మునుగోడు నుంచి తప్పుకున్న చంద్రబాబు

By KTV Telugu On 13 October, 2022
image

మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయాలా వద్దా వారం రోజులు ఆలోచించి చివరికి పోటీ చేయకపోవడమే అన్ని విధాలుగా ఉత్తమం అని నిర్ణయించుకున్నారు తెలుగుదేశ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఒక దశలో పోటీ చేయడానికి మొగ్గు చూపించినా…ఆ తరువాత ఆయన మనసు మార్చుకున్నారు. ఈ మేరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కిన నరసింహులు ఒక ప్రకటన చేశారు. నాయకులు, కార్యకర్తల అభిప్రాయాల మేరకు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని నిర్ణయించామని నరసింహులు తెలిపారు. చంద్రబాబు ఇటీవల తెలంగాణ టీడీపీ నేతలతో పాటు మునుగోడు టీడీపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. మునుగోడులో పోటీ చేయడంపై ఆ మీటింగ్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. పోటీకి సిద్దంగా ఉన్నట్లు మునుగోడు నేతలు బాబుకు వివరించినట్లు సమాచారం. అంతేకాదు..టీడీపీకి బీసీలు ఎప్పటి నుంచో వెన్నెముకగా ఉన్నారని…అందుకే బీసీ అభ్యర్థికి టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలిసింది. మునుగోడు నియోజకవర్గంలో జక్కలి ఐలయ్యకు బీసీ నేతగా మంచి పేరు ఉన్నందున అతనికే టీడీపీ టికెట్‌ ఇస్తారని అనుకున్నారు. మునుగోడులో పోటీ చేయడం వల్ల తెలంగాణలో పార్టీ ఉనికి కాపాడుకోవటమే కాకుండా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి లోపాలను సరిదిద్దుకుని మళ్లీ పుంజుకోవచ్చనే ఆశాభావాన్ని తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేశారు. అయితే చివరి నిమిషంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకుని పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటిచడంతో టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.