ ఇంటెన్సిటీని తగ్గించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎలాంటి కామెంట్ చేసినా తెలంగాణపై ప్రభావం ఉంటుందని ఆయనకు తెలుసు. చంద్రబాబును సమర్థించినా, వ్యతిరేకించినా కొన్ని సామాజికవర్గాలను దూరం చేసుకున్నట్లే అవుతుంది. మాజీ ముఖ్యమంత్రి అరెస్టు చట్ట విరుద్దమనే చెప్పాల్సి రావచ్చు. అప్పుడు ఒక వర్గానికి కోపం రావచ్చు. ఇదంతా మాకెందుకులే అని కేటీఆర్ దూరం జరిగినా..ఏదో ఒక రోజున స్పందించక తప్పని పరిస్థితి రావచ్చు. బీఆర్ఎస్ ఒక స్టాండ్ తీసుకోక తప్పక పోవచ్చు, అదే టైమ్ లో ప్రస్తుతానికి బీఆర్ఎస్ లో ఉంటూ కాంగ్రెస్ వైపు చూస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు .. ఏపీ మాజీ సీఎం అరెస్టును ఖండించారు. అరెస్టు ముమ్మాటికి అన్యాయమని దాన్ని ప్రతీ ఒక్కరూ ఖండించాలని ఆయన కోరారు. తుమ్మల ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో చంద్రబాబు దగ్గర మంత్రిగా చేశారు. ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయని చెప్పక తప్పదు. మరో పక్క అరెస్టును ప్యతిరేకించిన వారిలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా ఉన్నారు. అధికారదాహంతో జగన్ ప్రవర్తిస్తున్నారని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను అధోగతి పాలు చేసిన జగనే పెద్ద జైలు పక్షి అని ఆరోపిస్తూ.. పరక్షంగా తెలంగాణ కాంగ్రెస్ స్టాండ్ ను ఆమె వెల్లడించారు.
కమ్యూనిస్టులు ఇప్పటికే చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ టీడీపీకి సంఘీభావం ప్రకటించారు. ఏపీ పోలీసుల తీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ. రాజా అభిప్రాయపడ్డారు. సీపీఐ రాష్ట్ర కమిటీ ఇప్పటికే ఖండించిందని ఆయన గుర్తు చేశారు. టీడీపీకి సహజంగా మిత్రపక్షాలైన వామపక్షాలు అనివార్య కారణాల వల్ల దూరం జరిగాయి. టీడీపీ ఇప్పుడు బీజేపీతో స్నేహాన్ని ఆశిస్తున్నందు వల్ల ఆ లింకు తెగిపోయే వరకు కూడా ఆగాల్సిన అనివార్యత వారికి ఉంది.
తెలంగాణ కాంగ్రెస్ అధికారికంగా స్పందించేందుకు కొంత సమయం పట్టొచ్చు. నిజానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రికి చాలా కావాల్సిన వ్యక్తి. కాంగ్రెస్ అధిష్టానానికి టీడీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉన్నందున ఎప్పుడైనా చర్చలకు, పొత్తులకు రెడీగా ఉండొచ్చు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నందు వల్లనో మరే కారణం చేతనో టీడీపీ అధినేత, బీజేపీ వైపు కొంచెం మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు అరెస్టు తర్వాత బీజేపీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో చంద్రబాబు కమలం పార్టీకి దూరం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దానితో తొలుత అసెంబ్లీ ఎన్నికలు జరిగే తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాల పొత్తు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ కు మొదటి నుంచి అనుమానంగానే ఉంది. చంద్రబాబుకు రేవంత్ కోవర్ట్ అని మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో ఆరోపించారు కూడా. బీఆర్ఎస్ పార్టీ ముందే అభ్యర్థులను ప్రకటించిప్పటికీ విజయావకాశాలపై విశ్వాసం కుదరడం లేదు. కాంగ్రెస్ పార్టీ దూసుకొస్తుందన్న అనుమానమూ అధికార పార్టీలో కలుగుతోంది. పైగా కాంగ్రెస్, టీడీపీ కలిస్తే తెలంగాణలో ఉన్న సెటిలర్ల ఓట్లు ఆ కూటమికి పడే అవకాశాలుంటాయి. అప్పుడు ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చే ఛాన్సే ఎక్కువగా ఉంటుందని బీఆర్ఎస్ భయపడుతోంది. ఏదేమైనా ఓ అరెస్టు తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అవకాశం ఉంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…