కట్టకుండానే ప్రారంభోత్సవం –  పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు కథేంది ?      

By KTV Telugu On 15 September, 2023
image

KTV TELUGU :-

పాలమూరు -రంగారెడ్డి  ప్రాజెక్టుకు  నిన్నామొన్ననే పర్యావరణ అనుమతులు వచ్చాయి. అప్పుడే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.  అప్పుడే ప్రాజెక్టు కట్టేశారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.  దక్షిణ తెలంగాణ మొత్తం సస్యశ్యామలం అయిపోతుందని ప్రచారం ప్రారంభించేశారు. నిజానికి కాళేశ్వరం పై లక్ష కోట్లకుపైగా ఖర్చు పెట్టారు కానీ..  పాలమూరు – రంగారెడ్డి నిర్లక్ష్యానికి గురైందన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసేస్తున్నారు కానీ.. అసలు అ ప్రాజెక్టుల  కనీస పనులు కూడా జరగలేదు. ఓ మోటార్ పెట్టి.. ఆన్ చేసేస్తున్నారు.  ఇలాంటి వాటి వల్ల దక్షిణ తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరథం పడతారా ?

పాలమూరు రంగారెడ్డి  30 నెలల్లో పూర్తిచేస్తామని కేసీఆర్ అదే పనిగా ప్రచారం చేసిన ప్రాజెక్టు.  ఇప్పుడు అది 90నెలలకు చేరడంపై ఒకవైపు అసంతృప్తి వ్యక్తమవుతుంటే ఇదిగో ప్రారంభోత్సవమని తెలంగాణ సర్కార్ హడావుడి చేస్తోంది. ‘పాలమూరు-రంగారెడ్డి’సాగునీటి ఎత్తిపోతల పథకం తెలంగాణలో రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవానికి బీఆర్‌ఎస్‌ సర్కారు ఏర్పాట్లు చేసింది.   దీనిపై సాగునీటి రంగ నిపుణులు, రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి.  ఎన్నికలు అక్టోబరు తర్వాత ఎప్పుడైనా రావచ్చనే ఉద్దేశంతో అన్నింటికీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.  ఇది ప్రజల్లో వ్యతిరేకతకు కారణం అవుతుంది కానీ.. ప్రాజెక్టు కట్టేశారని ప్రజలు నమ్మరని అంటున్నారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మక్తల్ నియోజకవర్గం నుంచి చేపట్టేలా రూపొందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రీ డిజైన్ లో భాగంగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోతిగుండు ప్రాంతం నుంచి నీటిని తరలించేలా రూపకల్పన చేశారు. ఇందులో వివిధ దశల్లో రిజర్వాయర్లను ఏర్పాటుచేసి సుమారు 90 టీఎంసీల నీరు నిల్వఉండేలా రిజర్వాయర్లను రూపొందించారు. ఈ పథకం ప్రారంభంలో 30వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పూర్తవుతుందని భావించిన ప్రభుత్వం ప్రస్తుతం దశలవారీగా వ్యయం పెంచింది.  తర్వాత అంచనా వ్యయం 50వేల కోట్లకు చేరింది. కేవలం నాలుగేళ్లలో ఈ పథకాన్ని పూర్తిచేసి రైతులకు సాగునీటిని అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.  పదేళ్లు గడుస్తున్నా  ఏ ఒక్క రిజర్వాయర్ ద్వారా కూడా సాగునీరు అందించలేదు.

60  రోజులపాటు రోజుకు రెండు టీఎంసీల శ్రీశైలం నీళ్లను ఎత్తిపోయడమే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లక్ష్యం.  ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించినప్పుడు కేసీఆర్ తనదైన శైలిలో మాటుల చెప్పారు. దేశచరిత్రలో నిర్వాసితులకు కనివినీ ఎరుగని పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ పరిహారం జాడ లేదు.   కానీ ఈనెల 16న వెట్‌రన్‌కు గ్రీన్‌సిగల్‌ ఇచ్చేశారు. దీన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రాజెక్టు పనులు 30శాతం కూడా పూర్తికాలేదు  మొత్తం ప్రాజెక్టులో 31 పంపులకుగాను కేవలం ఒక పుంపునకు మాత్రమే వెట్‌రన్‌ చేపడుతున్నారు. అసంపూర్తి ప్రాజెక్టు అని చెప్పడానికి ఇంత కన్నా సక్ష్యం అక్కర్లేదు.  కొద్దిపాటి పనులు చేసి, సర్కారు మసిపూసి మారేడుకాయ చేస్తున్నదంటూ ప్రతిపక్షాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రాజెక్టు పనుల నాణ్యత కూడా ప్రశ్నార్థకమేనన్న ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

ఉత్తర తెలంగాణలో ప్రారంభించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీటిని అందిస్తున్నారు. కానీ పాలమూరు లిఫ్ట్​ఇరిగేషన్ ​పరిస్థితి మాత్రం ఎక్కడిదక్కడే ఉన్నట్లు అయింది.  డీపీఆర్​ను కేంద్రానికి సరైన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించకపోవడంతో పాటు అటవీ పర్యావరణ అనుమతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయి. మొండితనంతో ముందుకెళ్లి అనుమతులు రాకముందే పథకానికి టెండర్లు పిలిచి ప్రారంభించడంతో అసలు సమస్యలు మొదలయ్యాయి.  ఇటీవలే అనుమతులు వచ్చాయి.   అప్పటి వరకూ అనుమతులు లేకుండా చేసిన పనులతోనే ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.

తొందరపాటు ప్రారంభోత్సవాలతో  అనేక సమస్యలు రానున్నాయి.   పొలాలకు నీళ్లు అందే అవకాశం ఉండకపోగా… పెద్ద ఎత్తున ముంపు ఉంటుందని భావిస్తున్నారు.

శాస్త్రీయంగా డ్రైరన్‌ చేపట్టిన నెలరోజుల తర్వాత వెట్‌రన్‌ను చేపట్టాలి. ఆగమేఘాల మీద 13రోజులకే వెట్‌రన్‌కు శ్రీకారం చుడుతోంది ప్రభుత్వం.   వట్టెం జలాశయం కోతకు గురైతే, 50కిపైగా గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ప్రాజెక్టుకు గంటకొట్టే పేర సర్కారు నిధులతో ఎన్నికల ప్రచారం చేసేసుకుంటున్నారు.   కాళేశ్వరంపై చూపిన శ్రద్ధ పాలుమూరు-రంగారెడ్దిపై లేదనే విషయమై రచ్చ ఇప్పటికే జరు గుతూ ఉన్నది. సాధారణ నిర్మాణం, ప్రధాన కాలువలతోపాటు పంట కాలువలనూ కట్టాలి. నార్లపూర్‌, ఎదుల, ఉద్ధండాపూర్‌, కరివెన నాలుగు ప్రాజెక్టుల్లో నీళ్లు నింపడం ద్వారా సాగునీరు ఇచ్చినట్టుగా భావిస్తున్నారు.  కల్వకుర్తి ఎనిమిది పంపులకుగాను మూడే నడుస్తున్నాయి. ఐదారేండ్లుగా ఐదు పంపులను రికవరీ చేయనేలేదు. శ్రీశైలం నుంచి నీళ్లు రాలేదు. అవివస్తేనే పాలమూరు-రంగారెడ్డికి సార్థకత. వర్షాభావ పరిస్థితి కొనసాగితే ఈనాలుగు ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని కూడా నింపలేరు.

ఒక్క పంపుతో నార్లపూర్‌ ప్రాజెక్టును ఎలా నింపుతారనేది అందరూ ప్రశ్నిస్తున్న అంశం.  నిజాలను చెప్పకుండా ఇంకెంత కాలం ప్రజలను మభ్యపెడతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.  2004లో చేపట్టిన ప్రాజెక్టులే పూర్తిచేయలేదు.  పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న విపరీత జాప్యంతో రూ.35,200 కోట్ల బడ్జెట్‌ కాస్త మూడు రెట్లు పెరిగి రూ.75 వేల కోట్లకు చేరిందని ఇరిగేషన్‌ శాఖ చెబుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 33లక్షల ఎకరాలకుగాను 10లక్షల ఎకరాలకు కూడా సాగునీటిని అందించలేకపోయారు.  కోయిల్‌సాగర్‌ 32 వేల ఎకరాల ఆయకట్టును మరో 50వేల ఎకరాలకు పెంచే ప్రయత్నం చేసినా, పదెకరాలు కూడా పెరగలేదని రికార్డులుచెబుతున్నాయి.

అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఊరూరా కృష్ణా జలాలు చల్లే ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. దీని కోసం కోట్లు ఖర్చయినా ప్రభుత్వం తగ్గే అవకాశం లేదు. కానీ పూర్తి కాని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం మాత్రం జరగబోతోంది.

నీళ్లు, నిధులు, నియామకల లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఉద్యోగాల ఎంత సక్కగా ఇస్తున్నారో… నీళ్లు కూడా అంతే సక్కగా ఇస్తున్నారు. ప్రచారం తప్ప.. పదేళ్లలో ప్రజలకు ఏమైనా ఒరిగిందో లేదో వాళ్లే విశ్లేషించుకోవాల్సి ఉంది.

https://youtu.be/s4w5nX2i3zI?si=8PZoGsoyUQG5v_42

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి